Saturday 25 January 2020

ఆడపిల్లవి కాదు, ఆత్మలో పిల్లవి.

ఇంటికి అందం
మాటల్లో మకరందం
హృదయానికి ఆనందం
ఆప్యాయతా ప్రబంధం
ప్రకృతి ప్రసాదించిన వరం
నీ ఉదయం తల్లీ!

చిన్న చిన్న గౌనులు
ఘల్లు ఘల్లు గజ్జెలు
గాజుల సవ్వడులు
పరికిణీ రెపరెపలు
సింధూర తిలకాలు
పసుపు రాసిన పాదాలు
నీ ఉనికిని చెప్పే ఉపకరణాలు

చనువుతో తిడతావు
అధికారం చలాయిస్తావు
నాన్న పక్షానికే వస్తావు
అమ్మను అదిలిస్తావు
ఎవరు కష్టపడినా చలిస్తావు
బాధ్యతలు తీసుకుంటావు
కష్టాలు సహిస్తావు
నేనున్నాననే భరోసా ఇస్తావు
అన్నీ చేసి ఆడ- పిల్లవవుతావు

పుట్టింట నువ్వు చేసే సందడి,
జలజల పారే సెలయేరు;
మెట్టింట నీవు చూపే గాంభీర్యం,
నిండుగా సాగే అఖండ గోదావరి;
ఇరవైల వరకూ ఇక్కడ,
ఆ తరువాత అక్కడ.
నువ్వు లేని యింట ఆనందం ఎక్కడ?

పెళ్ళయ్యి నువ్వెళ్ళిపోతే
కళ్ళకొచ్చిన మసక
వెలుగు దూరం చేసినప్పుడు తెల్సిందిరా!
మా యింటి దీపం వేరేయింట
కరిగి వెలుగు నిస్తోందని

నీవు అత్తింటికి వెళ్ళాక
దేవుడిని నమ్మని వాళ్ళు కూడా
గుడికొచ్చి కోరుకుంటారు కన్నా!
అన్నివేళలా నువ్వు 
ఆనందంగా ఉండాలని,

చిన్నతనంలో చీటికీ మాటికీ,
గొడవ పడిన అన్నదమ్ములు
నువ్వెళ్ళి పోయాక
మాటలు మర్చిపోయి
మౌనంగా ఉన్నారు
పండగొచ్చిందంటే పరుగు
ఆడపడుచు చీరతో ఎదురు చూపు
వాడెవడో కాదు,
ఒకప్పుడు నీతో గొడవపడ్డ
నీ అన్న

బావా అంటూ బేలగా పిలిచి
ప్రపంచం మెచ్చే ఘనుడై కూడా
నీఇంటి సేవకుడిగా నిలబడతాడు
వాడి మనసు కోరేది ఒక్కటే
నువ్వు చల్లగా ఉండాలని.
అన్నయ్యల ఆదరణ-
చిన్నతనంలో పోట్లాటలా,
పెద్దయ్యాక బాధ్యతగా ఉంటుంది.
అమ్మ ఆప్యాయత పుట్టింట తిట్టులా,
మెట్టింటి కెళ్ళాక  సూచనలా ఉంటుంది.
నాన్న మనసు ఎప్పుడూ
నీ ఆలోచనలతోనే బెంగతో ఉంటుంది
నువ్వు బాహ్యంగా "ఆడ" పిల్లవి
అమ్మింటి అంతరంగంలో "ఈడ" పిల్లవి

భర్త స్థానంలో ఉన్నప్పుడు
పురుషునికి నీవు ఆస్తివి
జాగ్రత్తగా కాపాడుకున్నా
జారవిడిచే అవకాశం ఉంది
అమ్మింటీకి మాత్రం నువ్వు ఆత్మవి
అందుకేనేమో
ఆపత్సమయంలో అవకాశం లేక
జూదంలో పణంగా పెడితే ధర్మరాజు
ఆత్రంగా వచ్చి ఆదరించాడు
అన్నగా శ్రీకృష్ణుడు.
చెల్లెలికి జరిగిన అన్యాయం
ఎంత కదిలించక పోతే చేస్తాడు చెప్పు,
రాయబారం మొత్తం రసాభాస!
తలుచుకుంటే ఒప్పించలేకనా
అయిదూళ్ళ ఒప్పందం కౌరవులతో!
అయినా విఫలం చేసి కార్యం
యుద్ధానికే తెరలేపింది ఎందుకు
అందరినీ అలా హతమార్చాడంటావ్?
అన్న మనసులో ఆదరణ స్థాయి అది.
అలా అని అందరూ ధర్మజులు కారు
తొడబద్దలు కొట్టే వృకోదరులూ ఉంటారు.
భార్యగా పురుషుడి ఆత్మగౌరవానివి నువ్వు.

మెట్టింట కష్టం ఉంటే
అమ్మింట దీవెనలు
అచ్చంగా నీ కుంటాయ్ తల్లీ
అందుకే నేమో పుట్టింటికోసం
అహరహం పరితపిస్తావు.

చల్లగా ఉండు నాన్నా
ఎక్కడున్నా నీకు మేమున్నాం
అనని పుట్టింటి వాళ్ళు ఉండరు
ఎందుకంటే వారికి
నువ్వు "ఆడ" పిల్లవి కావు
 "ఆత్మలో" ఉన్న  పిల్లవి.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 24.01.2020
9492732042