Sunday 19 January 2020

ఓ పాలి అటెల్లొచ్చేద్దాం, బేగి రండి!

అనగనగా ఒక ఊరిలో ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు.......

తరతరాలుగా చెప్పుకుంటూ వస్తూన్న కథ ఇది.  ఈ కథకి మనకీ విడదీయరాని సంబంధం ఉంది. 

మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు ఈ కథని మర్చిపోతారనే భయం మనకి అక్కర్లేదు. 

అయితే ఈ కథ విన్నప్పుడు లాజికల్ గా ఆలోచిస్తే  మనకి ఒక అనుమానం కలిగేది. రాజు కొడుకులు వేటకి వెడితే అడవులకు పోయి వేట సాగించాలి కాని, గేలాలేసుకుని చేపలు పట్టడానికి వెళ్ళటం ఏమిటని? 

అంటే రాజు కొడుకులు వేటకెళ్ళడానికి ఆ రాజ్యంలో అడవులు లేకపోవటం అయినా అయుండిలి, లేదా వేటకెడితే పిల్లలు ఎక్కడ ప్రమాదంలో పడతారో అనే భయంతో ఆ రాజే చేపల వేట కూడా వేటే, అని పిల్లలకు నచ్చజెప్పి ఉండాలి.

లేదా కొడుకులకి అడవికి వెళ్ళి వేటాడే నేర్పు, ప్రయోజకత్వం లేదనే ప్రగాఢమైన విశ్వాసం రాజుకుండాలి.

అదీకాక పోతే ప్రమాదం ఉందని రాజుగారి పిల్లలే ముందు జాగ్రత్త చర్యగా చేపల వేటే మంచిదని భావించి ఉండాలి.

అదీ కాకపోతే ఆ రోజుల్లో రాజంటే తన అధికారాన్ని ప్రజా సంక్షేమానికే ఉపయోగించి, తన ఇల్లు నడుపుకోవడానికి మాత్రం సామాన్య ప్రజలమాదిరే తన  పిల్లల్నీ ఆహారం సంపాదించడానికి చేపల వేటకు పంపించే ఉత్తముడు అయి ఉండాలి.

ఇవేవీ కాకపోతే భూమి మీద మూడొంతులు భాగంలో రెండొంతులు నీరే కాబట్టి సముద్రాన్ని నమ్ముకుంటే మంచిదని తన రాజధానిని సముద్రతీరంలో రాజు స్థాపించిన, తొలిరోజులైనా అవి అయి ఉండాలి. 

అదే కనుక జరిగుంటే ఈ కథ ఖచ్చితంగా తెలుగు నేలమీదే పుట్టి ఉండాలి. కారణం మన రాష్ట్రానికి అత్యంత పొడవైన 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది.  అందుకే ఈ కథ అంటే మనకి అంతిష్టం.

మద్రాసు నుంచి కర్నూలు, అక్కడ నుంచి భాగ్యనగరం, ఆ పైన అమరావతి, ఇప్పుడు మళ్ళీ విశాఖకి మన రాజధాని మారింది.

విశాఖ విశాలమైన సుందర నగరం.  ఇక్కడ భూ, జల, వాయు మార్గాలు ఉన్నాయి.  అయితే దేశ రక్షణ రీత్యా ఇక్కడ ఉన్న సముద్ర తీర భద్రత కోసం చాలాకాలం  రాజధాని ఆలోచన ఇక్కడ రాలేదు. 

మళ్ళీ ఇంతకాలానికి ఇక్కడ రాజధాని ప్రస్తావన వచ్చింది.  దానివల్లే మనం చిన్నతనంలో చదువుకున్న కథ ఇంకా కొన్ని తరాలకు చిరంతనంగా సాగుతుందనే భరోసా వచ్చింది.

పూర్వం రాజులు ఉండేవారు. ప్రస్తుతం మనదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అంటే ప్రజలు తమ్ము తామే పరిపాలించుకునే వ్యవస్థ. ఇక్కడ ప్రజలే రాజులు.  ప్రతీ రాజుకు ఏడుగురు కొడుకులు ఉన్నా లేకపోయినా కనీసం ఒక కొడుకో కూతురో ఉండి ఉంటారు.  వీళ్ళంతా బాగా చదువుకుని మంచి, మంచి ఉద్యోగాలు చేస్తారు. 

అన్నిటి లోనూ ఆంగ్లేయులను అన్వేషించే మన తెలుగు వారు మానసిక ఆనందానికి, వారి లాగే చేపల వేట లేదా ఫిష్ హంటింగ్ చేసేందుకు ముచ్చట పడతారు.

అలా ముచ్చటపడితే ఇన్ని కోట్లమంది ఫిష్ హంటింగ్ చేయడానికీ, అందరికీ చేపలు దొరకడానికీ సముద్రమే సరిఅయిన వనరు.

పెద్దలు వేటకెడితే పిల్లలు ఇంటిదగ్గర ఉండటం కుదరదు. కాబట్టి వారినీ తీసుకుని వెళ్ళాలి. అలా వచ్చిన పిల్లలు, అంతమంది కిరీటం లేని రాజులు చేపలు పడుతూంటే ఎందుకు ఇలా? అని అడుగుతారు. అప్పుడు పెద్దలు ఇది మన తెలుగు సంస్కృతి నాయనా! దానికి ఉదాహరణగా ఒక కథ చెబుతా విను అని, విక్రమార్కుని కి భేతాళుడు కథ చెప్పినట్టు ఈ కథ చెబుతారు. ఆ రకంగా ఈ తెలుగు కథ చిరంజీవి అవుతుంది.  పిల్లలు కూడా సముద్రం మీద సముద్ర ఉత్పత్తులు వెలికి తీయడంలో మెలకువలు నేర్చుకుంటారు.

మనమింక మృగయావినోదం మాని, మీనవినోదంతో తరిద్దాం.  నేనూ విశాఖలో చేరాను,  వేటకెళ్ళడానికి  ఒక గేలం కొన్నాను.

ఏంటి అలా సూత్తారు, మీరెళ్ళి బేగా ఒక గేలం అట్టుకొచ్చీయిండి, మీనులు తళతళలాడిపోతూ సముద్రంలో అవుపిస్తన్నాయి. ఓ పాలి అటెల్లొచ్చెద్దాం. సరేనా!

(ఇది సరదాకి రాసింది. దీనికి రాజకీయం పులమద్దు)

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి