Tuesday 18 June 2019

జీవితం-ఫాంటసీ

బెలిపించి బోసినవ్వులతో బాల్యాన్ని గడిపేస్తాం
కృషిచేసి చదువులతో కిశోరం సాగిస్తాం
వలపించే ఆకర్షణతో యవ్వనాన్ని చవిచూస్తాం
కష్టించి నడివయసులో బాధ్యతలను తీరుస్తాం
జ్ఞాపకాలు  తలబోస్తూ వార్ధక్యం సాగిస్తాం
పోరాడి రోగాలతో తుదిశ్వాసను విడిచేస్తాం
అంతా ఇంతే ఏ జీవితం తరచినా

బాధ్యతలు లేనిది బాల్యం,
చిరు బాధ్యతలతో సాగేది కిశోరం
బాధ్యతలను కౌగలించుకొనేది జవ్వనం
బాధ్యతలు తీర్చేందుకు పరితపించేది ప్రౌఢం
చేసింది చాలని చతికిలపడేది వృద్ధాప్యం
ఇలాగే సాగుతుంది జీవన వ్యవహారం

తిండి, నిద్ర, పని
ప్రతీ వారికీ సామాన్యమే,
పరిమాణంలోనే తేడాలు!
స్నేహం, ప్రేమ, ఆప్యాయత;
కడ కంటా ఉంటేనేగా
యాంత్రికత దూరం

కబుర్లూ, కలయికలూ...
ఊహలూ, భావప్రకటనలూ...
ఆటలూ, పాటలూ...
సాహిత్యం, కళలూ...
వ్యర్థాలని భావిస్తే!
ఏం మిగులుతుంది జీవితంలో?
ఎద్దులా పనిచేయటం,
మొద్దులా బతికేయటం తప్ప.

బతుక్కి ఆనందం
జీవితంలో వినోదం
రెండూ ఉన్నప్పుడే
మనసూ, తనువూ తేలికయ్యి
జీవితం అందంగా అనిపిస్తుంది
అవన్నీ సొల్లు అనుకుంటే ఎలా?

రక్తబంధం కన్నా, స్నేహ బంధం;
తియ్యగా అనిపించేది,
ఈ సొల్లు కబుర్ల వల్లనేమో!

ఎవరితోనూ పంచుకోలేని విషయాలు,
స్నేహితులతో పంచుకుంటాం.
చిలిపి పనుల్లో మాధుర్యం,
చెలికాళ్ళ సాంగత్యంలో పొందుతాం.
మనం చేసే పనులు ఎవరికీ నచ్చవు,
మన వయసు స్నేహితులకు తప్ప!
వాళ్ళూ మనలాగే ఆలోచిస్తారుగా..
అందుకే, అందరికీ చెత్తగా అనిపించేవి,
మన దోస్తులకు కొత్తగా కనిపిస్తాయి.
వారితో ఏం మాట్లాడుకున్నా సంతోషమే,
ఏం పనులు చేసినా  ఆనందమే!

జీవితం ఆనందమయం
చేసుకోవడానికి
ఫాంటసీ కొంత ఉండాలి,
ఊహల్లో  విహరించాలి,
కాల్పనికతకు తలుపులు తెరవాలి,
మోనోటనీ గెలవాలి.
స్నేహం అందుకు ఉపయోగిస్తుంది.

కావాలంటే పరిశీలించుకోండి,
గడచిన కాలం మీదుగా...
మీకు లభించిన స్నేహాలని,
వాటి ద్వారా పొందిన ఆనందాన్ని.
తరచి చూస్తే వాస్తవం తక్కువ,
ఊహలు ఎక్కువ ఉంటాయ్.
ఎన్ని సార్లు గుర్తొచ్చినా
అవి నిత్య నూతనంగా ఉంటాయ్.

అనుభవంలోకి వస్తే
విషయం పాతబడుతుంది
ఊహల్లో ఉంటే,
కొత్తదనంతో తళతళ లాడుతుంది

అందుకేనేమో.....
వాస్తవం కన్నా ఊహ
అందంగా ఉంటుంది.

అందం ఎప్పటికీ  ఊరిస్తుంది
ఉత్సాహానికి ఊపిరి నిస్తుంది
విజయాలకు స్ఫూర్తి అవుతుంది
జీవితానికి ప్రత్యేకత సంతరిస్తుంది.

అందుకే నేస్తాలూ...
స్నేహాలను ఆహ్వానించండి
ఫాంటసీకి చోటివ్వండి
జీవితాల్ని ఆనందమయం చేసుకోండి

ఎవడికి తెలుసు?
ఏ ఊహ ఏ స్ఫూర్తినిస్తుందో
ఏ ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందో!!

SSS SRINIVAS VEMURI
Srikakulam, 9492732042