Thursday, 5 July 2018

నెమలి విప్పిన పురి అందాల అలిపిరి
======================

అవి హైదరాబాద్ నుంచి, తిరుపతికి ట్రాన్స్ఫర్ అయిన తొలి రోజులు. ఎందుకొచ్చిన ట్రాన్సఫర్ రా నాయనా? అనుకుంటూ, తిరుపతికి వెళ్లిన రోజులు. ఎవ్వరు తెలిసున్నవాళ్ళు లేరు. ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? అని తిరుపతి వెళ్ళాను.

గుడ్డిలో మెల్ల, అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. వెళ్లిన తరువాత, మా మిత్రుడు ఒకడు ఇల్లు చూడటం, అందులోకి వెళ్లడం జరిగింది.

ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిన తరువాత, భోజనం చేసి నిద్ర పోదామంటే నిద్ర రాలేదు, డాబామీదకెళ్ళి, కోండకేసి చూస్తూ కూర్చున్నా.

శంఖ, చక్ర, నామాలు, కనువిందు చేస్తూ పలకరించాయి.

"శీనా!" ఎవ్వరూ లేకపోవటం ఏమిటి? నేను లేనూ...." 

అని స్వామి పలకరించినట్టు అనిపించింది. అప్పటివరకూ ఉన్న స్తబ్దత పోయింది. కొత్త ఉత్సాహం వచ్చింది. రూమ్ లాక్ చేసి, నడుచుకుంటూ కొండవైపుకు వెళ్ళాను.

చల్లటి గాలి, స్నేహంగా పలకరించింది. అలిపిరి అనే సైన్ బోర్డు కనబడింది. గరుడాళ్వార్ పాదాల దగ్గర కూర్చొని అలా చూస్తూ ఉండిపోయాను. ఎన్నో ఆలోచనలు....

తిరుపతి గురించి స్వామి గురించి. ఆ రోజునుంచి, అలిపిరి, స్వామి నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. తిరుపతి గురించి ఒక్కొక్క విషయం తెలుసుకోవడం మొదలుపెట్టాను. 

తిరు అంటే లక్ష్మి, పతి అంటే భర్త తిరుపతి అంటే లక్ష్మీపతి ఉండే ప్రదేశం. తమిళంలో మలై అంటే కొండ తిరుమలై అంటే శ్రీ గిరి అని అర్థం.

అలిపిరి అంటే, అల్పము,దుర్బలము అనే అర్థాలున్నాయి. విడిగా చూస్తే, అలి అంటే, తేలు, వృశ్చికరాశి, కోయిల, కాకి, మద్యము లాంటి నానార్ధాలు ఉన్నాయి. పిరి అంటే  పురి అంటే, నెమలి ఈక, మెలిక, పింఛము, నగరము, నది, కోట, దేహము, రాజు, తాడు లాంటి అర్థాలు ఉన్నాయి.

ఇంతకీ అలిపిరి అంటే ఏమిటి? సున్నితమైన నెమలి పించామా? కోయిల పాటలో గమకమా? తేలుకొండి లాంటి మెలికలు గల ప్రదేశమా? లేక మొదటి మెట్టు అనా? మొదటి సారి ఈ మాట విన్నప్పుడు ఎన్నో ఆలోచనలు.

కలియుగ వైకుంఠమైన తిరుమలకు చేరుకోవడానికి, మొదటి అడుగు కొండపైన ఎక్కడ పడుతుందో, దానిని ఆడిప్పడి అంటాం . అడి అంటే అట్టడుగు, పడి అంటే మెట్టు. ఆడిప్పడి అంటే కొండ అట్టడుగు మెట్టు అర్థం. ఇంకోలా ఆలోచిస్తే,  అంటే కొండ ఎక్కే తొలి మెట్టు.

ఆడిప్పడి కాల క్రమంలో అలిపిరి అనే నామంతో ప్రసిద్ధి చెందింది, అని కొందరంటారు.

