Monday 2 December 2019

జై తెలుగు తల్లి

ఈ మధ్య కాలంలో నేను ముఖ పుస్తక మాధ్యమం ద్వారా, తెలుగు టీవీ కార్యక్రమాలలో యాంకర్లు తమ అసాధారణ ప్రతిభా పాండిత్యాల ద్వారా మా తెలుగు ప్రేక్షకులకు అందించిన పాండిత్యంలో నెనూ కొంత బడసి అలా సంపాదించిన విజ్ఞానం, నాలోనే ఉంచుకోవటం స్వార్థం అవుతుందని అనిపించడం వల్ల, ఆ పాపానికి ఒడిగట్టలేక నేను తెలుసుకున్న విషయాలు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నా.

ఈ అమూల్య సమాచారం మీలోని జ్ఞాన తృష్ణని సంతృప్తి పరచవచ్చని అనుకుంటున్నా. మీలో ఏ ఒక్కరికి అటువంటి కనువిప్పు కలిగినా నాకన్నా సంతోషించే వారుండరు. ఈ విజ్ఞానం మీకు ఆశ్చర్యం కలిగించినా మీరు దీన్ని అభినందించాలి, తప్పదు.

జ్ఞానోదయం అంటే తెలివి తెల్లవారటం

సంగీతం అంటే సమ్ ఆఫ్ గీతమ్స్ ఈజ్ సంగీతం

చాప=కూర్చొనేందుకు వేసుకునే అల్లికతో కూడిన ఆసనం, నీటిలో పెరిగే జీవ విశేషం

జన్మరాహిత్యం=పుట్టగతులు లేకుండా పోవటం

Curiosity=కుతి, ఆసక్తి

Enthisiasam=గుల,దూల,దురద

శాప్=ఆంగ్లములో shop

గ్నానం=knowledge

వచ్చుద్ది, ఎళ్ళుద్ది.....మొదలయిన వాటిని వచ్చింది, వెళ్ళింది అనే ధోరణిలో వాడటం.

పసుపు=ముఖానికి, కాళ్ళకు రాసుకునే వస్తువిశేషం, లేదా animal దీన్ని కొంతమంది పశువు అనే విధంగా కూడా రాస్తూ ఉంటారు.

జాన్వి= గంగాదేవి పేరైన జాహ్నవి కి సమానార్థక పదం(ట)

ఇందీ వర శ్యామ= ఇంద అంటే ఈ, వర అంటే వరుడు, శ్యాముడు అంటే నల్లని వాడు, అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి వారన్నమాట.

నల్లపూస అవ్వటం=నల్లబడటం, చిన్నపూసలా అవ్వటం.

కానిస్టిపేషన్= రాజ్యాంగం

భోజరాజు ముఖం చూసిన వెంటనే సంస్కృతం వచ్చేది  అని  చదువుకున్నాం.....కానీ ఇప్పుడు తెలుగు కార్యక్రమాలు చూస్తే తెలుగు భాష చస్తోంది.

భాష చావడానికి సవాలక్ష కారణాలు. వాటిలో  కొన్ని తెలుగు అక్షరాలు తొలగించటం వల్ల, మరికొన్ని నూతన యాంకర్లు తెలుగు పదాలకు తమ స్వయం ప్రతిపత్తితో కొత్త అర్థాలు కనుక్కోవటం వల్ల జరుగుతోంది.  ఈ మధ్యే ఒక స్టార్ యాంకర్ పీకము అంటే కోకిల అని చెప్పడం క్రియేటివిటీకి పీక్. పికము అంటే కోకిల, శుకము అంటే చిలుక. 'పి' కి 'పీ' కి తేడా తెలియకపోవటం, శబ్దం మీద సాధికారత లేకపోవడం వల్ల వచ్చే అనర్థం ఇది.

మన రాష్ట్రంలో తెలుగు మీద నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, నూతన అర్థాలు కనుక్కోవడానికి కృషి జరుగుతూనే ఉంది, అని నొక్కి వక్కాణించడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కొంత మన ఆంగ్ల మాధ్యమంలో బోధించే చదువులు, కొంత ప్రభుత్వాల నిర్వాకం, మరికొంత ప్రసార మాధ్యమాల విపరీత ధోరణి, చాలా వరకు మనలోని ఉదాసీనత తెలుగు భాషకు ఇటువంటి దుస్థితిని తెస్తున్నాయి.

