Sunday 30 June 2019



డోల

గ్రీష్మతాపంలో వేగిపోతున్న శరీరాలకు సాంత్వన చేకూర్చేందుకు,  అనుకోని ఆతిధిలా వచ్చింది వర్షం.

ఎవరింటికైనా వెళ్ళినపుడు, ఉత్త చేతులతో వెళ్ళకూడదనేమో! చల్లటి మలయ మారుతాన్ని కానుకగా తెచ్చింది.

అలసిన శరీరానికి హాయిని చేకూర్చేలా, వాయు దేవుడు, వస్తూవస్తూ బయట ఉన్న పూల చెట్లను ఆలింగనం చెసుకుని, వాటి పూల తాలూకు పరిమళాన్ని తన శరీరానికి పూసుకొని, పరిమళ భరితమైన శరీరంతో నా వద్దకు వచ్చి, ఆత్మీయంగా  ఆలింగనం చేసున్నాడు. ఆ గాఢ పరిష్వంగంలో శరీరం పులకరిచింది. దేవుడి స్పర్శలో ఉన్న ఆనందం ఇదేనేమో అని మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

బయట తిరిగి రావటం వల్ల కాబోలు, లోపలికి రాగానే ఆయన కాళ్ళకంటిన దుమ్ము ఇల్లంతా పరుచుకుంది.  అంతవరకూ ఆయన రాకకు సంతోషించిన మనసు, ఇల్లంతా దుమ్ము కొట్టుకు పోవడంతో కుమిలిపోవటం మొదలు పెట్టింది.

గాలి దేవుడు, ఇల్లంతా దుమ్ము చేసినందుకు ఏడ్వాలో, చల్లని శీతల స్పర్శనిచ్చినందుకు ఆనందం పడాలో తేల్చుకోలేక సతమతమవుతున్న సమయంలో, ఆకాశం చినుకుల రూపంలో అనిలుడికి  పాద్యం ఇచ్చి కాళ్ళు కడుక్కోమంది‌.

దేవుడి పాదాలను తాకితే ధూళికూడా సువాసన సంతరించు కుంటుందన్న చందంలో,  ఆయన పాదాలు తడుపుకోగానే, తడిసిన మట్టినుండి రేగిన భూగంధం నాసికాపుటాలకు అధ్భుమైన అత్తరు  వాసనలతో విందు చేయటం మొదలు పెట్టింది.  ఆవింత హాయిని అనుభవిస్తున్న మనసు మళ్ళీ ఆనంద పడటం మొదలు పెట్టింది.

క్షణంలో ఆనందం, మరుక్షణంలో బాధ పడుతున్న నా మానసులా, గోడమీద వేలాడుతున్న దేవుడి పటాలు  డోలయమానంగా  అటూఇటూ  వింత శబ్దాలతో కదులుతున్నాయ్.

చిరువర్షానికి తడిసిన గాలితెమ్మెర ఒకటి మేను తాకగానే, ఎంత హాయి ఉంది ఈయన స్పర్శలో? అనిపించింది.

ఈలోగా బయట ఆరేసిన బట్టలు, ఉన్నట్టుండి వీచిన ఈదురు గాలికి ఎగిరి, పక్కవాళ్ళింట్లో పడ్డాయి.

ఎంత దేవుడైన వాయుదేవుడు,  గాలిచెష్టలు మాత్రం వదలడే అనుకుంటూ తిరిగి విసుక్కున్నా.

నా ఆలోచనలో నేనుండగానే పటాలకు పెట్టిన పూలు ఎగిరొచ్చి, నామీద సుమా క్షతలు వెదజల్లాయి. పూలు ఎగిరి తలమీద  పడగానే, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఏదో మంచి జరగబోతోంది అని, మనసు సంకేతం పంపింది.

ఛీ! అనవసరంగా తిట్టుకున్నా, ఎంతయినా దేవుడు దేవుడే, లేకపోతే నేను తిట్టుకుంటున్నా ఎందుకు ఆశీర్వదిస్తాడనిపించింది.

అయినా దైవత్వం అంటే సరదాలు, సంతోషాలు లేని జీవన విధానం కాదుగా!  ఎప్పుడూ గంభీరంగా ఉంటే! దేవుడికైనా ఆనందం ఎక్కడుంటుంది?

ఆమాత్రం  కొంటెతనం, చిలిపితనం,  వేళాకోళం లేకపోతే దేవుడైనా మనం ఇష్టపడమేమో?

కృష్ణుడిని అందరూ ఇష్టపడడానికి కారణం, ఈ చిలిపి చేష్టలే కదా! అని అనుకోగానే, గాలి చేష్టలు తిరిగి సరదాగా అనిపించాయి.

ఈలోగా మెల్లగా మొదలైన వర్షం ఉధృతమైంది. ఉన్నట్టుండి కరెంట్ పోయింది. ఉరుముల శబ్దం భయపెట్టడం మొదలెట్టింది.

ఉండుండి ఆకాశం వేలకాంతులతో మెరవటం మొదలెట్టింది.  తాపంపోయి దాని స్థానంలో ప్రవేశించిన  చలికి శరీరం వణకడం మొదలెట్టింది. అప్పటి వరకూ అతిథుల్లా భావించిన గాలి, వర్షం అంటే తిరిగి ఒకరకమైన వణుకు మొదలైంది.

ఇంటికొచ్చారని భావించిన ఆ ఇద్దరు అతిధులు బయటే ఉన్నారు. నేను మాత్రం తలుపేసేశాను. వారిచ్చిన బహుమతులు సంతోషంగా స్వీకరించి, వారే దేవుళ్ళని మురిసిన నేను,  కనీస అతిథి మర్యాదలు కూడా చేయకుండా తలుపులు గడియలు పెట్టి లోపలదాక్కున్నాను.

చాలాసేపు వాళ్ళిద్దరూ తలుపులు, కిటికీలు బద్దలయ్యేటట్టు కొడుతున్నా తలుపు తీసే సాహసం చేయలేదు.

ఆ రకంగా ప్రాణం నిలిపే దేవుడు, దాహం తీర్చే వేలుపూ బయట వేచి ఉంటే,  నేను మాత్రం లోపల తలుపులు బిడాయించుకుని కూర్చున్నా.

తాపం తీరిందని సంతోషించినంత సేపు పట్టలేదు, వర్షం అంటే భయపడడానికి.

పిల్లల చదువులు పాడవుతాయని ఇంట్లో టీవి పెట్టించ లేదు. అందుకే  రేడియో ఆన్ చేస్తే తెలిసింది వాయుగుండం ఏర్పడిందని.

అప్పుడు గుర్తుకొచ్చాయి, మరుసటి రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు. అవి  ఎలా చేయాలో అనే ఆలోచన మొదలైన వెంటనే, పాడు వర్షం ఇప్పుడే రావాలా అనిపించింది.

పగలస్తమానూ, ఎండ విరగదీయటం వల్ల, గదిలో వేడి అలానే ఉంది. తలుపేస్తే ఉక్క, తీస్తే చలి. ఫాన్ ఆన్ చెద్దామంటే కరెంట్ లేదు. వర్షానికి ఎగిరొచ్చే రెక్కలపురుగులు ఇల్లంతా కలియతిరుగుతూ, ప్రాణం నిలవనీయటంలేదు. కరెంట్ పోవటం వల్ల, గుడ్డిదీపం వెలుతుర్లో భోజనా లయ్యాయనిపించాం.

నిద్రపోదామంటే వాతావరణం సహకరించటంలేదు. పిల్లలు నిద్ర లేక ఒకటే గోల.

