Sunday, 8 September 2019

సామాజిక మాధ్యమాలు

"మోడీ గారు ISRO లో చేసిన అసలు వ్యాఖ్యలు వింటే ముక్కున వేలేసుకుంటారు!"

"కాంగ్రెస్ పెద్దలు చంద్రయాన్ పై చేసిన కామెంట్స్ వింటే కడుపులో తెములుతుంది."

"అక్షయ కుమార్ మనసులో ఉన్న దేశభక్తి ఇదా?"

"రామ్ గోపాల్ వర్మ అలా కామెంట్ చేయటం వెనకాల అసలు కారణం ఏమిటి? ఆయన వ్యాఖ్యల వెనుక అసలు రంగు బయటపడింది".

యూ ట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇలాంటి చిత్ర విచిత్రమైన కాప్షెన్సతో రకరకాల వీడియోలు దర్శనం ఇస్తాయి.

ఉత్సాహం కొద్దీ ఓపెన్ చేస్తే విషయాలు ఇంకోలా ఉంటాయ్.

మోడీజీ  శివన్ గారిని అక్కున చేర్చుకుని బాధపడద్దని ధైర్యం చెప్పారని, అంతకుముందే కొన్ని వందల సార్లు మనం చదివిన, టీవీల్లో చూసిన విషయాలే ఇక్కడ ఉంటాయి.  కాంగ్రెస్ సహితం ఇస్రోను వెన్నుతట్టి భరోసా ఇచ్చిందని,  అక్షయ్ కుమార్ మనసు గొప్పదని,  రామ్ గోపాల్ వర్మ తనకు ఇష్టం వచ్చినట్టు జీవితంలో ఉంటారని అంతకు ముందే చాలా సార్లు చెప్పిన విషయాలు.....సుదీర్ఘమైన పది నిముషాల చర్చతో సుత్తి కొట్టి మనకు వివరిస్తారు.

వీడియో ఆసాంతం చూసిన ప్రేక్షకుడు హతాసుడై వెర్రి ముఖం వేస్తాడు. అందరికీ తెలిసిన అతి సాధారణ విషయాలు ఇలా కొత్త కొత్త కాప్షన్స్ తో పెట్టడమే కాకుండా, ఇది నచ్చితే లైక్ చేయమనే అభ్యర్థనలు చివర్లో ఉంటాయ్.

ఇవీ ఈ నాటి యూట్యూబ్లో తరచూ దర్శనం ఇచ్చే విషయాలు.

ఎందుకిలా అంటే!  ఏ వీడియోని జనాలు ఎక్కువగా ఆదరిస్తారో వారికి యాడ్స్ వస్తాయ్. దానివల్ల డబ్బు వస్తుంది.

అందుకే వ్యూయర్ షిప్ పెంచుకోవటం కోసం ఇలాంటి చిత్ర విచిత్ర కాప్షెన్స్ తో జనాలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయ్.

ఎక్కువ మంది జనాలు తరచూ చూసేవి వంటల వీడియోలు, సినిమా విషయాలు, క్రికెట్, ఆటలు, హేక్స్, ఆరోగ్యం, ఆధ్యాత్మికం మరియు సినిమా తారల విషయాలు. అందులోనూ  హీరోయిన్ వీడియోలైతే ఆవిడకు బట్ట చెదిరిందని, జాకెట్టు జారిందని చూపిస్తారు.

దానికి తగ్గట్టే వారి కెమెరా కన్ను హీరోయిన్ల శరీరంలో ప్రత్యేక అవయవాల మీద మాత్రమే ఫోకస్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు గానే జనాల్లో పాపులర్ అవడానికి తారామణులు చిరిగిన బట్టల్లో, చిన్న లాగూలతో, పొట్టి పొట్టి గౌనులతో  కనిపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇవికాక జంతువులకు సంబంధించిన వీడియోలు, మిగిలిన జంతువులపై అవి చేసే దాడులు, అవి కలిసే విధానాలు, ఫ్రాంక్ వీడియోస్, ఎబ్బెట్టుగా ఉండే హాస్య వీడియోలు అధిక శాతం ఈ రోజుల్లో అధికంగా హల్ చల్ చేస్తున్నాయి.