అసలు ఈ ప్రదేశాన్ని మొదట్లో అళిప్పుళి అని అనేవారని, కొందరంటారు.  పుళి అంటే చింతచెట్టు. అళిప్పుళి అంటే   కొండ అట్టడుగున ఉన్న చింత చెట్టు ఉండే ప్రదేశం అని కొందరు అర్థం చెప్పారు. 

చింతచెట్టు ప్రస్తావన ఎందుకు అంటే, స్వామి, భూలోకం వచ్చిన తరువాత ఒక చింత చెట్టు క్రింద ఉండే వల్మీకంలో ఉంటె, విధాత, పరమేశ్వరుడు ఆవు, దూడ రూంపంలో వచ్చి స్వామికి పాలు ఇచ్చారు అని ఇతిహాసం ఉంది. 

స్వామికి చింత చెట్టు అంటే ప్రీతి. బుద్ధిడికి ఏ రకంగా రావి చెట్టు క్రింద జ్ఞానోదయం అయ్యిందో, అదే రకంగా, నమ్మాళ్వారుకు చింతచెట్టు క్రింద జ్ఞానోదయం అయ్యింది అని చెప్తారు. 

ఈ రకంగా చూస్తే, అలిపిరి అనే నేటి పదానికి రక రకాల అర్థాలు తెలుస్తాయి. 

కొండ అడుగున ఉండే చింతచెట్టు ఉండే ప్రదేశం కాబట్టి, దీనికి ఆడిప్పొళి అనే పేరు ఉందని కొందరంటారు. తేలుకొండిలా వంపు తిరిగిన ప్రదేశం కాబట్టి అలిపిరి అనే పేరు వచ్చిందని కొందరు,  మెలికలు తిరిగిన సోపాన మార్గం కాబట్టి, దీన్ని అలిపిరి అన్నారని కొందరు, స్వామి సూక్ష్మ రూపమములో కొలువుండే ప్రదేశం కాబట్టి అలిపిరి అయిందని కొందరు అంటారు. 

ఎవరు ఏ పేరుతొ పిలిచినా, అది ప్రస్తుతం అది అలిపిరి గానే ప్రసిద్ధి చెందింది.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేసిన పరిశోధనలు బట్టి, శేషాచలం కొండలు కాంబ్రియన్ పీరియడ్ అంటే 4.5 నుంచి 2. బిలియన్స్సంవత్సరాలక్రితం, ఏర్పడిన, సిలికాన్ క్వాట్జ్ రాళ్లతో, ఏర్పడ్డ కొండలు అంటారు.

భూమి పుట్టినపుడు ఏర్పడ్డ ఆర్చియన్ శిలలే ఈ కొండలు అని గుర్తించారు. తూర్పు కనుమల్లో భాగంగా శేషాచల కొండలు ఉంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ లో, వాయువ్యం నుంచి, ఆగ్నేయం వైపుగా, అనంతపూర్, కడప, చిత్తూర్ జిల్లాల్లో వ్యాపించి, పాలకొండలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ సారి తిరుపతి వెళ్ళినపుడు, చూడండి, ఎర్రగా, మీగడకట్టిన పాలలా కనిపిస్తాయి తిరుపతి కొండలు.

తిరుమల అందాలు, ప్రారంభమయ్యే ప్రదేశం అలిపిరి. తిరుమల గాలిగోపురం మీద అమర్చిన శ్రీవారి నామాలు దానికి ఇరువైపులా శంఖ, చక్రాలు అలిపిరి చేరే భక్తులకు మరింత రమణీయంగా కనువిందు చేస్తూ కనిపిస్తాయి.

అలిపిరి చుట్టూ త్యాగయ్య వనం, క్షేత్రయ్య వనం, అన్నమయ్య వనం ఇలా వాగ్గేయకారుల పేరిట అభయవనాలు దేవస్థానం వారు పెంచేవారు.

రక్షిత వనాల కౌగిట్లో అలిపిరి నీలి సముద్రంలా కనిపిస్తుంది. కొండగాలి తిరిగినపుడు ఈ వనాల్లో చెట్లు, గాలికి కదిలి హరిత కెరటాలు సృష్టిస్తూ ఉంటాయి.