ఛీ! పాడుగోల, ఈ వర్షం లేకపోతే, కనీసం ఏసీ వేసుకునైనా ఈ పాటికి నిద్ర పోయేవాళ్ళం, దీని పుణ్యమా అని కరెంటు పోయింది, అనుకుంటూ మళ్ళీ విసుక్కున్నా.

ధారగా కురుస్తున్న వర్షం వల్ల గది కాసేపటికి చల్లబడింది. నా సహచరిణి పిల్లల్ని పడుకోబెట్టి లోపలికి ప్రవేశించింది. దళసరి దుప్పట్లో  అప్పటికే పిల్లలు వెచ్చగా నిద్ర పోతున్నారు. అప్పటివరకూ హల్చల్ చేసిన రెక్కల  పురుగులు  సద్దుమణిగాయి.

మత్తెక్కించే మల్లెపూలు తల్లో పెట్టుకుని ఇంటావిడ పక్కకు చేరగానే, పోయిన ఆనందం తిరిగి చేరినట్టయింది. చల్లటి వాతావరణంలో అంపశరుడు దీవించినట్టు భావన కలిగింది.

ప్రకృతి ఎంతగొప్పది, క్షణంలో దీవిస్తుంది, క్షణంలో విసిగిస్తుంది. ఇంతటి వైవిధ్యం దీనిలో ఉంచిన భగవంతుడు ఎంత గొప్పవాడు అని మళ్ళీ సృష్టి కర్తను మెచ్చుకున్నా.

దేవుడిచ్చిన శరీరం,  ప్రాణసఖీ గాఢ పరిష్వంగలో దివ్యానుభూతిని అనుభవించడం మొదలు పెట్టింది.

చాలాసేపు మనసు తెలియని తీయని  లోకాలలో
పయనించింది. తర్వాత శరీరం గాఢ నిద్రలోకి జారుకుంది.

                                     ****

ఆదమరచి నిద్రపోతున్న క్షణంలో, పడుకున్న మంచం మీద తడి తగిలితే సడెన్ గా మెలకువ వచ్చింది.

కుండపోతగా కురుస్తున్న వర్షానికి, గదిలోకి మోకాళ్ళ లోతు నీరు వచ్చేసింది.

కంగారుపడి పక్కనున్న భార్యని లేపి పిల్లల్ని తీసుకుని మేడమీద ఉన్న గదిలోకి పరుగు తీశాను.

నిద్రనుంచి హఠాత్తుగా లేచిన పిల్లలు, మా కంగారు చూసి ఏడుపు లంకించుకున్నారు. కరెంటు పోవటం వల్ల ఏదీ కనిపించటం లేదు.

గాలికి కిటికీ రెక్కలు కొట్టు కోవటం వల్ల అద్దాలు పగిలి చెల్లాచెదురయ్యాయి.

చీకటిలో చూసుకోకుండా వాటిమీద అడుగు వేయటంవల్ల, పగిలిన పదునైన అద్దం ముక్క ఒకటి నాకాల్లో కసుక్కున దిగబడింది.

బాధని ఓర్చుకోలేక, ఎత్తుకున్న పిల్లాడిని అప్రయత్నంగా వదిలేశా.

వాడు కిందపడినపుడు,  పదునైన వస్తువు వాడి శరీరాన్ని చీల్చిన శబ్దంలా ఒక ధ్వని వినిపించింది. వాడు కెవ్వున కేకపెట్టి నిశ్శబ్దం గా అయిపోయాడు.

కీడుశంకించింది మనసు.

ఒరేయ్  కన్నా ఏమయ్యిందిరా? గొంతు బొంగురు పోతూండగా, బిగ్గరగా అరిచాను. కింద తడిమితే పిల్లాడు తగల్లేదు. పగిలిన గాజు పెంకులే చేతులు చీల్చేశాయి. బాధ భరించలేక బిగ్గరగా అరిచాను.

విషయం అర్ధంకాని నా భార్య, ఏమయిందండీ? అంటూ ఏడవటం మొదలెట్టింది.