మనిషికైనా, జంతువుకైనా ఆహారం ప్రధానం. దానిని దృష్టిలో ఉంచుకుని అడవిలో ఆహారం సంపాదించడం, వంట చేసుకోవడం, పాముల్ని పట్టి  తినడం, ఎలకల్ని కాల్చడం, పురుగులు తినడం చూపిస్తూ ఉంటారు.

ఇలాంటి వీడియోలు సాధారణ పరిశీలనలోనే సత్యదూరంగా అనిపిస్తాయి. చూడ్డానికి కాస్తబావుండి, అవయవ సౌష్టవం ఉండే ఆడపిల్లలకి మోడ్రన్ బట్టలేసి, అడివి మనిషి అనే భ్రమ కలిగించే విధంగా ఏ చెట్టుకిందో చూపిస్తారు. ఆ పిల్ల ఆ చెట్టుకింద నిద్రపోతూ ఒకటో రెండో దోమల్ని నిద్రలోనే  చంపుతుంది. తర్వాత కళ్ళు తెరుస్తుంది. పక్కనే పారే సెలయెరులో ముఖం కడుగుతుంది. ఓం రెండుసార్లు ఆ చుట్టుపక్కల చూస్తుంది. ఓ పాపునో, పిట్టనో, కోడినో, కొంగనో, ఉడతనో, ఉడుమునో పెద్ద రాయెట్టి చంపేస్తుంది. తర్వాత వాటిని చుట్టు పక్కల ఉండే పుల్లలేరి కాలుస్తుంది. ఆ తర్వాత కళ్ళు అరమోడ్పులు చేసి ఆరగిస్తుంది.

కొన్ని వీడియోల్లో అయితే ఆ పిల్ల తిండికి మొహం వాచిపోయినట్టు, ఆహారం కనబడగానే వింత వింత శబ్దాలు, అరుపులు, ఓవర్ యాక్షన్ చేయడాలు ఉంటాయి. మనుషులు మారినా తినేవి అవే చేపలు, అవే పీతలు. నూతనత్వం కోసం సదరు వ్యక్తులను ఎరోటిక్ గా చూపించడం చేస్తున్నారు. దానికి కాప్షెన్ "అందమైన అడివిపిల్ల అమేజాన్ లో చేపను పట్టి తినడం", "పందిని కొట్టి భోంచేయటం" అని ఉంటుంది.

సామాజిక మాధ్యమాలు వచ్చిన తరువాత ఎవరైనా తమ వీడియోలు యూ ట్యూబ్ లో పెట్టుకునే వెసులు బాటు ఎక్కువయింది. ఎంతమంది ఆ వీడియోలు చూస్తే ఆ వీడియో పెట్టిన వారికి అంత లాభం. ఆ లాభాల వేటలో వీడియోలు పెట్టే వారి సృజన వెర్రితలలు వేస్తోంది.

ప్రసవం నుంచి పడగ్గది వరకూ, ఆహారం నుంచి ఆహార్యాలు తొలగించే వరకూ, ఆధ్యాత్మికం నుంచి అడవి మనుషుల సంభోగాల వరకూ కాదేదీ వీడియోకి అనర్హం అనే చందంలో ఉంటున్నాయి ఈ వీడియోలు.

హాస్యం పేరిట కుర్చీలు లాగేయటం, ప్రెంక్ వీడియోలు  పేరుతో సాటి మనుషుల్ని అవమానించడం, పానీ పూరీ షాపుకెళ్ళి పక్కవారి ప్లేట్లో ఆహారం తినేయటం, పాతకాలం నాటి జోకులు, హాస్యకధలూ పునరావృత్తం చేయటాలు ఎక్కువయ్యి మెల్ల మెల్లగా ఇవంటే విముఖత కలిగి ఏవగింపు ఏర్పడుతోంది.

ఒక కొత్త విషయం చెప్పే వీడియో బావుంటుంది కానీ విషయం తక్కువ, ఆర్భాటం  ఎక్కువ, డిగ్నిటీ తక్కువ, వెకిలితనం ఎక్కువ ఉండే వీడియోలు పిల్లలు చూస్తే అదే నిజం అనుకుని చిన్నతనం నుంచే లేకితనం నేర్చుకునేటట్టు ఉంటున్నాయి. ఈ విషయం బాధ కలిగిస్తోంది.

ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాల్లో విషయం తక్కువ అహంభావం ఎక్కువ,  మతపరమైన వీడియోల్లో అసత్య ప్రచారం, మత విద్వేషం, అసలు దేవుడంటేనే నమ్మకం పోయే విధంగా ఈ  ప్రచారాలు ఉంటున్నాయి.

