Sunday 29 March 2020

నేనే బెటర్.

చాలామంది కున్నట్టే నాకూ పుస్తకాల పిచ్చి ఎక్కువ. ఒక్కొక్కసారి నా లైబ్రెరీ చూసుకుంటూ ఉంటే నాకే అనిపిస్తూ ఉండేది, ఎన్ని సంవత్సరాల సేకరణ ఇదీ! అని.

నాకు వస్తు జాగ్రత్త ఎక్కువ. నాన్న గారికి అందుకే ముచ్చటెక్కువ. చిన్నతనంలో ఏ పుస్తకం తెచ్చినా అట్టవేసి భద్రం చేసేవాడిని. ఇంట్లో నేనే ఆఖరి వాడిని కావటం వల్ల అన్నయ్యలు, అక్కయ్యలు చదివిన తర్వాత నావరకూ పుస్తకాలు వచ్చేవి. దానివల్లనేమో, పుస్తకాలు జాగ్రత్త చేయటం నాకు చిన్నతనం నుంచీ అలవాటయ్యింది. పుస్తకం నలిగిందంటే బాధగా అనిపించేది.

పెళ్ళికి ముందు నాకు పుస్తకాలంటే ఇష్టమని, నాకో పెద్ద లైబ్రెరీ ఉందని నా శ్రీమతికి చెబితే ఆవిడ ముచ్చట పడింది. మా ఇంటి కొచ్చిన తరువాత నా లైబ్రెరీ చూపించమంది. ఓ రెండుమూడు బీరువాలు చూపించా. ఆవిడ ఆశ్చర్యపోయింది.

మొదటి బీరువాలో నేను కేజీనుంచి పీజీ వరకూ చదివిన అన్ని క్లాస్ పుస్తకాలు, నోట్సులు గైడ్లు ఉన్నాయి.  రెండో బీరువాలో నాన్నగారు ప్రతీ సంవత్సరం నాకిచ్చిన కొత్త డైరీలు కొంచెంకూడా కొత్తమాయకుండా, కనీసం గీతలు కూడా లేకుండా ఉన్నాయ్. మూడో బీరువాలో చిన్నతనం నుండి అయిన ఇంటిఖర్చులు, చాకలి పద్దులు, దేవుడి స్తోత్రాలు, సహస్రనామ పుస్తకాలు ఉన్నాయి.

అన్నీ చాలా ఓపిగ్గా చూసిన నా భార్య చివర్లో ఒకమాటంది.

పుస్తకం తెరిస్తేనే నలుగుతుందని జాగ్రత్తపడ్డనువ్వు, జీవితంలో కనీసం కొన్నిసార్లయినా నీ మొదటి బీరువాలో పుస్తకాలు చదివుంటే, మీ అన్నయ్యలు, అక్కయ్యల్లా ఇంకా మంచి ఉద్యోగం పొందేవాడివేమో!

పోనీలే! కనీసం శ్రీరామ కూడా రాయిని నోట్సు పుస్తకాలు, నీ చిన్నప్పటినుండి దాచిన ఖాళీ డైరీలు మన పిల్లలకి రఫ్ పుస్తకాలు కుడదాం. నీ జాగ్రత్తకి ఇంతకు మించిన ఫలం ఏంకావాలి? చెప్పు, అని. 

ఆవిడ ఆ మాటన్నాక,

"చూశావా పుస్తకాలంటే నాకున్న జాగ్రత్త మన పిల్లలకి ఎలా ఉపయోగపడుతోందో! అన్నా.

పెళ్ళయ్యిన మరుక్షణం నుంచి ప్రతీ భార్యా మొగుడ్ని చూసినట్టుగానే, వెర్రి తొత్తుకోడకా అన్నట్టు నా వైపు చూసి, ఓ అర్ధం కాని నవ్వు నవ్వింది.

ఈ మధ్యె విన్నా, ఆయనకెవరికో రెండు గదులు లైబ్రెరీ ఉందట.

పాపం ఆయన ఎన్ని క్లాస్ పుస్తకాలు దాచాడో అనిపించింది. అంతలోనే వివేకం మేల్కొంది.  ఒక్కడికే అన్ని పుస్తకాలు ఉంటాయా? బహుశా!  అతని కుటుంబ సభ్యులవి, బంధువులవి కూడా అయి ఉంటాయి అని.

ఆ ఆలోచన రాగానే, పుస్తకాలంటే  మరీ అంత పిచ్చి ఉండకూడదు, ఆయనతో పోలిస్తే  నేనే బెటరేమో అనిపించింది.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042.