Sunday 29 March 2020

సందేశం

ఓ కవిత వ్రాసి,
దానికో ట్యూన్ కట్టి,
గుండెనిండా గాలి పీల్చి,
పెట్టగలిగినంత గుక్కపెట్టి,
కవితా గానం చేయాలనుంది.

కరోనాతోనే కకావికలం అవుతూంటే,
కవితలతో అల్లకల్లోలం అవసరమా?
నీ వాల్ మీద పోస్టుకు లైక్స్ రాలేదని,
నువు రాసిన కవితకు కామెంట్స్ పెట్టలేదని,
నీ కవిత పత్రికలో అచ్చవ్వలేదని,
నిను ఏ సభలోనూ గుర్తించలేదని,
సమాజం మీద కక్ష కట్టడం అవసరమా?

ప్రధాని చెప్పారనో,
ప్రాణాలు నిలుపుకోవాలనో,
ప్రపంచం ఇలాగే ఉందనో,
ఇప్పుడిప్పుడే ప్రజలు
ఇంట్లో అలవాటు పడుతూంటే,
వరాలు పొందిన రాక్షసుడిలా,
పదవిలో ఉన్న నాయకుడి కొడుకులా,
కొట్టడానికి అలవాటు పడ్డ పోలీసులా,
శాడిస్టిక్ భావాలున్న బాసులా,
ఇప్పుడిది అవసరమా?
అంటూ సమాజం
వేడుకోలు చేస్తూంటే....

మనసు చంపుకుని,
గుండె దిటవు చేసుకుని,
నా ప్రయత్నం వెనక్కు తీసుకున్నా,
నాది త్యాగం,
దేశమంటే నాకు మోహం,
అందుకే దేశం నన్ను గుర్తించకపోయినా,
నేను దేశాన్ని గుర్తిస్తున్నా,
దేశం మనకే మిచ్చిందో కాదు,
దేశానికి మనమేమిచ్చాం?
అన్నది ముఖ్యం,
ఈ మాట మెచ్చే ప్రజలు,
నేనో కళాఖండాన్ని ఇవ్వజూస్తే,
నిరోధించే ప్రయత్నం చేయడం అన్యాయం,
కంగారు పడటం శోచనీయం.

అందుకే దేశం నీకేమిచ్చిందో కాదు,
దేశానికి నువ్వు ఏమి ఇవ్వలేదో
అనేదే ప్రధానం,
ఇది నా స్వానుభవం,
పై అనుభవంతో
ఇది నే జాతికిచ్చే  సందేశం.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042