Tuesday 9 July 2019


సంపూర్ణ జీవితం

కాఫీ సేవనం తో
దినపత్రిక తిరగేసినట్టు.
సాంబారు సాదంతో
అప్పడం జత చేసినట్టు
పుల్ల మామిడి పప్పుతో
ఊరు మిరప కొరికినట్టు
పొట్లకాయ కూరలో
వడియం నలిచినట్టు
ఆవకాయ అన్నంలో
పెసర పొడి కలిపినట్టు
వంకాయ కూరతో
పకోడీ జతచేసినట్లు
పెరుగేసిన అన్నంలో
నిమ్మబద్ద చీకినట్టు
పనస పొట్టు కూరలో
ఆవేసి దించినట్లు
గోంగూర పచ్చట్లో
ఉల్లిపాయ కొరికినట్లు
నేనో దారిన వెడితే
నీవొక దారిలో ఎదురొచ్చావ్
నా జీవన గమనంలో
సహచరిలా అనుసరించావ్
అందమైన జీవితాన్ని
రసమయం చేశావు
నా జీవితంలో రుచి ఉంది
నీ రాకతో అది ఉద్దీపనం అయ్యింది
ఆమ్లం నేను, క్షారం నువ్వు
కారం నేను, తీపివి నువ్వు
బుద్ధి నేను, మనసువు నువ్వు
బొమ్మను నేను,
బొరుసువు నువ్వు
పురుషుడు నేను
ప్రకృతి నువ్వు
భిన్న ధృవాలం మనం
అందుకే అంత ఆకర్షణా
తోడుగా ఉన్నప్పుడు మనం
బ్రతుకు పయనంలో
వివిధ కోణాలు చూస్తున్నాం
ఒంటరి జీవితం రేఖీయం
ఒకరికొకరు తోడయితే సంపూర్ణం

SSS SRINIVAS VEMURI
Srikakulam