వారాలు, పక్షాలు, గడిచి నెల అయ్యేసరికి, ప్రతి రోజూ, డ్యూటీ చేసినట్టు నడుచుకుంటూ అలిపిరి వరకు వెళ్లడం, తనివి తీరా ఆ అందాలు చూసి ఆనందించడం ఒక అలవాటయిపోయింది. ఏరోజు, మానేసినా, వెలితిగా ఉండేది.

ఎందుకురా రోజూ కొండదగ్గరకొస్తావు? అని అలిపిరి అడిగినట్టు అనిపించేది.

నా పేరూ శ్రీనివాసే అమ్మా, అని సమాధానం చెప్పుకునేవాడిని.

తిరుపతి చేరే భక్తులు తిన్నగా కొండఎక్కి స్వామి దర్శనం చేసుకుని, అలమేలు మంగాపురం లో అమ్మవారిని దర్శించుకుని, ఇంకా సమయం ఉంటె గోవిందరాజస్వామి దర్శనం చేసుకుని, కాళహస్తి వెళ్లి, తీర్థయాత్ర పూర్తి అయ్యిందని భావిస్తారు.

వేంకటేశ్వరుడు వైకుంఠం వీడి భూమి మీదకు రాగానే, పాలసముద్రం బిగుసుకుపోయి, కొండలా మారి తిరుపతి చేరి ఉంటుంది. తండ్రిని ఆ స్థితిలో చూడలేక, స్వామిని ఒంటరిని చేసి లక్ష్మీదేవి కోపం వచ్చి, మంగాపురం వెళ్లిపోయి ఉంటుంది.

విధిలేక ఆవిడను చూడ్డానికి స్వామి ప్రతి రోజూ కొండదిగి మంగాపురం వెళ్లడం మొదలు పెట్టాడేమో అని నా మనసుకు అనిపించేది. అసలు కారణం ఏదైనా. .

అనునిత్యం తిరుమల భక్తుల రద్దీతో ఉండటం వల్ల,  స్వామికి నిద్రపోవడమే కష్టంగా మారుతోంది. ఇంక అలమేలు మంగా పురం  వరకు ప్రయాణం చెయ్యడానికి సమయం ఎక్కడ? అందుకే, స్వామి, కొంచెం సేపు శిలా రూపాన్ని విడిచి, ఆనంద నిలయం దిగి, అలిపిరిలో హరిత సముద్రం అమ్మవారికి చూపించి, సాగర పుత్రిక అలుక తీర్చి, అశ్వత్థ వృక్షంలా తాను మారిపోయి, వేపచెట్టు రూపంలో అమ్మవారిని దగ్గరకు తీసుకునేందుకు అలిపిరిని సృష్టించాడా అనిపించేది. ఎంతయినా,  జగన్నాటక సూత్రధారి కదా! ఎంతయినా చేయగలడు.

"వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని నేను" అని స్వామి స్వయంగా గీతలో చెప్పాడుకదా. అదీ కాక "ధర్మో రక్షతి రక్షితః " అని ఆనాడు చెబితే, ధర్మ సంస్థాపన జరిగింది. ఈ రోజు మనిషి తన స్వార్థంతో అడవులు నరికి వసుధను పాడు చేస్తున్నాడు.

హిరాణ్యాక్షుడిని అయితే వరాహ రూపంలో ఓడించి భూమిని కాపాడాడు. ఇప్పుడు చెట్లు పాడు చేస్తున్నది స్వయంగా ఆయన పిల్లలమైన మనమే.

పిల్లల్ని తండ్రి దండించలేడుగా, అలా చేస్తే భూదేవి కూడా వూరుకోదు. అసలే కోపంలో ఉన్న లక్ష్మీదేవికి పిల్లల్ని ఏదయినా అంటే పిచ్చి కోపం వస్తుంది. . అందుకే ఎవ్వరికీ కోపం రాకుండా, భూమిని, పిల్లల్ని కాపాడుకోవడానికి , "వృక్షో రక్షతి రక్షితః " అన్న నినాదంతో అశ్వత్థ రూపంతో అలిపిరి వచ్చాడా అనిపిస్తుంది.