మా ఇద్దరి ఏడుపూ విన్న మా అమ్మాయి భయపడి నా భార్య చేతిలోనుంచి కిందకిజారి, ఏడుపు లంకించుకుంది. చుట్టు పక్కల ఇళ్ళల్లోంచి కూడా ఇవే రకమయిన హాహా కారాలు, వినబడుతున్నాయి.

ఆకాశం చిల్లు పడినట్టు వర్షం ఈదురుగాలులతో ధారగా కురుస్తూనే ఉంది.

కాత్యాయనీ, టార్చ్ ఎక్కడుందీ, కనీసం సెల్ ఎక్కడుందో గుర్తుచేసుకు  చెప్పు, ముందు పిల్లాడికి ఏమయ్యిందో చూడాలి అన్నా.

అదే సమయానికి పిల్లను తిరిగి ఎత్తుకున్న నా భార్య మీదకి,  పక్కింటి నుంచి గాలిలో ఎగిరొచ్చిన ఒక ఇనుప రేకు నుదుటని బలంగా తాకింది.

బాలెన్స్ కోల్పోయిన నా భార్య నాచు పట్టిన డాబా మీద నుంచి జారి, రెయిలింగ్ లేకపోవటం వల్ల, పిల్లతో సహా కెవ్వున అరుస్తూ కిందపడింది. ఆ పైన ఏ శబ్దం రాలేదు.

కిందికి తొంగిచూశాను. బయట దూరంగా  ఎవరో వేసిన టార్చి తో వెడుతున్నారు.  టార్చ్ వెలుతురు మా ఇంటిముందు భాగంలో పడింది. పెరడంతా నీటితో నిండిపోయింది. నీటిపై తేలుతూ రెండు సర్పాలు, నా భార్య పడిన వైపు రాసాగాయి. అప్పటికే నా భార్య, కూతురు స్పృహ కోల్పోయి ఉన్నారు.

చిన్నమూలుగు లాంటి శబ్దం కిందనుంచి వినబడుతోంది.   ఆత్రుతగా వాళ్ళ  వైపు దూకబోతూంటే, నీటిలో కొట్టుకు వస్తున్న పాములు గుర్తుకు వచ్చాయి. తిరిగి మనసులో చిన్న జంకు.

నా భార్యా పిల్లల పరిస్థితి చూస్తే భయం వేసింది. దూకితే ఏమవుతుందో తెలియదు. తల పగిలితే? పాము కాటేస్తే, వాళ్ళతో పాటు తనూ పోతే? లోపల ఉన్న పిల్లాడి పరిస్థితి ఏమిటి? అలా అని వదిలేస్తే రెండు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి.  ఏం చేయాలో పాలు పోవటం లేదు.

దూకాలంటే చిన్న భయం ఒక మూల ఉంది. ఎక్కువ ఆలోచించడానికి టైం లేదు. ఒక నిర్ణయానికి రావాలి.

అంతే, ఆ ఊహరాగానే ఏదయితే అది అయిందని, అంత ఎత్తుమీదనుంచి కిందికి దూకేశా.

