Saturday, 7 September 2019

సామాన్యుని ఆత్మకథ

అప్పటి వరకూ మెత్తని స్పర్శతో నిదురించే నాకు శరీరం ఎవరో నొక్కిపెడుతున్నట్టు  అయిపోయింది. గొంతు పెగలటం లేదు. బయట నిస్సహాయ స్థితిలో ఎవరివో అరుపులు వినిపిస్తున్నాయి. నాది కళ్ళు విప్ప లేని పరిస్థితి.  ప్రాణం పోతున్నట్టు ఎవరో ఏడుస్తున్నారు. అది నాకు బాగా పరిచయం అయిన గొంతు. మా ఇద్దరికీ ఒకటే తేడా వారు ఏడుస్తున్నారు, నేను ఏడ్వలేకపోతున్నా అంతే.ఇద్దరిదీ జీవన్మరణ సమస్యే.

ఏమయితేనేం! విపరీతమైన సంఘర్షణ తరువాత నా శరీరం అప్పటివరకూ చూడని, నాకు తెలియని వింతలోకంలోకి వచ్చింది. ఏదో శక్తి నా కళ్ళకు గుచ్చుకుంది. కనులు తెరవాలని విఫల ప్రయత్నం చేస్తున్నా. కనులు తెరుచు కోవటంలేదు. వింత వింత స్పర్శలు నన్ను తాకుతున్నాయి. గుండెలు మండేలా ఒక్కసారిగా గాలి నా ఊపిరితిత్తుల్లోకి జొరబడింది. గుండెలు మండుతున్న ట్టు అనిపించి కెవ్వున కేకపెట్టా. నాకు తెలియకుండానే ఏడుపు వచ్చింది. నా ఏడుపు వినబడగానే అప్పటి వరకు రోదిస్తున్న గొంతు ఆగిపోయింది. ఆ రోజు ఏప్రిల్ పన్నెండు.

ఎవరో అంటున్నారు, బానే ఉన్నాడు బడుద్ధాయి అని. ఆ గొంతులో నిష్టూరం లేదు. ఆవిడ మాట వినగానే అప్పటివరకూ ఏడ్చిన వ్యక్తి "నిజమా" అన్నట్టు చూసి కళ్ళు మూసుకుంది. ఆవిడ ముఖంలో అలసటతో కూడిన తృప్తి. ఆమె ముఖాన్నే గమనిస్తున్న ఒక పెద్దావిడ కనులు మూసినా ఆవిడ ముఖాన్ని ఆప్యాయంగా తడిమింది.

తన చేతుల్లోకి నన్ను  తీసుకుని "ఏవోయ్" ఇడిగో ఇటు అంటూ నన్ను చూపెడుతోంది. నన్ను చూసిన ఆ వ్యక్తి సంతోషంతో నవ్వాడు. ఆ నవ్విన శబ్దాన్ని పట్టి గ్రహించా, అది నాకు బాగా పరిచయం అయిన గొంతని.  అంతలోనే ఆ పెద్దావిడ నా ఒళ్ళు తుడిచి, వెచ్చటి బట్ట నా పై కప్పి,  నాకు బాగా పరిచయమైన వెచ్చటి ప్రదేశంలో పడుకోబెట్టింది. ఒక మెత్తటి చేయి ఆప్యాయంగా నాకు ఆహారం అందించింది.  అదే నాతొలి ఆహారం. అలా అందించిన చేయి మా అమ్మది. నన్ను మొదటి సారి తిట్టి, తాకి, హృదయానికి పొదువుకున్న పెద్దావిడ మా అమ్మమ్మ, నన్ను ఆర్తిగా చూసి ఆనందంగా నవ్విన గొంతు మా నాన్నది. నేను పుట్టిన సమయం అది.

