Thursday 5 September 2019

Be your self

ప్రతీ విషయాన్నీ, ప్రతీ మనిషిని నమ్మటం ఎంత తప్పో, అందరినీ  అనుమానిస్తూ పోయినా అంతే తప్పు.  మనుషులను రాగద్వేషాలకు అతీతంగా పరిశీలించినప్పుడు వారిని గురించిన  వాస్తవం బయటపడుతుంది.

మనిషి బాహ్య స్వరూపాన్నో, పైకి చెప్పే మాటలనో చూసి వారిమీద ఒక అంచనాకి రావటం సబబు కాదు. అలాగే వేరొకరు చెప్పిన మాటలను బట్టి మనుషులను అంచనా వేయటమూ సరికాదు.

ఒక వ్యక్తి ఎదుటి మనిషికి నచ్చడానికి, నచ్చకపోవడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి.‌ నచ్చిన వ్యక్తిని వెనుకేసుకుని వచ్చి, నచ్చనివాళ్ళని తుంగలో తొక్కేయటం ఎక్కడైనా సాధారణం.

ఏ మనిషైనా తనకు, తన మాటకు ఎదుటి వ్యక్తి విలువ నీయటం లేదని భావించినపుడు గోబెల్స్ ప్రచారానికి తెర తీస్తాడు.

హిట్లర్ పాలనలో పౌల్ జోసెఫ్ గోబెల్స్ అనే సమాచార శాఖా మంత్రి ఉండేవాడు. నాజీలకు అనుగుణంగా, జ్యూసులకు వ్యతిరేకంగా ప్రచారం చేయటంలో,  వాడైన పదజాలంతో ప్రజలను నమ్మించడంలో ఈయన సిద్ధహస్తుడు.  ఈయన పేరుమీద వచ్చిన మాటే గోబెల్స్ ప్రచారం.

గ్లోబెల్ ప్రచారంలో మాట్లాడే మాటల్లో  యదార్థము మరియు సత్య సంధ్య కన్నా, ప్రజల్ని మాయచేసి తాను కోరుకున్న విషయంవైపు వారిని మళ్ళించి, ఆకర్షించి అసత్యాలపై నమ్మకం కలిగించడమే ప్రధాన ధ్యేయం అయి ఉంటుంది.  ఇటువంటి వ్యక్తులు  అడుగడుగునా  మనకు నేటి సమాజంలో దర్శనం ఇస్తూనే ఉంటారు.

గోబెల్స్ ప్రచారం చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఇటువంటి ప్రచారంలో ఒక మనిషి కారెక్టర్ని ఒకేసారి డామేజ్ చెయ్యకుండా మూడు చెడు మాటలతో కలిపి ఒక మామూలు మంచి మాట జోడిస్తారు.

ఫలానా వ్యక్తి గొప్పవాడంటారు. చప్పట్లు కొడతారు. ఆలింగనం చేసుకుంటారు. అతనంటే తమకిష్టం అని ప్రచారం చేస్తారు. దానితో పాటే లోపాయికారీగా అతనిమీద  మోపిన నిందల్ని పక్కవాళ్ళతో ప్రచారం చేయిస్తారు. అదే సమయంలో ఆ ప్రచారాన్ని వీళ్ళు నమ్మనట్లు మాట్లాడి ఖండిస్తారు. ఆ వ్యక్తికి ఆత్మీయులం మేము అన్నంత సీన్ క్రియేట్ చేస్తారు. చివరకు లోకం అంతా వారిని చెడ్డవాడన్నట్లు రూఢీ చేసుకుని  నిలువునా ముంచేసి బయటవారి నిందలు నిజం అన్నట్టు ఒప్పుకుంటారు. మొదట్లో మేం నమ్మలేదు కానీ మీరన్నదే నిజం. మీ పరిశీలన గొప్పదని ఎదుటి వారిని మెచ్చుకుంటారు. నల్లమేక నలుగురు దొంగలు చందంలో ఆరోపణ ఎదుర్కొన్న మనిషికూడా నిజమే అనుకునేటట్లు చేస్తారు. ఇటువంటి వ్యక్తులు అమాయకులను స్నేహం ముసుగులో ముంచేస్తారు. నిజమైన శత్రువు కన్నా పక్కనుండే స్నేహితులే ప్రమాదకరం అన్న నానుడిని ఎల్లవేళలా నిజం చేస్తారు.

ఒక వ్యక్తి రెండో వ్యక్తిని మూడవ వానిముందు పలుచని చేస్తే నమ్మటం మంచిదికాదు. ముందు ఆ మాటల్లో ఉన్న వాస్తవం పరిశీలించాలి. లేకపోతే రేపటి రోజు అదే మనిషి మనల్ని కూడా పదిమందిలో పాలించిన చేయొచ్చు.

