Monday 30 March 2020

రకరకాల మనుషులు

మొన్నామధ్య మా మిత్రుడు ఒకడు, ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటే, ఉన్నట్టుండి పొగిలి, పొగిలి నవ్వాడు.

అక్కడున్న  అందరం ఏం జరిగిందో తెలియక తత్తరపడ్డాం. అందరూ ఒకసారి వారి వారి స్థితి, గతులు ఆచ్ఛాదనలు చూసుకున్నారు.

అంతా అయ్యాక అప్పుడడిగారు. ఎందుకు నవ్వావని.

నవ్వటం అయిన తర్వాత చెప్పాడు. నెల రోజుల క్రితం నే చెప్పిన జోకు ఇప్పటికి అతనికి అర్థం అయిందని.

కంపెనీలో జరిగే ప్రతీ విషయాన్ని అధ్యయనం చేసి, కంపెనీ బాగుపడాలంటే ఏం చేయాలో,
సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మీటింగ్ అది. దానిలో ఇతనో మెంబర్.

విషయగ్రహణలో అతనికున్న  చురుకుదనం చూసి అక్కడున్న వారికి నోట మాట లేదు.

కొందరంతే, విషయం మూలాలు అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటారు.

దాంట్లో తప్పులేదు. అందరూ చురుగ్గా ఆలోచించలేరు. కొంచెం మెల్లిగా అర్థమయినా ఇటువంటి వారితో ఇబ్బందులు ఉండవు.

కొంతమందికి మనం ఏది చెప్పినా అర్థం కాదు. ఇలాంటి వారు మళ్ళీ  రెండు రకాలు. కొంతమందికి సహజంగానే అర్థం కాదు. వీళ్ళ వల్లా ఇబ్బంది ఉండదు. 

మరికొంతమంది మనం చెప్పేది అర్థమయినా అర్థం కానట్టు నటిస్తారు.

ఇలాంటి వాళ్ళను  మళ్ళీ మూడు రకాలుగా విభజించవచ్చు.

ఒకడు అర్థం అయినా, అవ్వలేదంటాడు. అర్థం అయినట్టు చెబితే ఏది ఎక్కడ మెడకు చుట్టు కుంటుందో అని జాగ్రత్త పడటంలో ఇదో టెక్నిక్.  వీడు పనిదొంగ.  ఇలాంటి వాళ్ళు హాజరు పట్టీలో సంఖ్యకు తప్ప దేనికీ ఉపయోగపడరు. విరివల్ల పనులు కావు. జీతం దండగ అవుతుంది.

మరికొందరీ ఎదుటి వ్యక్తి చెప్పేది సబబని తెలుసుకున్నా ఓడిపోవడానికి ఇష్టపడక వితండ వాదం చేస్తారు. వీరికి ఇగో ప్రాబ్లం. హీట్ తగ్గాక దారికొస్తారు. వీరివల్ల అవ్వాల్సిన పనులు సకాలంలో అవ్వవు. కనుక ఇబ్బంది కొంచెమే ఉంటుంది.

మూడోరకం;  ఎదుటి వ్యక్తి పరోక్షంగా తనమీద కామెంట్ చేస్తున్నాడని భావించినప్పుడు, విషయం పక్కతోవ పట్టిస్తారు. గుమ్మడి కాయ దొంగలు టైపు. ఇంకొందరు అసలు విషయం పక్కతోవ పట్టించి, మనం చెప్పేది వినకుండా, తన మనసులో ఎలా అనుకుంటే ఆ మాటే చెబ్తారు. ఇది  విచిత్ర ధోరణి.  తెలియని వాడికి చెప్పొచ్చు, నటించే వాళ్ళతోటే కష్టం.

సాధారణంగా పదిమంది ఉన్నచోట పోలిటిక్స్ ప్లే చెసే వాళ్ళు ఈ కోవకి వస్తారు. అంటే రాజకీయ నాయకులని కాదు. రాజకీయం చేసే వాళ్ళని. వీళ్ళతోటే జాగ్రత్త అవసరం.

విషయం పక్కతోవ పట్టించి, మూలానికి దూరంగా, వేరేదో విషయం చర్చకు పెట్టి, కొండకచో ఇసుకలో తైలం తీసినట్టు, సిట్యుయేషన్ మేనెప్యులేట్ చేసి, స్వలాభం కోసం  బ్లాక్ మెయిల్ చేయటం ఇటువంటి వారి పని. వీళ్ళతో అందరికీ  ఇబ్బందే.

ఈ మనస్తత్వాలు మనకు అన్నిచోట్లా దర్శనం ఇస్తాయి. ఇళ్ళల్లో, ఆఫీసుల్లో, కళారంగంలో, విద్యారంగంలో, సమాజంలో ఆఖరికి  సామాజిక మాధ్యమాల్లో కూడా.

ఎలా అయినా ఎదుటి వ్యక్తిని కిందికి లాగాలనే ప్రయత్నం, సంబంధంలేని విషయాల్లో కూడా తలదూర్చి స్వలాభం పొందటం,  ఇవన్నీ ఈ కోవ వ్యక్తుల్లో దర్శనం ఇస్తాయి.

సాధారణంగా తనకు తెలిసిన విషయం పదిమందితో పంచుకోవాలని మనిషి తాపత్రయ పడినపుడు, వాడి ప్రయత్నాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించడం వీళ్ళ పని.

ఎవరితోనైనా కొన్ని రోజులు పరిశీలనతో  మాట్లాడితే ఎదుటి వ్యక్తి తత్వం తెలుస్తుంది. కొంచెం ఎక్కువ పరిచయం ఉంటే వీళ్ళ తత్వం పూర్తిగా తెలుసిపోతుంది. అందుకే వీళ్ళు తరచూ కొత్త వ్యక్తులకు ఎలా వేసి, వారిద్వారా  వాళ్ళు టార్గెట్ చేసే వారిని ముగ్గులోకి లాగుతారు.  వీళ్ళ తత్వం తెలిసిన వారు  వీళ్ళని దూరం ఉంచే ప్రయత్నం చేసినపుడు,  చాడీలు, గాసిప్ లు సృష్టించి కలిసున్న వారిని మిత్రబేధంతో విభజించి శత్రువుకు, శత్రువు మిత్రుడన్న చందంలో ఒకప్పుడు దూరం అయిన వారికి  చేరువయ్యే ప్రయత్నం చేస్తారు.

ఒకవేళ వీరు రెడ్ హేండెడ్ గా దొరికినా అస్సలు సిగ్గుపడరు. తిట్టినా చలించరు. ఛీ అన్నా వదిలిపోరు. కరోనా కన్నా కరోడాలు వీరు.

వీళ్ళ మూమెంట్స్ కనిపెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే దుష్ప్రచారలతో కేరెక్టర్ ఎసాసినేట్ చేసి మనుషులను హింస పెడుతూ ఉంటారు. వీళ్ళని దూరం ఉంచడం అన్ని వేళలా శ్రేయస్కరం.

మంచివాడైన శత్రువు కన్నా, చెడ్డవాడైన మిత్రుడు ఎప్పుడూ శ్రేయస్కరం. కొత్త వాడు మిత్రుడవుతాడు, తెలిసున్నవాడే మోసం చేస్తాడు.

కనుక తస్మాత్ జాగ్రత, జాగ్రత.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042