ఏడవడానికే పుట్టానో, పుట్టినందుకు ఏడుస్తున్నానో తెలియదు కానీ చాలా కాలం ఏడుస్తూనే ఎవరితో మాట్లాడకుండా పెరిగాను. ఇప్పటికీ నాకర్థం కానిది ఒకటే.  ఏడుపు లో కూడా ఒక భాష ఉంటుందని. లేకపోతే ఏవిటి చెప్పండి. ఒకసారి ఏడిస్తే మా అమ్మ పాలు పట్టేది, వేరొక సారి ఏడిస్తే బట్ట మార్చేది, ఇంకొక సారి ఏడిస్తే పాట పాడి జోకొట్టేది.  నా ఏడుపు భాష మా అమ్మకు అర్థం అయ్యేటట్లు వివరించేది మా అమ్మమ్మ. ఆవిడే నాకు మొదటి స్నానం చేయించింది‌. నా ఒంటిమీద పొడిబట్ట కప్పి "ఇది వంటిని కాపాడే ఆయుధంరా, భడవా! అని ఆచ్ఛాదన విలువ తెలియచేసింది. నన్ను మొదటిసారి ముద్దుచేసిందీ, ముద్దుగా తిట్టిందీ ఆ పెద్దావిడే. అందుకే ఆవిడ నాకు అమ్మను మించిన అమ్మ,  అమ్మమ్మ.

గోరువెచ్చని నీటితో స్నానం బావుంటుందని ఆవిడవల్లే తెలిసింది. సాంబ్రాణి వాసన, పరవాన్నం తీయదనం ఆ చేయే నాకు పరిచయం చేసింది. నా మెడలో గొలుసు, నాచేతికి కడియం, నా నోటికి ఉగ్గు గిన్నీ, కడుపుకు ఆవదం, నెత్తికి చమురూ, నాలుకకు తేనే  అన్నీ ఆవిడ పరిచయం చేసినవే. 

నే మెడ నిలిపితే సంబరం, బోర్లా పడితే ఉత్సవం, పాకితే పారవశ్యం, నడిస్తే ఆనందం అన్నీ ఆ తల్లి సమక్షంలోనే. నేను నేలమీద పడిన తర్వాత మా అమ్మ బయటకెడితే నాకు రక్షణ ఇచ్చి, మా పిన్నులు, మావయ్యా, తాతయ్యతో నా ముచ్చట్లు చెప్పి మురిసిపోయింది మా అమ్మమ్మే.

చలివిడి చెంగుకు కట్టి, మా అమ్మతో పాటు నన్ను నాన్న దగ్గరకు పంపినప్పుడు చూడాలి ఆవిడ ముఖంలో దైన్యం. కానీ తప్పదు కదా. పుట్టిన ఇల్లు వదిలి నాన్న రక్షణలోకి వెళ్ళా.

మా ఇంటి కొచ్చాక నాన్న ఎత్తుకుందామని నన్ను తాకినపుడు ఆ చెయ్యి   కరుకుగా తగిలి ఘొల్లుమన్నా. ఆ తరువాత తెలిసింది, ఆ చేయి తాకిన ప్రతీసారీ నాలో వేయి ఏనుగుల బలం ప్రవేశిస్తోందని. ఆ చేయి నాకు నమ్మకమైన ఆలంబన అనిపించేది. నాకు తెలియకుండానే నాన్నంటే అభిమానం విపరీతంగా పెరిగిపోయింది.

రోజూ ఎందుకో బయటకు వెళ్లి పొద్దుపోయాక ఇంటికి వచ్చేవాడు నాన్న. వద్దని ఏడ్చినా వినేవాడు కాదు. ఏదో ఉద్యోగం చేయడానికి అని మాత్రం తెలుసు. సాయంత్రం వస్తూ, వస్తూ నాకోసం ఏదో ఒకటి తెచ్చేవాడు. నే తింటే ఆనందం పడేవాడు. నాకు బట్టలు కొని మురిసిపోయే వాడు. పక్కనే పడుకోబెట్టుకుని కథలు చెప్పేవాడు.

