Tuesday 24 March 2020

శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు

శిశిర దుశ్శాసనుడు
వృక్ష ద్రౌపది వలువ
ప్రకృతి పేరోగలమందు
ఒలుచు వేళ,
కావమంచు తరులు
కమలనాభుని పిలువ
మధుమాస మేతెంచి
చివురు చీర లిచ్చి
వృక్ష మానము నిలిపె
చూడ‌ రదిగో!

పచ్చదళముల తోడ
పట్టు చీరలు తొడిగి
మురిసి తరువులన్ని
ముదమునంది
తమ్ము కాచినట్టి
మాధవుని కొలువగా
మెచ్చి మాధవుండు
వచ్చినిలిచె నదిగొ
ఈ మాస మందుకే
మాధవంబాయె

మధు మాధవాలతో
మనసు దోచు నట్టి
మన్మధుని కాలమా
సిరుల సింగారమా!
మరుల మంజూషమా
ఋతు వసంతమా!
పలుకు చుంటి నీకు
స్వాగతంబు.

అభిషేక సమయాన
ఘంట మ్రోగించుచూ
ఆగమార్థంబంచు
మంత్రమ్ము బలుకునటు
కోకిలమ్మ కూతె
నీకు ఘంటారవము
వలపు నిండిన ఎదలు
సుమనస్సులు నీకు.

చీర వలువలిచ్చి
తరువులను గాచి
దీనజన రక్షకుడన్న
కీర్తి బడసి
లోక ప్రియుడవైన
వేణు గోపాలుడా
చీరదోచినట్టి లీల
పతులకు నేర్పి
వయసు పండించరా!
యనుచుండి రదిగో
దోరవయసులోని కాంతలంతా!

వారి ప్రార్థన విని
ప్రతి పతిని మలిచాడు
మన్మధుని అంశగా
కొంటె మాధవుండు.
స్వీయ చెరసాలలో
దొరుకు ఏకాంతాన,
మీ చూపు విరి శిరము,
మీరె మన్మధుండు
ఇంకేల ఆ జాగు,
మధురిమలు గ్రోలగా!

(ప్రతీ కష్టంలోనూ ఒక సుఖానికి అవకాశం ఉంటుంది. శార్వరి ఉగాదిని స్వీయ రక్షణకై ఇంట గడుపుతూ, మీ కుటుంబ సభ్యులతో ఆనందం పొందండి.

డా రామడుగు వేంకటేశ్వర శర్మ గారి శిశిర ఋతువు ఆహ్వానంలో ఒక పద్యం స్ఫూర్తి నివ్వగా, దానికి నా భావాన్ని జోడించి, ఈ కవితలో చెప్పే ప్రయత్నం చేశాను. మీ అందరికీ శార్వరి నామ శుభాకాంక్షలు.)

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042