Tuesday 18 February 2020

ఆశిద్దాం

బాధ అగ్నిహోత్రం లాంటిది,
అది ఆశలను హుతం చేస్తుంది
మనసును  నిర్వీర్యం చేస్తుంది.
ఆనందాన్ని హరిస్తుంది
భవిష్యత్తుపై తీపిని చంపేస్తుంది.

కూర్చోనీయదు, నుంచోనీయదు
బుద్ధిని సక్రమంగా  ఉండనీయదు,
తిండి మీద ధ్యాస, నిద్రలో హాయి,
రెంటినీ దూరం చేసి,
నరకయాతన పెడుతుంది.
ఒంటరితనంతో కృంగతీస్తుంది
అనవసర భయాలకు తెరదీస్తుంది
మానసిక వత్తిడికి ఆజ్యం పోస్తుంది.

నిత్యం పలకరించే అతిథే అయినా,
బాధను భరించడం కష్టం.
జీవితంలో వచ్చే సాధారణ బాధే;
రకరకాల చిత్రహింసలకు గురిచేస్తూంటే,
తలవని తలంపుగా ప్రపంచాన్ని వణికిస్తూ
జీవితాలను అల్లకల్లోలం చేస్తూ
అమాయకుల జీవితాలను కబళిస్తూ
ప్రపంచ యవనికపై వికటాట్టహాసం చేస్తూ
కరాళ నృత్యం సలుపుతూ
ప్రత్యక్ష నరకం చూపిస్తోంది
కరోనా వైరస్ బాధ.

అన్నీ సవ్యంగా ఉంటేనే
ఏదో ఒక విషయం మీద బాధ పడతాం,
క్షణమొక యుగంలా, అయినవారికి దూరంగా
క్వారంటైన్ లో జీవితాలను వెళ్ళదీస్తూ,
మృత్యుభయంతో అనుక్షణంవణికిపోతూ,
ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక,
జీవితాలను వెళ్ళదీస్తున్నారు చైనాసోదరులు
వారి గురించి తలుచుకుంటూంటే
గుండెల్లోంచి తన్నుకొస్తోంది అవ్యక్తమైన బాధ.

అశనిపాతంలా ప్రజలు నెత్తిమీద పడింది
అదాటున వచ్చి మనసును కాలుస్తోంది
వాస్తవంలోనే  ఇంత భయంకరంగా ఉంటే
అనుభవించే వారి అనిశ్చిత ఊహల్లో
అది ఇంకెంత భయాన్ని కలిగిస్తోందో?
తలుచుకుంటే గుండె బరువెక్కుతోంది.

ఎక్కడికీ వెళ్ళలేరు, ఎవరితో మాట్లాడలేరు,
ఏదీ సరిగా తినలేరు, వేళకు నిద్రపోలేరు,
రేపటిమీద ఆశతో బతకలేరు,
నా అన్నవారి జీవితాలపై భరోసో ఉంచలేరు,
ఎంతకాలం ఈ ఉపద్రవం ఉంటుందో?
ఏ క్షణంలో బ్రతుకు అంతమై పోతుందో?
అన్నిటిలోనూ అనిశ్చితే, తలిస్తే బెంగే
అదే భయానికి కారణం అవుతోంది.
ఆ స్థితిలో వారి పరిస్థితి ఊహిస్తే
మనసును అతలాకుతలం అవుతోంది.

దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలు దాటి,
సౌహార్ద్ర సేతువులతో బంధాలు కలిపి,
వసుధైక భావనతో ప్రపంచ పౌరులుగా ఎదిగి, 
"లోకా సమస్తా సుఖినో భవంతు".....
అని హృదయపూర్వకంగా నినదిద్దాం.
చైనా త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042