అందరికీ ఈ మాధ్యమాలు అందుబాటులో ఉండే వేళ  ఇటువంటి పరస్పర విరుద్ధమైన అంశాలు పిల్లలు చూసినపుడు, సమాజాన్ని అర్థం చేసుకోవటంలో ఒక కన్ఫ్యూజన్ కి గురవుతారు. చివరకు విచక్షణ కోల్పోతారు.

సామాజిక బాధ్యత మాకు అనవసరం, హేతుబద్ధతతో మాకు సంబంధం లేదు, ఇష్టమైతే చూడండి మేం ఇలాగే తీస్తాం అని బల్లగుద్ది మరీ వాదించడం సోషల్ డిస్కషన్స్ లో ఈ మధ్య  తరచూ చేరుతున్నాయి.

పిల్లల్ని చిన్నతనం నుంచీ మానసికంగా ఎదగడానికి, చక్కటి సృజనతో చుట్టూ ఉన్న సమాజాన్ని ఆకళింపు చేసుకోవడానికీ అనువైన వీడియోలు కూడా ఉన్నా, చెడు ఆకర్షించినంత త్వరగా మనుషుల్ని మంచి ఆకర్షించ లేక పోతోంది. కానీ మెల్ల మెల్లగా అలవాటు చెస్తే అదే ఇష్టం గా మారుతుంది. చూడ్డానికి ఏ మాత్రం బావుండని హీరోలతోనే అలవాటు చేసుకుని ఆదరిస్తున్నాం, ఇలాంటివి ఎందుకు సాధ్యం కావు?

రియాల్టీ షోలు మరీ విపరీత ధోరణులతో ఉంటున్నాయి. మన దగ్గర కొన్ని లక్షలమంది మెరికల్లాంటి చదువుకున్న పిల్లలు ఉన్నారు. చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు, సమాజం అవసరాలు, కావలసిన సాంకేతిక అవసరాలు అనే విషయాల్ని వారికిచ్చి, వారికి కావలసిన సదుపాయాలతో ఓ పదిరోజులు ఓ ఇంట్లో ఉంచి వారి అభిప్రాయాలను సేకరించి చూడండి, ఎన్నో సమస్యలకు సమాధానం దొరుకుతుంది.

సమస్యలవైపు దృష్టి మళ్ళిస్తేనే కదా సమాధానం దొరికేది. అటువంటి వాటివైపు దృష్టి పెడితే సమాజం అభివృద్ధి సాధిస్తుంది.

భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్  డెవలప్ మెంట్ పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రయోజనం నామ మాత్రంగా ఉంటోంది. ఇటువంటి రియాల్టీ షోలు పెడితే చిన్నతనం నుంచీ పిల్లల్లో శాస్త్రీయ దృక్పధం పెరుగుతుంది. యువతలో జీవన నైపుణ్యాలు పెరుగుతాయి.   దేశం నుంచి ఎంతోమంది నూతన శాస్త్రవేత్తలు పుట్టుకొస్తారు.

అలాగే నేటి సమాజంలో ఎక్కువ ఇబ్బంది పెడుతున్న సమస్యలు శాస్త్రజ్నులకిచ్చి వాటి పరిష్కార మార్గాలమీద రియాల్టీ షోలు పెట్టండి. భావితరాలకు చక్కటి పరిష్కారాలు లభ్యం అవుతాయి. పదిమంది మనల్ని పరిశీలిస్తున్నారు అన్నప్పుడు మనిషి ఆలోచనా విధానం, సమస్య పరిష్కరించడంలో వేగం డిఫెరెంట్ గా ఉంటుంది. ప్రజలు కూడా అటువంటి మేధావులను గుర్తిస్తారు. ప్రజా స్పందన, అభినందన కలిగించే మోటివేషన్ మాటల్లో చెప్పలేం. శాస్త్రజ్ఞులు స్ఫూర్తి చెందితే ఆ ప్రయోజనం సమాజం మీద చాలా ప్రభావం చూపుతుంది.

టెక్నాలజీని సరైన దిశలో ఉపయోగిస్తే ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఆ దిశగా ప్రజలు, ప్రభుత్వాలు కృషి చేస్తే ప్రపంచం మరింత అభివృద్ధి సాధిస్తుంది.

SSS SRINIVAS VEMURI