అక్షరాలు దిద్దే వేళ ఆదిగురువయ్యాడు. చదివే వయసులో క్రమశిక్షణ తప్పితే, అపర రుద్రుడయ్యేవాడు. ఆదరించేవేళ భోళా శంకరుడయ్యేవాడు. ఆపత్కాలంలో అపర నారాయణుడయ్యేవాడు. కానీ, నాకు ఒక్కటే అర్థం అయ్యేది కాదు.  నేను కొత్తబట్టలు వేసుకుంటే తాను మాత్రం పాతబట్టల్లోనే ఉండేవాడు. నన్ను రిక్షాలో స్కూలుకు పంపి తాను మాత్రం పాత సైకిల్ మీద బయటకెళ్ళేవాడు. కొత్తబట్టలేసుకో, బండి కొనుక్కో అంటే నవ్వి ఊరుకునేవాడు. ఒకసారి అందరిలా మనకూ మంచి ఇల్లు కొనమని ఎంతచెప్పినా వినకుండా మారాం చేస్తే చెప్పినంత సేపు చెప్పి, ఇంకా వినకపోతే లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. కొట్టిన తర్వాత కాసేపటికి దగ్గరకు వచ్చి కోపంగా ఉన్న నన్ను సముదాయించాడు. నేను కోపంతో తంతే నవ్వాడు. తిడితే ఓర్చుకున్నాడు. బయటకు తీసుకెళ్ళి నాకిష్టమైన తినుబండారాలు కొన్నాడు. నాన్న కొడితేనే బావుంటుందేమో అనేటట్టు చేశాడు. మరుసటి రోజు నన్ను ఎవరో మెచ్చుకుంటే ఆయన ముఖంలో నవ్వు వచ్చింది. అప్పుడు ధైర్యం చేసి ఆయనతో అన్నా "నేను పెద్దయ్యాక అదిగో ఆ కనపడే పెద్ద ఇల్లు కన్నా ఇంకా పెద్ద ఇల్లు కడతా, అమ్మ కుంపటి విసరకుండా దానిముందు ఫేను పెడతా, ఇంటినిండా బోల్డన్ని చాక్లెట్లు బిస్కెట్లు కొనేస్తా! అన్నా.

నేన్నది మంచిమాటేగా! కానీ నే చెప్పింది విని నాన్న కళ్ళల్లో నీరు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నాడు? నాన్నకి ఎలా బతకాలో చేతకాదు. నేను ఇన్ని కొంటానంటే బాధ పడుతున్నాడు అనిపించింది. అలా  అనిపించాకా,  ఇంకెప్పుడు నాన్నని ఇల్లు కట్టమని అడగలేదు.

నాకు ఊహ వచ్చాక, చాలాసార్లు ఈయనకు ఏం తెలియదని అనుకున్నా. పొదుపు పొదుపు అంటూ మాట్లాడి చాలాకాలం నేనడిగినవి కొనలేదు. ఒక రోజు మాత్రం ఇల్లు కట్టుకుంటున్నాం అన్నాడు. చాలా ఊహించా ఇంటి గురించి. తీరా కట్టిన ఇంటికి వెళ్ళిన తరువాత, ఆయన కట్టిన ఇల్లు నాకు నచ్చలేదు. అప్పటికి నా వయసు పద్దెనిమిది. ఆయనకు టేస్ట్ లేదనుకున్నా.

ఇల్లు కట్టిన చాలాకాలం వరకూ నాన్న బట్టలు కొనుక్కో లేదు. చెప్పులూ మార్చలేదు. మాకు మాత్రం అన్నీ కొనేవాడు.

బయట ఫ్రెండ్స్ తో వెళ్ళేటపుడు నాన్న కనబడితే నాకు చిన్నతనంగా అనిపించేది. పలకరింపుగా నవ్వేవాడిని కూడా కాదు. నాన్నెపుడూ నన్ను తప్పు పట్టలేదు.

చూస్తూండగా చదువయ్యి ఉద్యోగం వచ్చింది. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్నలకి బట్టలు కొన్నా. అవి వాళ్ళు చేతిలో పెట్టి దండం పెడితే అందరూ మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

కొంచెం పెద్ద అయ్యానుగా! నాకూ తెలుస్తోంది. అవి ఏడుపు వల్ల వచ్చే కన్నీళ్ళు కాదు,ఆనందం వల్ల వచ్చేవని. నాకెందుకో అనిపించింది, "వీళ్ళని నేను సరిగానే అర్థం చేసుకుంటున్నానా!" అని.

మొదటి సారి నేను మోపేడ్ బండికొని నడుపుతూంటే, నాకు సంతోషం అనిపించింది. మా ఊరెళ్ళి నాన్నతో ఈ విషయం చెప్పాలని అనుకోగానే,  ఒక ఆలోచన నా చెంప ఛెళ్ళు మనిపించింది.