సరిగ్గా పాములకు కాత్యాయనికీ  మధ్య పడేటట్టు  దూకేశా.  నేను దూకిన శబ్దానికి పాములు పక్కదారి పట్టాయి.  ఎత్తు మీదనుంచి దూకడం వల్ల నా నడుం కలుక్కుమంది. బాధగా మూలిగా. అంత బాధలోనూ, నా భార్యని, కూతురిని మెల్లగా లేవదీసి, సిట్ అవుట్లోకి చేర్చాను. నా భార్య చెంపలను తడుతూ స్పృహలోకి తీసుకొచ్చా. పిల్ల ఊపిరి తీస్తోందని గమనించాక పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఈ లోగా పిల్లాడు గుర్తు వచ్చాడు.  భయంతో శరీరం తిరిగి వణకడం మొదలెట్టింది. వాడిని రక్షించుకోవాలనే సంకల్పం కలగగానే తలుపులు తెరవబోయా. తలుపులు వేసి ఉన్నాయ్. మేము పైనుంచి పడటం వల్ల కిందకి వచ్చాం. తలుపులు అంతకుముందే వేసుకుని ఉండటం వల్ల అవి తెరుచు కోవటం లేదు. లోపలికి వెళ్ళాలంటే తిరిగి మేడమీంచే వెళ్ళాలి. మా కింది వాటా నుంచి బాత్రూం ఎక్కితే అక్కడనుంచి మేడ మీదకి చేరకోవటం సులభం. ఆ ఊహ రాగానే బాత్రూం వైపు నడిచా.  ఆప్పటికే బాత్రూం గోడమీదకి కొద్ది క్షణాల క్రితం నే చూసిన పాములు చేరుకున్నాయి. నేను బాత్రూం గోడమీద చేయి వేయగానే కస్సున చేతిని కొరికాయి. భయంతో కెవ్వున కేకేసి, చేయి పట్టు వదిలేశా. దబ్బున కింద పడ్డా.

నా అరుపుకు కాత్యాయని స్పృహలోకి వచ్చింది.  ఏమైందంటూ  కంగారుగా దగ్గరికొచ్చి నన్ను  కుదిపింది. ఎక్కడ నుంచో పడిన టార్చి వెలుగులో చేయి చూసుకున్నా, చాలా గాట్లు కనబడ్డాయి.  ఎప్పుడో చదివిన విషయం గుర్తుకొచ్చింది. విషయం సర్పం కరిచినట్లయితే రెండు కోరలు దిగిన గుర్తు ఉంటుంది. ఎక్కువ గాట్లు పడితే అది విష సర్పం కాదు. ఆ విషయం స్ఫురణకు రాగానే, చాలా ఆనందం కలిగింది. నాకేమీ కాదనే స్పృహ రాగానే తిరిగి పిల్లాడి సంగతి తలపుకొచ్చి పిల్లాడు, పిల్లాడు....అంటూ భోరుమన్నా. నా దుఃఖం ఆగట్లేదు. ఎక్కెక్కి ఏడుపు వస్తోంది. గుండె గొంతులోకి వచ్చినట్టు, గొంతుకు ఏదో అడ్డుపడుతోంది.

ఏమయ్యింది పిల్లాడికి? ఏంకాలేదు. ముందులేవండి అంటూ వీపుమీద ఒక్క చరుపు చరిచింది నా భార్య. నడుంనెప్పికి, చేతి దెబ్బ తోడవ్వటంతో వీపుమండి, అబ్బా! అంటూ లేచాను.   కళ్ళు తెరిచేసరికి మంచం కింద పడి ఉన్నాను.

ఏమయ్యిందండీ! అంటూ.....  నా భార్య  కంగారుగా  నన్ను  కుదుపుతూ ఆందోళనగా అడుగుతోంది.

దాంతో నిద్ర మత్తు పూర్తిగా  వదిలి స్పృహలోకి వచ్చా.

ఎదురుగా పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. అయోమయంగా  చూస్తున్న నన్ను, నా భార్య చెయిచ్చి,  పైకి లేపింది.

అంటే ఇంత సేపూ నే కన్నది కలా? అని అనుకోగానే ప్రాణం తేలికయ్యింది.  స్పృహ రాగానే పోయిన ప్రాణం లేచివచ్చినట్లయ్యింది. పరిస్థితిని తెలుసుకోవడానికి వెంటనే రేడియో ఆన్ చేశాను.