ఎందుకు జరుగుతోంది ఈ అనర్థం? ఎందుకు మన భాష తన తీయదనాన్ని కోల్పోతోంది?

ఏ భాషలో నైనా ప్రతీ అక్షరం పలకడానికీ ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి తెలియాలంటే శబ్దోత్పత్తి స్థానాలను గుర్తించాలి. అప్పుడే శబ్దం సుశబ్దం అవుతుంది. నేర్పే వ్యక్తికి శబ్దం మీద పట్టు ఉంటే నేర్చుకునే వారికి చక్కటి శిక్షణ ఇవ్వగలుగుతారు. శబ్దోచ్ఛారణను పరిశీలించినాకే వర్ణక్రమం రాస్తాం, అంటే స్పెల్లింగ్ అన్నమాట.

దాన్ని బట్టి మనం అక్షరాలు కూర్చి పదాలు రాస్తాం.
మీకో విషయం తెలుసా! మనం రాసే అక్షరాలను అవి పలకవలసిన తీరును బట్టి మన పెద్దలు వాటికి
తాళవ్యాలు దంత్యాలు, ఓష్ఠ్యాలు, ఊష్మాలు, దంత తాళవ్యాలు...ఇలా ప్రతి అక్షరానికి అవి పలకే తీరును బట్టి ఒక పేరు పెట్టారు. అక్షరాన్ని పలికేటపుడు మన ముఖంలో ఏ ఏ  స్థానాలని  ఉపయోగించాలో  దాన్ని బట్టే  వాటికి వివిధ పేర్లు పెట్టారు.

ఊష్మం అంటే ఊది పలికే అక్షరం అంటే సిబిలెంట్. ఉదాహరణకు తెలుగులో, స,శ,ష అనేవి ఊష్మాలు. వీటిని పలకడంలో కూడా వైవిధ్యం ఉంటుంది. కొంతమంది స అనే అక్షరాన్ని పలికేటపుడు నాలికను పై పలువరసకి, కింద పలువరసకి మధ్య ఉండేవిధంగా బయటపెట్టి పలుకుతారు. అపుడు శబ్దం అపభ్రంశం అవుతుంది.

ఉదాహరణకు త్రీ ఇడియట్స్ సినిమాలో, వీరూ సహస్రబుద్ధి సకారం వచ్చినపుడు పలికే విధంగా పలకడం అన్నమాట. ఇది వినేవారికి మొదట్లో సరదాగా ఉన్నా తర్వాత కర్ణకఠోరంగా ఉంటుంది. నిజానికి తెలుగు సినిమాల్లో కొందమంది హీరోలకి వీటిమధ్య తారతమ్యం తెలియదు. కొంతమందికి పెల్లి, పెళ్ళి కి మధ్య తేడా లేనట్టు కూడా పలుకుతూ ఉంటారు. కొందరు కథా నాయికలు సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలో ఉన్నా వత్తులు పలకరు. కారణం వాళ్ళకి తెలుగు రాదు. డైరెక్టర్ గారు సరిచేయలేడు. సంభాషణా రచయితలు పంచ్ పడితే చాలనుకుంటారు. అందుకే ఈ దరిద్రం.

చిన్నతనంలో అప్పుడప్పుడే మాటలు నేర్చుకునే నా కూతురు అలాంటి ఒక నవతరం హీరో సినిమా అప్పట్లో చూసి "శ్రీనివాస్"  అనే నా పేరును చాలా ఘోరంగా పలకటం, ఊష్మం వచ్చిన ప్రతీసారీ శబ్దాన్ని అవకరంగా మాట్లాడటం మొదలు పెట్టింది. దాంతో శబ్దాన్ని ఎలాపలకాలో ఆ చిన్ని మెదడుకు అర్థం అయ్యే విధంగా చెప్పేసరికి తలప్రాణం తోకకొచ్చింది. దానర్థం నాకు తోక ఉందని కాదు. మీరు ఒప్పుకోవాలి.

పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పేటపుడు శబ్దాన్ని ఎలా పలకాలో చెప్పాలి. హ్రస్వాలు, దీర్ఘాలు, మహాప్రాణాలూ, పరుషాలు, సరళాలూ, దృత ప్రకృతికాలూ, కళలూ ఇలా ప్రతీ అక్షరం పలకడంలోనూ ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.

సులభమైన పద్దతి మనం అక్షరం పలికేటపుడు పిల్లలు మన నోటిని, పలికే తీరును గమనింపమని చెప్పటం. అలా చేయటం వల్ల వారికి శబ్దోత్పత్తిపై అవగాహన కలుగుతుంది. తరువాత పిల్లల శబ్ద ఉచ్ఛారణని పరిశీలించి శిక్షకుడు సవరించాలి. పదాలను వ్యాకరణ బద్ధంగా కూర్చడం నేర్పాలి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో పదాలు కూర్చడం, ఏకవచన బహువచనాల్లో బేధం గ్రహించేటట్టు చేయడం, దానికి అనుసంధానంగా కర్త, కర్మ, క్రియలను సవరించుకోవటం, మహాప్రాణాక్షరాలు, వత్తి పలికే అక్షరాలు, అక్షరం పలకడానికి పట్టే కాలం నిడివి వీటిని నేర్పిస్తే తెలుగు మాట్లాడినపుడు సంగీతంలా వినిపిస్తుంది.
 అప్పుడే కదా మన తెలుగు భాషలోని అందం, దానికున్న  పరిపూర్ణత, నిజమైన సొగసు ఆవిష్కరించ బడుతుంది.

పలికే పదాలకు అర్థం చిన్నతనంలో నేర్పితే పెరిగేకొద్దీ పిల్లలకి భాషమీద పట్టు వస్తుంది. ఇంగ్లీష్ నేర్పేటపుడు మాత్రమే మన వాళ్ళు  ఇవన్నీ నేర్పుతారు. మన తెలుగు వరకూ వచ్చేసరికి మాత్రం ఉదాసీనత వహిస్తున్నారు.

మాతృభాష  అర్థం అయితేనే అన్ని భాషలమీద పట్టు వస్తుంది. భాషా స్వరూపం మీద ఒక అవగాహన కలుగుతుంది.

చిన్నతనం నుండి నేర్చుకున్న మాతృ భాషను కొత్తగా నేర్చుకోబోయే భాషతో పోల్చి చూసుకుని వ్యత్యాసం గ్రహించినపుడు, కొత్త భాష ప్రత్యేకత పిల్లలకు వంటబట్టి నేర్చుకోవడం సులభం అవుతుంది. మాతృభాషే సరిగా రానప్పుడు వేరేభాష ఎలా వస్తుంది?

ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినా భాషా నైపుణ్యం చూస్తారు. అది లేకపోతే ఉద్యోగం చేయడం కష్టం. భావ వ్యక్తీకరణకు మూలం భాషమీద పట్టు. Concord అంటే agreement of subject with verb, gender, number etc. ఈ అంశంపై కొన్ని ప్రశ్నలు ప్రతీ పరీక్షలో  ఉంటాయి. అంటే కర్త ఏ వచనంలో ఉంటే క్రియ అదే వచనంలో ఉండటం లాంటి బేసిక్ విషయాలు. ఇవన్నీ గ్రామర్ పేరుతో బలవంతంగా బుర్రకెక్కించలేం. అదే మన భాషా స్వరూపం అర్థమైతే పిల్లలకు వేరే భాషలో ఇలా వస్తుంది అనే అవగాహన సులభంగా కలిగించగలుగుతాం.

చిత్రం ఏంటంటే చాలామంది ఉద్యోగం వచ్చాక కూడా ఏదైనా రాసేటపుడు  ఇలాంటి విషయాల్లో తప్పు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అవగాహనా లోపం.

చిన్నప్పుడే మాతృభాష నేర్పేటపుడు వాడుకలో వారు మాట్లాడే వాక్యాల్లోనే వ్యాకరణం అంతర్లీనంగా ఉందని దాన్ని వారికి సోదాహరణంగా అవగాహన కలిగిస్తే గ్రామర్ వంటబడుతుంది. అది వంటబడితే భాషను ప్రయోగించటంలో సాధికారత వస్తుంది.
అప్పుడు పరభాషలు కూడా తప్పులు లేకుండా సులభంగా నేర్చుకుంటారు.