మనం వారి మాటలను పరిశీలిస్తున్నాం అని తెలిశాక, ఆ పరిశీలనా సమయంలో కూడా మాయ జరగొచ్చు. ముత్యాలముగ్గు సినిమాలో  హీరో చెల్లెలి కాపురం కూల్చడానికి రావుగోపాలరావు తాను పన్నిన పధకాన్ని చివర్లో చెప్తాడు, గుర్తుందిగా!  సరిగా అలాంటి వ్యూహాలే పన్ని ఎటువంటి వారికయినా ఒక వ్యక్తి మీద  అనుమానం రేకెత్తించడం ఈ వ్యూహంలో భాగం. గోబెల్స్ చాలా తెలివయిన వాళ్ళు.  వీళ్ళు ఒక్కరే ఉండి ఈ పని చేయరు. వ్యక్తుల సమూహం గా ఏర్పడతారు. మొదట ఎంచుకున్న వ్యక్తికి  తమ మీద సదభిప్రాయం కలగడానికి కొంత సమయం, డబ్బు ఖర్చుచేసి ఆత్మీయులుగా దగ్గరవుతారు. మెల్లగా సదరు వ్యక్తి ఆంతరంగిక విషయాలు కూపీ లాగుతారు. తర్వాత అతని బలం బలహీనతలు గమనిస్తారు. బయట సమాజంలో  అతని మీద అనుమాన బీజాలు వెదజల్లుతారు. వాటికి ఎరువు వేసి, నీరుపోసి పెంచుతారు. సరిగ్గా అవి మొలకెత్తినపుడు నాటకాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి కారెక్టర్ అసాసినేషన్ చేస్తారు.

"ప్రయోజన మనుర్దిశ్య నా మందోపి ప్రవర్త్యతే" అనేది ఆర్యోక్తి. అంటే ప్రయోజనం లేకుండా పిచ్చివాడు/మూర్ఖుడు కూడా ఏ పనీ చేయడు అని అర్థం. అయాచిత సహాయం, అక్కర్లేని విషయాల్లో సానుభూతి, హేతుబద్ధం కాని ఖర్చు, సందర్భంలేని పొగడ్త ఎవరయినా చేసినపుడు మెలకువ అవసరం.

నాకు తెలిసిన ఒకాయన ఉండేవాడు. ఏదైనా సహాయం కోరి ఎవరైనా ఆయన దగ్గరకు వెడితే వెనకాముందు చూడకుండా వారివెంట బయలుదేరే వాడు. పక్కనే ఉండి ధైర్యం వచనాలు పలికేవాడు. నైతికంగా నేనున్నాననే స్పృహ ప్రోది చేసేవాడు. ఇంటికెడితే వేయించిన జీడిపప్పు ఉప్మాలు, చింతపిక్క మునగని కాఫీలు ఇచ్చి, అప్పుడప్పుడు పార్టీలకంటూ తన కారులో సదరు వ్యక్తులను తిప్పే వాడు. ఒకటి రెండు సార్లు వద్దన్నా అయిదో పదో వేలు ఉంచమని ఇచ్చేసేవాడు. 

నెలో రెండు నెలలో గడిచాక, మొహమాటం తొలిదశలో ఉండే సమయంలో, ఎదుటి వ్యక్తి దగ్గర డబ్బున్న సమయం చూసి తన ఖర్చుకు పదింతలు తక్కువ కాకుండా అప్పు చేసి తరువాత చుక్కలు చూపించేవాడు. గారంటీ సంతకాలు తీసుకుని ఆ పైన చీకట్లు ఎగ్గొట్టే వాడు. ఇలాంటివారికి శాశ్వత స్నేహితులు ఉండరు.

స్నేహం శాశ్వతం కావాలంటే డబ్బు విషయాల్లో నిబద్ధత ఖచ్చితత్వం కావాలి. స్నేహం లేబ్రాయ దశలో ఉన్నప్పుడే మొహమాటాలుంటాయి. పొరపాటున మొహమాటానికి పోతే గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళచ్చని అనుకోవద్దు. ఎందుకంటే మొహమాటానికి పోతే కడుపు వస్తుంది కదా! దాన్ని వదిలించుకోవాలంటే వాళ్ళే దిక్కు అనుకోవటం అవివేకం.  కడుపు మామూలుగా వస్తే గైనకాలజిస్ట్ సహాయం చేయొచ్చు, ఇటువంటి గర్భాలు ఎవ్వరూ దించలేరు.