పొద్దున్నే వచ్చే న్యూస్ లో, ఫేణీ తుఫాను, ఒరిస్సాలో  తీరం దాటిందన్న వార్త వినగానే అమ్మయ్య, ఇంక  మనకి గండం తప్పింది అని అనుకుంటూ, మంచం మీద నుంచి కింద పడటం వల్ల నెప్పెట్టిన  నడుం రాసుకుంటూ కిటికీ తెరిచాను. అలా తెరిచి నప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ నాలో ఎంటర్ అయ్యింది.  ఏమిటీ మనస్తత్వం? మనకు ఏమీ కాదనుకున్నప్పుడే మనకు ఆనందం. ఎక్కడో హైదరాబాద్ లో బస్సుకు ఆక్సిడెంట్ అయ్యిందంటే ముందు మనవాళ్ళు ఎలా ఉన్నారని ఆరాతీస్తాం, ఏమీ కాలేదనే హమ్మయ్య అని ఊపిరి పీలుస్తాం. ఆ పైన తెలుసున్నవాళ్ళ గురించి ఆరాతీస్తాం. అదీ ఫర్వాలేదంటే పక్కవాడి కొచ్చిన కష్టం గురించి ఆలోచిస్తాం. అయ్యో అనుకుంటాం. ఆ పైన మనలో మానవత్వం నిద్ర లేస్తే లేస్తుంది, లేకపోతే లేదు. మన స్వార్థం చూసిన తరువాతనే మానవత్వమా? మనకేం కాదనుకున్నా పైనుండే మనలో మానవీయ కోణం నిద్రలేస్తుందా? భార్యాపిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా మేడ మీంచి దూకడానికి తాత్సారం చేయటం ఏమిటి? అందరూ ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా కలలో కూడా నన్ను కరిచింది విషరహితమైన పాము అని తెలిసిన వెంటనే అంత ఆనందం ఏవిటి? అది తాత్కాలికమే కావచ్చు, అలా ఆలోచించి వాళ్ళ కోసం నేను దూకడమూ జరిగి ఉండొచ్చు.  అదే విషసర్పం కరచినట్టయితే ఏం జరిగేది? నిజంగా దూకే వాడినా? అనే ఆలోచన రాగానే దూకే వాడినేమో? అనిపించింది. ఎందుకంటే ఎలాగూ చావు తప్పదని రూఢీ అయితే కనీసం చివరిసారిగా నా వాళ్ళను రక్షించుకోవాలనే సంకల్పం నాచేత ఆ పని చేయిస్తుంది. నా అన్న భావనే లేకపోతే నేను ప్రాణాలకు తెగించటం జరగదు. ప్రేమ ప్రకటించడానికి కూడా స్వార్థమే కారణం అయితే, విచక్షణతో కూడిన స్వార్థం ప్రేమ అవుతుందా? లేదా స్వార్థం నుంచే ప్రేమ ఉద్భవిస్తుందా?

అలా ఆలోచిస్తూనే కిటికీ లోనుంచి బయటకు చూస్తున్నా.

రాత్రి తెల్లవార్లూ వానకు తడుస్తూనే, ఇంటికి కాపలా కాసిన మా కుక్క నా ముఖం చూడగానే తోక ఊపుతూ, కిటికీ దగ్గర కొచ్చింది.  దాన్ని చూడగానే నాలో అపరాధ భావం మరింత ఎక్కువయ్యింది. అది చలికి వణుకుతోంది. దాని శరీరం రక్తం మార్కులతో ఉంది. రాత్రి మా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణం అడ్డుపెట్టి ఇంట్లోకి రాబోయిన ఒక నాగుపామును చీల్చి చంపేసి పక్కన పడేసింది. కొంచెం అన్నం పెట్టిన విశ్వాసానికే ప్రాణం ఒడ్డి మిమ్మల్ని కాపాడి తన విశ్వాసాన్ని కాపాడిన దీనిముందు నేనెంత? దీనికి మనలాంటి ఆలోచనలు ఉండకపోవడం వల్లే రాత్రంతా దాన్ని బయటే ఉంచి లోపల మేము నిద్రపోయినా ఏ రకమైన ఆరోపణలు లేకుండా నేను కనబడగానే తోక ఊపుతోందా? దీనికి కోపం ఉండదా? మనిషిలా దీని మనసు క్షణానికో విధంగా డోలాయమానం చెందిందా? అందుకే అతీంద్రియ శక్తులు, ఆత్మలు, దేవుళ్ళు కుక్కకి కనిపిస్తాయంటారు. దానికి కారణం నిశ్చయాత్మక మైన దాని మనస్సేనా? ఆలోచించే కొద్దీ దానిముందు నేనో మరుగుజ్జు లా అనిపించింది సాగాను. ఈ లోగా గేటు చప్పుడైతే అటు చూశాను. మా బావుమరిది వచ్చాడు.

