Monday, 2 December 2019

సుబ్రమణ్య షష్ఠి.

ఈ రోజు సుబ్రమణ్య షష్ఠి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పండక్కి విపరీతమైన ఆదరణ ఉంది. ప్రతీ ఇంటినుంచి భక్తులు ఉదయాన్నే లేచి స్నానాదికాలు కావించి, పూలు, పడగలు, పళ్ళు, తీసుకుని గుడికి వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు.

షష్టి రోజు అక్కడ సెలవు. ఊరు ఊరంతా తిరునాళ్ళు జరిగేది. ఎక్కెడెక్కడి నుంచో వ్యాపారస్థులు వచ్చి జీళ్ళు, పాపిడి, బజ్జీలు, ఖర్జూరాలు, పిల్లలకు ఆడుకునే వస్తువులు, బూరాలు, ఎర్ర కళ్ళజోళ్ళు, మురళీలు, బొమ్మలు రకరకాల ఆట వస్తువులు అమ్మటం జరుగుతూ ఉండేది.

పురుషొత్తపల్లిలో ఉండేటపుడు గోపవరం గుడికి, తణుకులో ఉన్నప్పుడు పామర్తివారి గుడికి వెళ్ళటం జరిగేది. పిల్లలకు షష్ఠి బాగా ఇష్టమైన పండుగ. పిల్లలు ఎవరు ఎదురైనా,  పెద్ద వాళ్ళు కొనుక్కోవడానికి ఎంతో కొంత చేతిలో పెట్టేవారు. అన్ని ఊళ్ళూ ఒకలా ఈ పండుగ జేస్తే.... అత్తిలి గుడిలో ఈ పండుగ మరీ ప్రత్యేకంగా చేసేవారు. వారం పైనే ఈ ఉత్సవాలు ఆ ఊళ్ళో జరుగుతాయి. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు  జరుగేవి.  ప్రతీరోజూ లక్షల సంఖ్యలో భక్తులు అక్కడ హాజరవుతారు.

ఇరుకు ఇరుకు రోడ్లమీద మనుషులు నడిచే వీలు లేకపోవటం వల్ల,  ఆడామగా తేడాలేకుండా ఒరుసుకుని ఒరుసుకుని నడవటం జరిగేది. ఇది వయసులో ఉన్న  కొంతమంది ఆకతాయి యువతీ యువకులకు  పండగలా అనిపించేది.

ఆ పండుగ  రోజుల్లో అత్తిలి గ్రామంలో ఎక్జిబిషన్లు, ఫొటో స్టూడియోలు, లెక్క లేనన్ని బార్లు ఊరునిండా షామియానా స్టాల్స్ లో కనిపించేవి. వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగేది. ఇప్పటికీ అదే నడుస్తున్నా షాపింగ్ మాల్స్ కొల్లలుగా విచ్చేసిన ఈ రోజుల్లో పాత శోభ కనిపించటం లేదు.

రద్దీ ప్రదేశాల్లో తిరగటం అంతగా ఇష్టపడని నేను ఒక్కసారి మాత్రమే అక్కడకు వెళ్ళటం జరిగింది. అక్కడకు వెళ్ళిన తరువాతే,  భానుమతి గారు పాడిన "దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా". ‌. అనే పాటలో; 'ఆడపిల్ల తిరునాళ్ళకు వెడితే అల్లరిపెట్టే ఆకతాయి మలపరాముల పట్టుకుని దుమ్ము ఎందుకు దులపమన్నారో అర్థం అయింది'.

అత్తిలి గ్రామంలో పండుగ జరిగే రోజుల్లో ప్రతీ ఇల్లు అతిథి అభ్యాగతులతో నిండిపోతుంది. ఊరు ఊరంతా కోలాహలంగా ఉంటుంది. ఎక్కడెక్కడో నుంచో చుట్టాలు వస్తారు. గుడి మీంచి పాటలు, వేదనాదాలు సతతం వినిపిస్తూనే ఉంటాయి.

చిన్నప్పటినుంచి నాకు ఈ పండగంటే ఇష్టం. ఆ రోజు నిద్ర లేవటం కొంచెం లేటు అయితే అప్పటికే గుడికి వెళ్ళోచ్చిన పిల్లలు బూరాలు ఊదుకుంటూ ఎర్రకళ్ళజోళ్ళు పెట్టుకుని ఇంటికొచ్చి లేపేసేవారు.

