Saturday 28 March 2020

దేనికోసం?

కావలసినంత ఏకాంతం,
అయినా అనిపిస్తోంది బ్రతుకు దుర్భరం.

కరచరణాలు కడగడం,
ముసుగుతో మొహం కప్పడం,
సోషల్ మీడియాలో గడపడం,
మొబైల్లో నే మాట్లాడటం,
ఎక్కడ చూసినా ఇదే!
అన్నిచోట్లా ఇదే!

అనుక్షణం ఉద్విగ్నం,
ఎలా మూడుతుందో అని ప్రారబ్ధం.
చాపకింద నీరులా ఉంది రోగం
తడి తెలిసే సరికి పోతోంది ప్రాణం.

అయిన వాళ్ళతో ఏకాంతం
కలిసొస్తే కొంత ఉపశమనం.
అనుకోకుండా ఉంటే దూరం,
ఎప్పుడు కలుస్తామా? అని ఆరాటం.
మొదట్లో బానే ఉంది గృహ నిర్బంధం,
రెండు రోజులకే మొత్తేస్తోంది మొహం.
అయినా తప్పదు ఏకాంత వాసం,
బతకడం కోసం ఇది ముఖ్యం.

గమనిస్తే ఒప్పుకుంటారు నిజం,
ఇంతలోనే ఎంతో తగ్గింది కాలుష్యం.
ప్రకృతి పొందుతోందేమో పూర్వ వైభోగం.

ఎప్పుడు లేనంత నీలంగా ఉంది ఆకాశం,
ఫాన్ గాలికే దొరుకుతోంది చల్లదనం,
ఆలోచిస్తే బోధపడుతుంది ఒక సత్యం,
అనుకోకుండా చేసే ఈ అజ్ఞాత వాసం,
ప్రకృతి తనను తాను సరిదిద్దుకునే క్రమం.

కొద్దికాలం ఓపిక పడితే,
పరిస్థితులు చక్కబడతాయి,
వానలు సరిగా కురుస్తాయి,
పృథివి చల్లబడుతుంది,
తుఫానులు తగ్గుతాయి,
సునామీలు ఉమశమిస్తాయి,
కనుమరుగయే జీవజాలం కనిపిస్తుంది,
సకాలంలో  పంటలు పండుతాయి.

కరోనా తగ్గినా
స్వచ్ఛంద గృహనిర్బంధం,
సాలుకో పక్షం,
అనుసరించిన పక్షం,
ప్రకృతి సాధిస్తుంది సమతౌల్యం.

దేశాల మధ్య వైషమ్యాలు
అపోహలు తొలగడం కోసమేనేమో?
ఈ ఉపద్రవం.
ప్రగతి వైపే సాగచ్చు
ఇకపై ప్రపంచ పయనం.

కోట్ల ఏసీలు పెట్టినా రాని చలి,
ఒక్కవానతో వస్తుంది,
కోట్ల యంత్రాలు తోడే జలం,
ఒక్క తుషారం తెస్తుంది.
ప్రకృతికి లోబడితే,
బ్రతుకు అభివృద్ధి వైపు సాగుతుంది.

ఎన్నో దేశాలు పిలుపునిచ్చినా
ఆగని కాలుష్యం,
కరోనాతో అయ్యింది సాధ్యం.
ఇది మానవాళికి కాగలదేమో వరం.

కష్టం తర్వాత వస్తుంది సుఖం,
స్వచ్ఛందం కావాలి ఇప్పుడు సహకారం,
కాదిది గృహనిర్బంధం 
ప్రజలే ఋత్వికులైన మహాయజ్ఞం.
స్వాగతించండి స్వచ్ఛంద నిర్బంధం,
అందుతుంది యజ్ఞఫలం.

ఎవరి కోసమని ఆలోచిస్తే
ఒప్పుకుంటాం ఒకనిజం.
ఇది మన కోసం,
మన పిల్లల కోసం,
భావి తరాలకోసం,
మనని పోషించే ప్రకృతి కోసం,
మనతో బ్రతికే సాటి మూగ జీవాల కోసం,
వెరసి అందరూ హాయిగా బ్రతకడం కోసం.

ప్రకృతిలో వస్తున్న మార్పు,
చూడాలని అనిపిస్తే మీకు,
మిద్దెనెక్కి చూడండి ఆకాశం,
ఎన్నడూ లేనంత అందంగా
అగుపిస్తోంది తారాలోకం.

ఆ కనిపించే మిణుకులు,
భవిత మీద కలాగిస్తాయి ఆశలు.

సర్వే జనాః సుఖినో భవన్తు.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042