Tuesday 24 March 2020

సాధన

మనసు అసందిగ్ధంగా ఉన్నప్పుడు,
ఆలోచనా విధానం చిత్రంగా ఉంటుంది,

కాకి అరిచినా,
కుక్క వళ్ళు దులిపినా,
దేవుడి పటం నుంచి పూవురాలినా,
అనుకోకుండా గంట మ్రోగినా,
జలుబుతో తుమ్మినా,
పని విజయవంతం అవుతుందని,
అది విజయానికి సంకేతమని,
యాదృచ్ఛిక సంఘటనలకు
భవిష్యత్తును ముడిపెడతాం.

నిశ్చయాత్మక మైన రీతిలో,
సాధనా పూర్వక కృషిచేసినపుడు,
ఇలాంటి నమ్మకాలు కనిపించవు.
భవిష్యత్తు ఎవరికీ తెలియదు.
చేసిన కృషి,
సక్రమమైన పనితీరు
ముందస్తు సంకేతం ఇస్తూనే ఉంటాయ్.

మన పని తీరు
మనకే సందేహం కలిగిస్తే,
విజయావకాశాలు
దైవాధీనం అవుతాయి.
ఆసమయంలో
మనసు చెప్పే
విచిత్రమైన జాతకాలే,
ఇటువంటి ఊహలు.

చేసిన కృషి ఎప్పుడో తప్ప
అపజయాన్ని ఈయదు,
గమ్యం చేరేటపుడు,
ఒక్కొక్కసారి దారితప్పినట్టు
చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయి.
కృషిని నమ్మినవాడు
పొరపాటు దిద్దుకుని
విజయాన్ని పొందుతాడు.
యాదృచ్ఛిక విజయం
అప్పుడప్పుడూ వరిస్తుంది,
ఎప్పుడో తప్ప సాధ్యం కాదు.

సాధించే విజయం
మరో విజయానికి  స్ఫూర్తినిస్తుంది.
యాదృచ్ఛిక విజయం,
అంతటితో ఆగిపోతుంది.
అందుకే అది
అద్భుతంగా గుర్తుండి పోతుంది.
జరగనిది జరిగితే అద్భుతం,
గతంలో జరగనిది అపూర్వం.
అందుకే అద్భుతాలు వద్దు,
సాధనే ముద్దు.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042