చెట్లు కూడా స్వామి లాగానే, స్వార్థం చూసుకోకుండా, విషతుల్యమైన బొగ్గుపులుసు వాయువుని తాము తీసుకుని, ప్రాణ వాయువుని అందిస్తాయి. స్వయంగా ఆహారాన్ని తయారుచేసి, జీవులన్నిటికీ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ అంద చేస్తాయి. మనిషి సంకటములు బాపే వెంకటేశునిలా ఇక్కడ వెలిసుంటాయి.

అవి వరుణదేవుడిని శాసిస్తాయి. వరాహమూర్తిలా, భూసారం కొట్టుకుని పోకుండా, వసుధను రక్షిస్తాయి. అందుకే వృక్షమంటే స్వామికి అంత ఇష్టం. లక్ష్మీనారాయణులే వృక్షరూపాన్ని ధరిస్తే, మిగిలిన దేవతలు, మునులు స్వామిని సేవించడానికి చెట్ల రూపంలో కాక ఏ రూపంలో వస్తారు చెప్పండి. అందుకే వాళ్ళు కూడా తలో చెట్టు అయిపోయి ఇక్కడ వెలసిపోయారేమో అనిపించేది.

లక్ష్మీ నారాయణులు ఎక్కడ ఉంటే అక్కడే సందడి. వారివెంటే సమస్త ఆడంబరాలు వచ్చేస్తాయి. స్వామి రాక తెలియగానే, క్షేత్రయ్య వనంలో చెట్లు అష్టవిధ నాయికల్లా మారిపోయి నృత్యం చెయ్యడం మొదలు పెట్టాయి. త్యాగయ్య వనంలో గండుకోయిలలు, రామనామ సంకీర్తన చెయ్యడం మొదలు పెట్టాయి. అన్నమయ్య వనంలో, పచ్చటి చిలుకలు పదకవితలు గానం చేయటం మొదలెట్టాయి. ముత్తుస్వామి దీక్షితార్ వనంలో, కాకులు హంసలు గా మారిపోయి, అలిపిరి మార్గంలో, వెలసిన గణపతిని, హంసధ్వని రాగంలో కీర్తించడం మొదలె ట్టాయి. వన సీమలో, నూతనాధ్యాయం మొదలయ్యింది. చెట్టంటే అందరికి మక్కువెక్కువయ్యింది. అలిపిరి మెట్ల దారిలో "వృక్షో రక్షతి రక్షితః" అనే ఫలంకం వెలసింది అలిపిరి వైకుంఠపు తొలిమెట్టుగా కాక హరిత వైకుంఠంలా మారిపోయింది. చిత్రం ఏమిటంటే అలిపిరి అన్న ఒక్క పాదంలో పై జీవులన్నీ ఉన్నాయి. వాగ్గేయ కారుల పేరుమీద తిరుమల తిరుపతి దేవస్థానములు రక్షిత వనాలు పెంచుతున్నాయి.

శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే అంటారు. విష్ణువు ఎక్కడ ఉంటే, శివుడు అక్కడే ఉంటాడు. అదిగో, ఆ కనిపించే సీమే కైలాసం. అదే అగస్తీశ్వరుడు వెలసిన కపిలతీర్థం. ప్రదోష సమయంలో నటరాజస్వామి నాట్యం చేసినపుడు, జటాజూటం చెదిరి వదులయ్యింది అనుకుంటా ,భూమి మీదకి, గంగమ్మ, కపిల తీర్థం రూపంలో ఉరకడం మొదలు పెట్టింది. పరమ పవిత్రమైన ఆ పుణ్య జలంలో ఒక్క మునక వేస్తె పాపాలు, హృదయ మాలిన్యాలు కొట్టుకుపోతాయి. పరమశివుడు తిరుమలకు క్షేత్రపాలకుడి రూపంలో దర్శనమిస్తాడు. ఏ క్షణంలో స్వామి ఏమి ఆదేశం ఇస్తాడో? అనే విధంగా నందీశ్వరుడు గంభీర ముద్రలో కూర్చుని ఉంటాడు. అదే నంది సర్కిల్.