ఈ వయసులో కూడా పెద్దాయన సైకిల్ తొక్కుతూ ఉంటే..... బడితలా ఎదిగిన నేను, బండి నా కోసం కొనుక్కోవటం ఏవిటి? అని.

ఆ ఊహ రాగానే పశ్చాత్తాపం కలిగి బండి మా ఊరు రైల్లో వేసి తీసుకెళ్ళా. నాన్నకి చెపితే వద్దంటాడని చెప్పలేదు.

ఇంటికెళ్ళే సరికి నాన్న తాను పనిచేసే స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు.  బండేసుకుని ఆయన బడికి వెళ్ళా.

ఆయన బడినుండి అప్పుడే  బయలుదేరి ఇంటికి
వస్తూంటే, నేను ఎదురుబడ్డా. ఆయన మొహం నన్ను చూడగానే వెలిగి పోయింది.

నేనడిపే బండి,  నేకొన్నదే అనగానే భలే నవ్వాడు. ఆయనకు మోపేడ్  ఎలా నడపాలో చూపించి, నువ్వు బండి మీద రా నాన్నా! నేను సైకిల్ మీద వస్తా అన్నా.

దానికి ఎంతో బలవంతంమీద కానీ ఒప్పుకోలేదు. చివరకు ఎలాగైతేనేం,  గుండెలు నిండిన ఆనందంతో బండి మీద బయలు దేరాడు నాన్న.

కాలేజ్ రోజుల్లో నాన్న డొక్కు సైకిల్ చూసి సిగ్గుపడిన నాకే, ఈ సారి సైకిల్ ఎక్కి తొక్కుతూంటే గర్వంగా అనిపించింది.

తొలిసారి చిన్నతనంలో నేను నాన్న సైకిల్ తొక్కిన ఆనందాన్ని మించిన సంతోషం ఇప్పుడు కలిగుతోంది.

చూస్తూండగానే రోజులు గడుస్తున్నాయి. నాకు పెళ్ళి అయింది.‌ నాకు కొడుకు పుట్టిన రోజు నాన్న ఆనందానికి, అమ్మ హడావిడికీ అంతే లేదు.

తర్వాత పాప పుట్టింది. నేను నాన్న అయిన తరువాత మెల్ల, మెల్లగా, నాకు నాన్న విలువ తెలియటం మొదలుపెట్టింది.

ఇప్పుడు, నాన్నను గౌరవించడం నాకు తెలియకుండానే జరిగిపోతోంది.

కాలం గడిచే కొద్దీ నా వాళ్ళనుకున్న వాళ్ళు ఒక్కొక్కరే నన్ను విడిచి వెళ్ళిపోవటం ప్రారంభించారు. నాకు తొలిస్పర్శనిచ్చిన అమ్మమ్మ, పండగలొస్తే పిలిచే తాతయ్యా! అందరూ‌....

నాలో ఏదో తెలియని గుబులు. అమ్మా, నాన్నా నాతో ఎప్పటికీ ఉంటే చాలు అన్నా అత్యాశ నాలో బయలుదేరింది. 

వాళ్ళు నాకోసం చేసిన దానిలో కనీసం కొంతయినా చేయాలనే తపనా ఎక్కువయ్యింది.

ఒకప్పుడు చిన్నతనంలో పండగలొస్తే, తాతగారిల్లు స్వర్గంలా ఉండేది. వాళ్ళు పోయిన తరువాత ఆ ఇంటినివైపే పో బుద్ధి కావటం లేదు. ఒకవేళ వెళ్ళి ఆ ఇంటిని చూసినా ఏ స్పందనా కలగటం లేదు.  మనుషులను బట్టి ఇంటికి విలువ, అంతేకానీ కొట్టడానికి కాదుకదా!

ఈ లోగా, ఒకానొక దుర్మూహూర్తంలో అశనిపాతంలాంటి వార్త నా జీవితాన్ని చీకటి చేసింది. నాన్న వెళ్ళిపోయాడు.

కడుపులో ఏదో బెంగ. ఈ వార్త అబద్ధం అయితే ఎంత బావుండును అనే ఆలోచన, నన్ను పట్టి కుదిపేసింది.

