Thursday 5 July 2018



"ఏవండోయ్! సిద్ధాంతి గారు  రాహు, కేతువుల పూజ చేయించుకోమని చెప్పారు, ఎప్పుడు వెడదాం కాళహస్తి?" అడిగింది శ్రీమతి.
"అంత అవసరం అంటావా?" 
"ఇదే సొల్లు వాగుడంటే, నువ్వు ఇలాంటి  ఆచారాల్ని, నమ్మినా నమ్మక పోయినా, నా పిల్లలవిషయంలో నేను ఏది చెబితే అది చేయవలసిందే!" అంది.
"కాళహస్తి వరకూ ఎందుకు? అదే పని ఇంట్లో చేద్దాం!" 
"మీ మొహం, అక్కడయితే చాలా పవర్ఫుల్ అట"
అలా అయితే మన ఇల్లు ఇంకా పవర్ఫుల్!" 
"ఎలా ?"
పిచ్చిదానా, ప్రతీ రోజూ ఉదయాన్నే లేచి నేను పూజ చేస్తా, స్వామికి పువ్వులు పెడతా. తర్వాత నువ్వు పూజ కొస్తావ్. నా పూజ నీకు నచ్చదు. నువ్వు మళ్ళీ మొత్తం మందిరం శుభ్రంచేసి, నీకు నచ్చే విధంగా నీ పూజ నువ్వు చేస్తావ్.
ఆ తర్వాత  నీకూతురొస్తుంది. దానికి నీ సద్దుడు నచ్చదు. అది తన మనసుకు నచ్చినట్టు దేవుడి మందిరం సద్ది, దాని పూజ అది చేస్తోంది. మనమే శ్రీ కాళ హస్తులం. శ్రీ అంటే సాలె పురుగు, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. 
పూర్వం కథలో అయితే అవి కొట్టుకు చచ్చాయ్. అందుకే మోక్షం వచ్చి శివుడిలో కలిసి పోయాయ్.ఇప్పుడు కొట్టుకుంటూనే ఉన్నా, ప్రతి ఇంటిలో  మనలా కలిసే ఉంటున్నాయ్. అందుకే వీటి మధ్య ఎటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా,  శివయ్య ప్రతి ఇంటిలో ఇరవై నాలుగు గంటలు కాపలా ఉంటున్నాడు.

అందుచేత  నువ్వు ఇంటి దగ్గరుండి  పూజ చేసినా శ్రీ కాళహస్తి లో చేసినట్టే. అదే ఆ ఊరు వెళ్ళా వనుకో స్వామి ఉత్సవిగ్రహాలు ఊరేగించేటపుడయినా అప్పుడప్పుడు బయటకెళతాడు. అదే మన ఇంటిదగ్గరయితే, ఎప్పుడు కొట్టుకు చస్తామో అని భయం వేసి, మన కొంపలోనే ఉంటాడు. ఇప్పుడు చెప్పు, కాళహస్తి గొప్పదా? మన ఇల్లు గొప్పదా? 
విన్నంత సేపు వింది. తర్వాత శ్రీమతిని,  రాహుకేతువులు ఆవహించాయి కాబోలు నాకు విషజ్వరం వచ్చినంత సుస్తీ తెప్పించింది.  
అది కూడా ఆవిడకు మాత్రమే సాధ్యమయిన వితండవాదంతో.
ఇదేమి శిక్షరా, శ్రీ కాళ హస్తీశ్వరా???? అనుకున్నా

గోడమీద శివయ్య నవ్వుతున్నాడు.