భూమ్యాకాశాలవరకు విస్తరించిన స్వామి విరాట్ రూపానికి పులకించిన గరుత్మంతుడు, అలిపిరి ముఖద్వారంలో లేచి సవినయంగా వందనం చేస్తూ కనిపిస్తాడు. సూర్యుడు, అస్తమించేవేళ, అలమేలు మంగమ్మ విద్యుల్లతలా మారిపోయి, మెట్ల మార్గంలో దీపాలు వెలిగింస్తుందేమో అన్నట్టు విద్యుద్దీపాలు వెలుగుతాయి. లోకైక దీపం అలమేలు మంగమ్మ. లోకాలకు వెలుగు చూపే అఖండదీపం, దీపాలు వెలిగిస్తే ఎలా ఉంటుందో, ఆలా ఉంటుంది ఆ సన్నివేశం.

ఎంత అందంగా ఉంటాయి ఆ దీప కాంతులు. చుట్టలు, చుట్టలుగా చుట్టుకున్న ఆదిశేషునిలా మెలికలు తిరుగుతూ, సహస్ర ఫణా ఫణ మండల మండితమై, వేయి పడగలు విస్తరించిన ఆది శేషుడిలా కొండపైకి చేరి విస్తరిస్తాయి. అది చూస్తే అన్నమయ్య పాట "అదివో అల్లదివో శ్రీ హరివాసము" అప్రయంత్నమగా పెదవులపైకి వచ్చేస్తుంది.

శేష శయ్య పై పవళించవయ్యా, స్వామీ! అంటే, నిద్ర రానట్టుంది స్వామికి . అలా నడిచివచ్చి, నల్లని శరీరంతో కొండ వెనుక నుంచొని, రెండు కొండ శిఖరాలపై, చేతులు ఆనించి, ముఖాన్ని, రెండు అరచేతుల్లో పెట్టుకుని, కొండెక్కే భక్తులని చూస్తున్నట్టు అనిపించేది, నల్లటి చీకట్లో మెరిసే ఆ శంఖచక్ర నామాలు చూస్తుంటే. మధ్యలో నామం, ఇరువైపులా శంఖ చక్రాలు. మనసుతో చూడాలే కానీ ఇంతకన్నా గొప్పదైన దివ్యదర్శనం ఎక్కడ దొరుకుతుంది.

ఆనంద నిలయంలో అరక్షణం దర్శనానికే పొంగిపోయే భక్తులు , ఈ దివ్య దర్శనం ఎందుకు వదిలేస్తున్నారబ్బా? అనిపించేది. .
స్వామిని దర్శించు కోవడానికి ఎందరెందరో భక్తులు వస్తుంటారు. తిలకాలు, కుంకుమలు, పెట్టుకుని హిందువులు, బురఖాలు వేసుకుని ముస్లిములు. జాతి, మతంలాంటి బేధాలు అలిపిరి లో కనిపించవు. అందరిలోనూ ప్రశాంతత, ఆయన సమక్షంలో అందరు ఒకటే. అక్కడున్నది ఏ మతం అంటే శాంతి మతం అనిపిస్తుంది.

సృష్టిలో అణువణువూ ఆయన సృష్టే కదా. అందరిలో ఉన్నవాడు ఆయనే కదా? అందుకే నరుడే నారాయణుడని అలిపిరి అలా చెబుతోందా? వసుధను శాంతి నివాసం చెయ్యాలంటే ఇలానే ఉండాలని బోధిస్తోందా? అనిపించేది. ఆ శాంతినివాసంలో ఎన్ని గంటలు, నెలలు, గడిపానో నాకే తెలియదు.