కానీ వాస్తవం వాస్తవమే. దాంతో ఏడ్చుకుంటూనే మా ఇంటికి వెళ్ళా.

వెళ్ళేటపుడు దారిపోడుగునా నాన్న చేసిన త్యాగం, నేను ఆయన్ని చేసుకున్న అపార్థం, తరువాత ఆయన సుఖంగా ఉండాలని నే పడిన తపనా....అన్నీ.... సినిమా రీళ్ళలా నా కళ్ళముందు తిరుగాయ్.

నాన్నకు పలికే చివరి వీడ్కోలుకు ఆరోజే తెరలేచింది. ఏ చేతులు నాకు ఆలంబన నిచ్చాయో, అవి అచేతనంగా ఉన్నాయ్. ఏ కళ్ళు నన్ను చూసి ఆనందపడేవో, ఆ కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. ఏ పాదాలకు నేను దండం పెట్టి ఏ పనైనా ప్రారంభించేవాడినో ఆ పాదాలు తాళ్ళతో కట్టుబడి ఉన్నాయి. ఏ నోరు నాకు దీవెన లిచ్చిందో అది అచేతనంగా ఉంది.

నాకోసం, నా సౌఖ్యం కోసం హోమాలు చేసిన మనిషికి,  చివరి హోమం చేసేందుకు నాచేతిలో నిప్పుకుండ ఉంది.

గుండెల్లో బరువు దిగటం లేదు. భవితలో వెలుగు కనిపించటం లేదు.

నాన్న పార్థివ దేహం ముందు నేను నడుస్తూ మహాప్రస్థానం చేరుకున్నా. చివరి ప్రదక్షిణ ఆయన పార్థివ దేహానికి చేసి, తల కొరివి పెట్టా.

బాధతో మూతపడిన నా  కనులకు నాన్న రూపం నవ్వుతూ కనబడింది.

ఏడవకు కన్నా! నాకోసం నువ్వెలా తపన పడుతున్నావో, నీకోసం నీళకొడుకూ అలాగే తపన పడతాడు, వాడి కోసం నువ్వు ధైర్యంగా ఉండాలి అంది.

నాన్నతోటే నా చిన్నతనం పోయింది.

ఉన్నంత కాలం అమ్మను సరిగా చూసుకుంటే చాలని స్మశానం నుంచి ఇంటికి బయలుదేరా.

బాధ్యతలు తీరాక నేను కట్టిన ఇంద్రభవనం నాకు ఇరుకనిపించింది. ఎంత సౌకర్యంగా ఉన్నా నాకు సుఖాన్నవ్వలేక పోయింది.

ఏ ఇల్లయితే ఒకప్పుడు నాకు నచ్చలేదో, అటువంటి మా నాన్న కట్టిన పాతకాలం ఇంటిలోనే నాకు సాంత్వన ఉంటుందని అనిపించింది.

నాన్న తాలూకు జ్నాపకాలు, మా  చెల్లాయితో నేనాడుకున్న ఆటలు, మేం పెట్టుకున్న గిల్లికజ్జాలు, దాని పెళ్ళి, నా మేనల్లుడి చిన్నతనం, నా భార్యతో నేను పండగలకెళ్ళిన దృశ్యాలు, మా నాన్న కొట్టిన దెబ్బలు, అమ్మ చేసిన ఓదార్పులు, నాకు సజీవ జ్నాపకాలై సంతోషం కలిగించేవి.

దేవుడిని ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నా, స్వామి! మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ వీళ్ళు కడుపులోనే పుట్టించు. అదే చెల్లాయిని, ఇదే భార్యని, ఇదే పిల్లల్ని, మా బావిని, మేనల్లుడిని నా కివ్వు.

పేదనై పుట్టినా ఫర్వాలేదు, వాళ్ళ సాంగత్యం నాకు  చివరికంటా ఉంచు అని.

ఓ సామాన్యుని ఆత్మకథలో ఇంతకుమించి ఏముంటుంది చెప్పండి. ఇది నా ఆత్మకథ కాదు మనందరి ఆత్మకథా!

SSS SRINIVAS VEMURI