Tuesday 25 February 2020

ఆనంద పయనం

పనికి భయపడితే కష్టం అనిపిస్తుంది.
అదే పని చేసుకుంటూ పోతే
సులువు దొరుకుతుంది.

పని ఎలా చేయాలిరా? భగవంతుడా!
అని పనిలోని కష్టాన్ని ఆలోచిస్తే
భయం మాత్రమే మిగులుతుంది.
చివరికి అది దుఃఖాన్ని మిగులుస్తుంది.

ప్రయత్నించి చూద్దాం
అని మొదలుపెడితే
ధైర్యం అదే వస్తుంది. 

ఆలోచనల్లో భయపెట్టే పని,
చేయడం మొదలుపెడితే
అనతికాలంలోనే మచ్చికవుతుంది.

పని చేయని వాడికి జీవితం బరువు.
పని చేసేవాడికి జీవితం సులువు.

చిటికడంత పని చేసి
ఆపసోపాలు పడేవాడు,
పలాయన వాదానికి ఉపక్రమిస్తే,
కొండంత పని చేసేవాడు,
ఇంకా పని ఉంటే బావుండునన్న
ఆశావాదానికి ఊపిరి పోస్తాడు.

పని మొదలు పెట్టినపుడు
కష్టం అనిపిస్తుంది.
చేసుకుంటూ పోతే
కొత్త విషయాలు పరిచయం చేస్తుంది.

ఎగ్గొట్టడం మొదలు పెడితే
మొదట సులువుగా అనిపించినా,
కాలం గడిచే కొద్దీ బరువుగా మారి
ఉన్న ఆలోచన కూడా ఎండగట్టేస్తుంది.

పని మీద మనసు పడేవాడు,
పరిష్కారం వెదుకుతాడు.
పనికి భయేపడేవాడు
ఒంకలు వెదుకుతాడు.

పరిష్కారం కోసం వెదికే వాడు
అవకాశాలు అందుకుంటాడు.
పరిష్కారం తెలిస్తేనే
పని చేద్దాం అనుకునేవాడు
ఉన్న అవకాశాలు వదిలేస్తాడు.

పని తెలిసిన వాడు
గౌరవం పొందుతాడు,
పని తెలియనివాడు,
గౌరవం ఇచ్చే వారికోసం వెదుకుతాడు.

ఏ పనీ మొదలు పెడుతూనే....
విజయవంతం అవుతుందన్న,
నమ్మకమైన విశ్వాసం ఇవ్వదు.
విజయవంతమైన ప్రతీ పనీ
నిరంతర కృషి వల్ల మాత్రమే
సాధ్యం అవుతుంది.

యాదృచ్ఛికంగా వచ్చే విజయం
గాలివాటుతనం లాంటిది
జీవితాన్ని విజయవంతం చేయదు.
శోధించి సాధించే విజయం
నిలకడైన హిమాలయం లాంటిది
ఎక్కిన ప్రతీ ఎత్తులోనూ
నమ్మకమైన భరోసాతో
ఉన్నతంగా నిలుపుతుంది.

పని చేయటంలో ఆనందం ఉంది
విడిచి పెట్టడంలో దుఃఖం ఉంది.

పని చేయటం అంటే,
నిర్దిష్టమైన ప్రణాళికతో,
ముందుకు సాగటం.
ఏది తోస్తే అది చేయటం కాదు.

చేసే పూజే నిత్యం చేసినా
సంకల్పం చెప్పుకొనే మనిషి
జీవితం సాఫల్యం చేసుకోవడానికి
ఏది చేయాలో సంకల్పించుకోక పోతే ఎలా?

సంకల్పంతో చేసే పూజకు
దేవుడు ఫలితం ఇస్తాడో లేదో తెలియదు
సంకల్పించి చేసే ప్రతీ పనికి
తప్పక ఫలితం ఇస్తాడు.

పని చేయండి,
చేయటంలో ఆనందం చవి చూడండి.
అది వ్యసనం కాదు
ఆనంద కోసం చేసే పయనం.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042