"అలిపిరి అందం మనసుకు బంధం" అని ఒక రేడియో టాక్ అప్పట్లో తిరుపతి ఆల్ ఇండియా రేడియోలో" ఇచ్చా. కానీ తనివి తీరలేదు. అందుకే, చాలా కాలం తర్వాత, నా మనసులో పొటమరించిన భావాలను మళ్ళీ రాయాలనిపించింది. కవిత్వం రాసేటంత నైపుణ్యం లేదు కానీ, మనసుకు నచ్చినట్టు రాసిన ఈ కవిత మీ ముందుంచుతున్నా. బావుంటే చదివి ఆశీర్వదించండి.
అందాల అలిపిరి
==========
నెమలి విప్పిన పురి అందాల అలిపిరీ!
చైతన్య స్ఫూర్తికి ఓ కొత్త ఊపిరీ !
వైకుంఠ ద్వారాన్ని చూపించు శుభకరీ
నీ నిండు గుండెలో ఉన్నాడు శ్రీహరీ
అందాని కందమై మనసుకే బంధమై
సుమ చందనలతో అలరించు మానినీ
మందార మకరంద మరంద మాధురీ
కుహు కుహూ నిక్వాణ సంగీత రసధునీ
నెమలి విప్పిన పురి అందాల అలిపిరీ!
చైతన్య స్ఫూర్తికి ఓ కొత్త ఊపిరీ !
అభయవనముల గాఢ పరిష్వంగమునొంది
హరిత సంద్రము వోలె భాసించి నావే
కొండ గాలికి ఊగి తరుశాఖలే కదిలి
ఉవ్వెత్తునెగసాయి నీలి కెరటాలెన్నో
నీలి కడలిని చూసి పరవసించిన స్వామి
క్షీరాబ్ది విడిచి యీ హరితాబ్ది చేరెనా
అశ్వత్థ రూపాన ఇచట తా వెలసేనా?
నీనెలవె స్వామికీ ఆనంద నిలయమా?
నింబ వృక్షమే స్వామి అర్థాంగి రూపమా?
తరువైన, శిలయైన రూపమేధైనా
స్వామి ఎక్కడవుంటే అక్కడే సందడి.
నిత్య కళ్యాణమూ పచ్చతోరణమూ!
క్షేత్రయ్య వనములో అష్టవిధ నాయికలు
వృక్ష రూపము బడసి నాట్యమాడేరచట
త్యాగయ్య వనములో గండు కోయిలలు
హాయిగా పాడాయి స్వామి శుభ నామాలు
అన్నమయ్యంగారి వనమందు సభచేసి
పదకవిత పలికాయి పచ్చనీ చిలుకలూ
ముత్తు స్వామీ వనము, చేరంగ కాకములు
గణపతి ని ప్రార్ధించే హంసరవ రాగాన
సభ చేసెనా ఏమి ? నీ దివ్య సన్నిధిని
రావి చెట్టుగ మారి కోనేటి రాయుడు.
తరువంటే స్వామికీ అంత ప్రేమేలనే?
స్వార్థ చింతనలేని యుపకారి తరువనా ?
ధర్మాన్ని రక్షించు తిరిగి నిను రక్షింప
అన్నాడు అలనాడు ధర్మాన్నిరక్షింప
రక్షించు వృక్షాన్ని తిరిగి నిను రక్షింప
అన్నాడు ఈనాడు వసుధనే రక్షింప
గీతోపదేశమిది సర్వభక్తులకూ
ఆనందకారకం సర్వజీవులకూ!!
పాప హారము సేయు పరమేశుడడిగో
ఆ దేవుడీ గిరికి క్షేత్ర పాలకుడు.
రుద్రజట జూటమే చెదిరింది యేమో!
కపిలతీర్థము పొంగి జలపాతమయ్యింది
ఆ పుణ్య జలకాన ఒక్క మునకయె చాలు
పోతాయి దురితాలు హృదయ మాలిన్యాలు
గంభీర ముద్రలో వేచికూర్చున్నాడు
స్వామి ముఖ ద్వారాన సొగసైన నంది
కైలాస శిఖరమే నీ దరికి చేరింది
ఎంత పావనమాయె నీ నేల అలిపిరీ!
ఇనుడు పడమర చేరి పొద్దు వాలంగానె,
గుడిమెట్ల దారిలో దీపాలు వెలిగాయి.