రాత్రంతా వర్షం కురవటం వల్ల, బయట రోడ్లన్నీ మునిగిపోయాయి. కరెంటు లేదు. ఆటోలు తిరగటం లేదు. పెట్రోల్ బంకులు మూసివేయడం వల్ల ఆటోలకు పెట్రోల్ దొరకటం లేదు. బస్సులు తిరగటం లేదు. రోడ్లకు ఇరువైపులా ఉన్న మహావృక్షాలు కుప్ప కూలాయి. రహదారులు అస్తవ్యస్తం అయ్యాయి. ఇళ్ళ పైకప్పులు ఎగిరిపోయాయి. ఒక్కరోజులోనే జన జీవనం స్తంభించి పోయింది. అలాంటి సమయంలో మా బావమరిది రావటం నాకు ఆశ్చర్యం వేసింది.

తలుపు తీసి ఎదురు వెళ్ళా. ఏవిటి బావా! ఈ సమయంలో వచ్చావు? ఏం జరిగింది? అంతా క్షేమమేనా? అని అడిగా.

అందరూ క్షేమమే, కలకత్తా పనిమీద వెళ్ళి, మొన్న రాత్రే వెనుదిరిగా. ఇచ్ఛాపురం వచ్చేసరికి వాన మొదలయ్యింది. రాత్రంతా అక్కడే  ఫ్రెండ్ ఇంటిలో ఉండి మీరెలా ఉన్నారో అని భయంవేసి అతని బండి మీద బయలుదేరా. ఊర్లోకి రావడానికి కుదర్లేదు. నీటి వరవడికి బండి జారిపోతూంటే ఊరి బయట ఒక షెడ్డులో బండి పెట్టి ఆటోకోసం ఎదురు చూశా. ఎవరూ రావటం లేదు. చివరకు ఒక ఆటో అతను పదికిలోమీటర్లకీ పదిహేను వందలు అడిగితే వెయ్యికి మాట్లాడి వచ్చేశా అన్నాడు.

మామీద అతనికున్న ప్రేమకి మా ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుని సాదరంగా లోపలికి తీసుకు వెడుతోంది. నేను మాత్రం వరదలో మాట వినని ఆటోను వెనుకకు తిప్పి వెళ్ళిపోతున్న ఆటో అతనికేసి చూస్తున్నా.

మనిషి చలికి వణుకుతున్నాడు. వర్షం ఉధృతి తగ్గింది కానీ, ఇంకా సన్నగా కురుస్తూనే ఉంది.  రోడ్డుమీద నీటి ఉధృతికి ఆటో అతని చెప్పిన మాట వినటం లేదు. బలహీనమైన చేతులతో దాన్ని సక్రమంగా నడిపేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇంక ఆగలేక అతని వైపు పరిగెత్తి, కాస్సేపు ఆగి వెళ్ళు. ఇప్పుడు ప్రమాదం. నీటి ఒరవడి తగ్గాక వెళ్ళు. ముందు లోపలికి రా. అని వెనక్కు పిలిచి, తల తుడుచుకోవడానికి   తువ్వాలిచ్చి, నా పాత చొక్కా ఇచ్చా. ముందు మొహమాట పడ్డా, బలవంతం చేశాక వేసుకున్నాడు. మా ఆవిడతో చెప్పి వేడి వేడి టీ ఇచ్చా. టీ ఇస్తూ, పదికిలోమీటర్లకి వేయి రూపాయిలా? ఆశకు అంతుండాలి అంది. అతను కొంచెం సిగ్గు పడ్డాడు. నేను కళ్ళతో సైగ చేసి మా ఆవిడని సముదాయించా. ఆవిడకు లోపలికెళ్ళాక అడిగా, ఎందుకింత రిస్క్ చేశావ్? ప్రమాదం కదా? మధ్యలో ఏదైనా జరిగితే నీ ఇంట్లో వాళ్ళు గతేంకాను? ఆలోచించావా? అని అడిగా.