ఆ రోజుల్లో ప్రతీ షష్టికి ఏదోఒక దేవుడు ప్రతిమ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసింది కొనటం నా కలవాటు. ఒకసారి శివుడు, ఇంకోసారి కృష్ణుడు, తరువాత హనుమంతుడు ఇలా చాలా కొన్నా. చాలాకాలం అవి మా ఇంట్లో ఉన్నాయ్. తణుకులో వరదలు వచ్చినపుడు మా మేడమీద నాకోసం నాన్నగారు కట్టించిన రీడింగ్ రూమ్ లో నేను పెట్టుకున్న విగ్రహాలన్నీ తుఫాను రావటం వల్ల, ఇంటి  పై కప్పు ఎగిరిపోయి, విపరీతంగా కురిసిన తుఫాను వర్షంలో  కరిగి పోయాయి.

నేను ఎంతో కష్టపడి వెతికి, వెతికి  కొనుక్కున్న ఎన్నెన్నో పుస్తకాలు, తెలుగు సాహిత్య గ్రంథాలు, తిరుపతిలో పనిచేసినప్పుడు చాలా చోట్ల వెదికి వెదికి  కొన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం..... అన్నీ పోయాయి.

ఆ వేంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అందంగా, నవ్వుతూ చూస్తే కన్నుతిప్పుకోలేనంత ఆకర్షణతో ఉండేది. ఇంటికొచ్చిన వారు ఎవరైనా దానిని చూస్తే అలాగే చూస్తూ ఉండిపోయే వారు.‌ప్రతీ శనివారం నాన్నగారు  దానికో పూలమాల వేసే వారు . హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినపుడు, సాయంత్రం సమయంలో, మేడ మీద ఉన్న  నా రూమ్లో భగవద్గీత కేసెట్ ప్లే చేసుకుని, పక్కనే ఉన్న పైడిపర్రు కాలువ మీదుగా వీచే పంటపొలాల పచ్చిగాలి పీల్చుకుంటూ ఏదో ఒక పుస్తకం చదవటం నాకు ఆనందంగా ఉండేది.

తుఫాన్ తాకిడికి పాడయిన రూము, తడిసి పనికి రాకుండా పోయిన పుస్తకాలు, కరిగిన విగ్రహాలు, మూగబోయిన టేప్ రికార్డర్ నాకు చాలా బాధ కలిగించాయి. షష్టి తీర్థం జ్నాపకాలు అన్నీ నీరుగారి పోయినందుకు అదోలా అనిపించింది. మళ్లీ అవన్నీ పునర్నిర్మించుకోవాలని అనుకున్నా. దేవుడు ఆ అవకాశం ఇవ్వలేదు. అసలు షష్టి అంటేనే విముఖత, భయం, బెంగ కలిగేటట్లు చేశాడు.

ఒకప్పుడు షష్టి అంటే నాకు ఆనందం, ఇప్పుడు అదో సంస్మరణ దినం. విగ్రహాలు కరిగిన తరువాతి ఏడాదే తిరుపతిలో ఉన్న నాకు ఒక టెలిగ్రాం వచ్చింది. నాకు వేదం చెప్పిన నా గురువు, నా మాతామహుడు, ఇకలేరని.  అదే రోజు ఆయన  కాలం చేశారు.

ఆ వార్త వినగానే ఏదో తెలియని బాధ, ఉద్విగ్నత, తిరిగి తాతయ్యను చూడలేనన్న పచ్చినిజం నాకు అలా మనసులో షష్టి  జ్నాపకంగా మిగిలిపోయింది.

ఎన్ని జన్మలెత్తినా అటువంటి వ్యక్తి నాకు గురువుగా దొరికడు. ఒకవేళ దొరికినా ఆయన నాకు తాతయ్య అవ్వడు. అందుకే షష్టి నా చిన్నతనాన్ని, తాతయ్య జ్నాపకాలని దూరం చేసిన విధంగానే నాకు గుర్తుంది. అయితే దీనిలోనూ ఒక సంతోషం. శివునికే గురువై, తండ్రికే చదువు చెప్పిన చదువుల రాజు కార్తికేయుడు.‌తాతయ్య ఆయనలో ఐక్యం కావటం వల్ల ఆయనలోనే తాతయ్యను చూస్తున్నా.

శ్రీ పీసపాటి సోమనాథ గురుదేవ పాదారవిందాభ్యానమః.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
02.12.2019, శ్రీకాకుళం