కాంతి మెలికలు తిరిగి పాములా కదిలింది
పదివేల తలలున్న శయ్యగా మారింది
క్షీరాబ్ది బిగిసింది పాలకొండయ్యింది
వైకుంఠ శోభనే భువిపైకి తెచ్చింది
ఖగరాజు లేచాడు వందనం చేసాడు
స్వామి స్వయముగ వచ్చి నిలిచేను యేమో?
రెండు కొండలపైన బాహువులు ఆనించి,
హస్తపద్మములందు ముఖపద్మమే యుంచి.
గిరినెక్కు భక్తులను చూచేటి రీతిలో
వెలుగుచున్నవి చూడు నిలువు నామములు
అటుపక్క శంఖము ఇటుపక్క చక్రము
కారుచీకటి మేను కారుణ్య మూర్తికీ
దర్శించి చెప్పవే గోవింద, గోవింద
బ్రతుకు ధన్యత నొంద , చేసి యీ దర్శనం
ఆనంద నిలయాన ఆర్తిగా దర్శించి
ఎట్లు మరిచెదరమ్మ ఈ దివ్య దర్శనం!!
నీవైన చెప్పవే వైకుంఠ అడిపడీ!!
కొంగు బంగారమే ఈ దివ్య దర్శనం.
తిలకాలు, కుంకుమలు ధరియించి కొందరు
బురఖాలు, పరదాలు కప్పి ఇంకొందరు
మతభేదములు మరచి భక్తిలో మునగంగ
శాంతిమతమని నమ్మి సాంత్వనం పొందేరు
వసుధైక భావనకు తొలిమెట్టు నీ సీమ
చైతన్య భావాలు నింపు నీ గరిమ
భక్తంటే భయమా? ముడుపంటే లంచమా?
కాదనుచు ఎరుగుమా ఓ భక్త తెరువరీ
సిరిపతికి నీ సిరులు చిల్లు కాణీలే
మమత కలిగిన ఎదలు శ్రీనివాసములు
అరమరలు లేనట్టి జీవనం తెలుసుకో
నరునిలో స్వామిని వెతకటం నేర్చుకో
స్వామి హృదయము నీకు ఎరుక కావాలంటే
అపపన్న హస్తాన్ని అందించి సాగిపో
ప్రతి మనిషి, ప్రతి పులుగు, ప్రతి చెట్టు ప్రతి పుట్ట
స్వామి సృష్టించెగా, మరి యేల భేదములు?
కరుణ దృక్కుల తోనే సూటి ప్రశ్నడిగేవు
నినుచేరు మనుజులకు సమత నేర్పించేవు
మది నింపి స్ప్హూర్తి ని, ప్రేమను, ఆర్తినీ
సాగ నంపపేవమ్మ వీడ్కోలు పలుకుతూ
సెలవమ్మ అలిపిరీ, సెలవమ్మా సెలవు
శాంతికీ, క్రాంతికీ నీవేను నెలవు.
స్వామి దయ చూపితే మరుసాలుకొస్తాను
ఆత్మబంధువునయ్యి సేవించుకుంటాను.
నెమలి విప్పిన పురి అందాల అలిపిరి
చైతన్య స్ఫూర్తికీ ఓ కొత్త ఊపిరీ.!
భవదీయుడు
సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
విజయవాడ, 19. 10. 2017
(అలిపిరి మెట్ల దారి నుంచి 3550 మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్లనుంచి వెడితే 2384 మెట్లు ఎక్కి వెళ్ళాలి.సముద్రమట్టానికి, 3200 అడుగులు ఎత్తులో ఉండటంవల్ల, తిరుపతికంటే మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉండి, తిరుమల చల్లగా ఉంటుంది. అత్యంత ప్రాచీనమైన, అద్భుతం కొండమీద శిలాతోరణం. అది చూసి తీరవలసిన ప్రదేశం.)
భవదీయుడు
సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
విజయవాడ, 19. 10. 2017