అలా ఆలోచించబట్టే ఇలా వచ్చా. రాబోయే మూడురోజుల వరకూ పెట్రోల్ బంక్లు తెరవక పోవచ్చు. నాకు ఆటో నడిపే వీలు లేదు. ఇప్పటికే పెట్రోల్ రిజర్వ్ లో పడింది. బండి నడిస్తే కదా సార్ మాకు తిండి. సార్ వచ్చి బేరం అడిగాడు. పదిహెనువందలన్నా. వెయ్యి కి ఒప్పుకున్నాడు. ఈ టైంలో నడపడం రిస్కే. కానీ మూడురోజులు కుటుంబాన్ని పస్తులు పెట్టకూడదంటే తప్పదు. అందుకే ఒప్పుకున్నా. అమ్మగారికి కోపం వచ్చింది. నేను వెయ్యికి ఒప్పుకుంది దూరానికి కాదు సార్! నా ప్రాణానికి.  వెళ్ళడానికి పెట్రోల్ సరిపోకపోతే, తోసుకుంటూ పోతా. మహా అయితే ఒక పూట కష్టం. మూడు రోజు.ల తిండి గేరంటీ కద్సార్.

అతను చెప్పినది విన్నాక, నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒక్క నిముషం అని లోపలికి వెళ్ళి నా బండిలో పెట్రోల్ సగంతీసి ఇచ్చా. నిన్ననే టాంకు ఫుల్ చేయించా. ఇంజనాయిల్ ఉంటే కలుపుకో, లేదా నీ బండిలో పెట్రోల్ ఉండగానే కలిపేయ్. పది కిలోమీటర్లే కదా ఇబ్బంది ఉండదు అన్నాను. ప్యూర్ పెట్రోల్ ఆటోలో పోయకూడదు, ఇంజనాయిల్ తో కలిపి పోయాలికదా అందుకు.

నా భార్య చూడకుండా ఒక వెయ్యి అతని చేతిలో పెట్టి వెళ్ళమన్నా. కృతజ్ఞతలు చెప్పి అతను వెళ్ళిపోయాడు.

వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చిన అన్నగారిలో నా భార్యకి అన్నకి తనమీద ఉన్న ఆప్యాయత కనిపిస్తోంది. అన్యాయంగా ఆటో వాడు వెయ్యి రూపాయలు తీసుకోవడంలో స్వార్థం అన్యాయం కనిపిస్తోంది. 

నాకు మాత్రం ఏం స్వార్థం వెనకాల ఏం త్యాగం దాగి ఉంటుందో తెలియటం లేదు. స్వార్ధంలో త్యాగం ఉంటుందో లేక త్యాగం స్వార్థం నుంచి పుడుతుందో అనే ప్రశ్నకు జవాబు దొరకటం లేదు. స్వార్థం విశాలమైతే ప్రేమ, ప్రేమ ఎక్కువయితే త్యాగం పుట్టుకొస్తాయా? ఏమో!! 

ఒక్కటి మాత్రం నిజం స్వార్థానికి, ప్రేమకి మధ్య మనసులో జరిగే భావాల డోలనమే ప్రతీ మనిషి జీవితం అని.

(డోల అంటే ఊయల)

SSS SRINIVAS VEMURI
Srikakulam, 9492732042