ఒక సంస్థలో చాలామంది పనిచేసే చోట తిన్నగా పనిచేసేవాళ్ళు వందమంది ఉంటే పనిచేయని పనికి మాలిన వాళ్ళు, లేదా కొంచెం పనిచేసి ఎక్కువ చెమట తుడుచుకునే బాచ్ ఒకటుంటుంది. వీళ్ళు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నా రాజకీయం చేయటంలో ప్రతిభ కనబరుస్తారు. అదే చతురతతో అందలం ఎక్కేస్తారు. ఎవరిని ఎప్పుడు పైకెత్తాలి, ఎప్పుడు దింపేయాలి అన్న విషయంలో వీళ్ళు నిత్య పధక రచన చేస్తూనే ఉంటారు.  ఇది అన్నిచోట్లా నేడు కనిపించేభాగోతం. యాజమాన్యం, సిబ్బంది ఇటువంటి వారిని మొదట్లోనే గుర్తించకపోతే వీరు చెదపురుగుల్లా మొత్తం ఆవ్యవస్థను నాశనం చేస్తారు.

ఎవరో చెప్పారని, ఏ ఒక్కరినీ అనుమానించడం కరెక్ట్ కాదు. అలా అని అందరినీ నమ్మటమూ సమ్మతం కాదు. ఏ రకమైన రాగ ద్వేషాలూ మనసులోకి రానీయకుండా అనుక్షణం మెలకువతో గమనించినపుడే నిలకడ మీద వాస్తవాలు తెలుస్తాయి.  పైకి కనిపించేది అంతా నిజం కాదు. అలాగే దగాకోరుల  మాటల గారడీ శాశ్వతం కాదు.

అప్పిచ్చే ముందు ఋణశీలత గమనించాలి. స్నేహం లేలేత దేశలో ఉన్నప్పుడు మొహమాటం ఉంటుంది. దాన్ని ఆసరాతీసుకుని ప్రయోజనం పొందాలనుకునే వారిని గమనించాలి.

ఒక వ్యక్తికి ఉండే శాశ్వత మిత్రులను గమనించండి. మిగిలిన వారి విషయంలో సదరు వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, తీసుకున్న అప్పు, ఇచ్చిన మాట మీద వాటి  వారి నిబద్ధత, ఖర్చుల విషయంలో వారు చూపే హేతుబద్ధత, సాటి మనుషుల గురించి మాట్లాడేటప్పుడు వారు చూపే తులనాత్మకత, వారి ప్రవర్తన,  వారి మాటకు చేతకు ఉండే వ్యత్యాసం, సాధారణ వ్యక్తులు విషయంలో వారి ప్రవర్తన, శాశ్వత స్నేహాలు బంధాలపై వారి దృక్పథం, అమాయకుల విషయంలో వారు చేసే హేళన, వ్యంగ్యం, అలుసు, దర్పం, తీరూ, తెన్నూ...  వెరసి ఇవన్నీ ఒక  వ్యక్తిపై మనకు ఒక అభిప్రాయం కలిగించేందుకు  ఉపకరిస్తాయి.

అలాగే ఎదుటి వ్యక్తి కళ్ళనుంచి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంచనా వేయద్దు. అలా అని ఎవరేమి చెప్పినా చెవులు మూసుకో వద్దు.

వినడం మంచిది. విన్న విషయాన్ని పరిశీలించి అభిప్రాయానికి రావటం మంచిది. అతి ధోరణి లేకుండా ఉండటం  మంచిది. ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకుని వ్యక్తులను అంచనా వేయకపోవడం ఇంకా మంచిది. బాహ్యవిషయాలు మన ఆలోచనలను ప్రభావితం చేయకూడదనే ఎరుక  మహా మంచిది.

మీరు ఎవరినైనా తెలివయిన వారని భావిస్తే వారిని అభినందించింది. పొరపాటున కూడా వారి ప్రభావానికి లోను కావద్దు. మీకూ భగవంతుడు ఆలోచించే తెలివి ఇచ్చాడు.  శ్రవణం, పరిశీలన,తులనాత్మకత, విచక్షణ అనే అంశాలతో మీ సొంతం తెలివి ఉపయోగించి, మీకు మీరుగా ఒక అంచనాకు వచ్చాకే అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. అలాంటప్పుడు గోబెల్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు, మీదైనా ఆలోచనతో మీ జీవితాన్ని మీరు సరిదిద్దు కోగలుగుతారు.

పేరులో ఉన్న అందమైన ఆడపిల్లల్ని వలలో వేసుకుని విదేశాలకు అమ్మడానికి పై తరహాలో చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఆడపిల్లలు అమాయకంగా అటువంటి వారి ఎందుకు బలయ్యి పరాయి దేశాల్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. వీటిపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. తస్మాత్ జాగ్రత.

అభంశుభం తెలియని నిరుద్యోగ యువత, ఇంటి ఇల్లాళ్ళూ, కులం, మతం పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. బీ కేర్ ఫుల్.

భయపడుతూ బతకమని కాదు, మెలకువతో మసలమనే ఈ వ్యాసం. పైపై మాటలకు పడిపోతే లేవటం కష్టం.  విచక్షణతో  మెలిగినపుడే జీవిత పయనం సాఫీగా సాగుతుంది.

All the best
SSS SRINIVAS VEMURI
Srikakulam, 9492732042