భాషకు మూలం శబ్దం. ఆ శబ్దాన్ని సంపూర్ణంగా పలికేందుకు అవకాశమైన అక్షరాలు కొన్ని సంస్కరణల పేరుతో ఇప్పటికే తొలగించారు.

చేప కు చాపకు బేధం అందుకే పిల్లలకు తెలియటం లేదు. అక్షరాలు కొన్ని తగ్గించి భాషా సంస్కరణ చేశామని భావించడం బాధాకరం.

ఏది పలుకుతామో అదే రాస్తాం. ఎలా రాస్తామో అదే మాట్లాడతాం. ఏది మాట్లాడతామో ఆ రకమైన భాషా మర్యాదతోనే భావావిష్కరణ చేయగలుగుతాం.

భావప్రకటనను బట్టే భాషా సౌందర్యం ఉంటుంది. కాబట్టి వదిలేసిన అక్షరాలను తిరిగి చేర్చుకుందాం. అలు, అలూలు వంటివి వదలకుండా వాటికి కొత్త శబ్దాన్ని ఆపాదిద్దాం. ఎందుకంటే కొన్ని భాషల్లో ఉన్న అక్షర శబ్దాలు మన భాషలో సాధ్యం కావు. ఉదాహరణకు rat, bank పదాలు తెలుగులో రాయటం కుదరదు. అక్కడ ఆ,ఏ అనే అక్షరాలతో పలకలేని కొత్త ధ్వని య కు దగ్గరలో ఉంటుంది. అటువంటి వాటిని సహితం పలికేందుకు ఫొనెటిక్ సౌండ్ గుర్తించే విధంగా మన భాషను సరిదిద్దుకుని పరిపుష్టం ‌చేస్తే మంచి తెలుగు శబ్దంతో పాటు పరభాషా పఠనం సైతం మనకు సాధ్యం అవుతుంది. అలాచేస్తే  తెలుగుతో పాటు ఇదే మాధ్యమంలో వేరే భాషలు నేర్చుకోవడం కూడా కష్టం అవ్వదు.

చిన్నతనంలో మనం చదువుకు ముందు ఒక ప్రార్థన చేసేవాళ్ళం గుర్తుందా, సరస్వతీ ప్రార్థన. ఏమని చేసే వాళ్ళం జ్ఞప్తికి తెచ్చుకోండి.

సుక్తుల్ సుశబ్దంబుల్ జృంభణముగ పల్కు నాదు వాక్కున్ సంప్రీతిన్ బ్రోవవే అని......

చక్కటి మాటలు, సక్రమమైన పద్ధతిలో పలికే శబ్ద నైపుణ్యం ప్రసాదించి, వాక్కును సుస్పష్టంగా పలికే  సామర్ధ్యాన్ని నాకిచ్చి కాపాడవే తల్లీ అని దానికి అర్థం.
స్పష్టంగా పలకటం ఎందుకంటే నాదం పరబ్రహ్మ స్వరూపం. అదే భాషకు మూలం మరియు ప్రాణం.

అందుకే అంటారు.

నాదేన వ్యజ్యతే వర్ణః, పదం వర్ణాత్పదాద్వచః!
వచసో వ్యావహార్యోయం, నాదాధీన మథోజగత్!!

నాదం నుంచి వర్ణం, వర్ణం నుంచి పదం, పదం నుంచి వాక్యం, వాక్యం నుంచి సంభాషణ ఉద్భవిస్తాయి. జగత్తు మొత్తం నాదానికి అధీనమై ఉంటుంది.  అది పరబ్రహ్మ స్వరూపం. దానికి నాశనం లేదు. అందుకే వర్ణాన్ని అక్షరం అంటాం. క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం లేనిదీ అని అర్థం.

మంచి ఉచ్ఛారణ మీద అవగాహన కలిగించండి, తెలుగు అదే వస్తుంది. ఎందుకంటే అది మన మాతృభాష. చక్కటి తెలుగు సాహిత్యం చదివించండి మర్యాదపూర్వకమైన భావ ప్రకటన పిల్లల సొంతం అవుతుంది.


జై తెలుగు తల్లి
భవదీయుడు
సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి