Wednesday 4 March 2020

ఉత్సాహం

పనిని విభజించాలి,
మనుషులను కలుపుకు పోవాలి,
తొలి అడుగు త్వరగా వేయాలి,
తొలి పలకరింపు మనదే కావాలి,
భయపడి ఆగితే పని,
అహం కారంతో ఆగిపోతే పలకరింపు,
ముందుకు వెళ్ళనీయవు.
ఎడతెగని ఆలోచన,
ముడివడని బంధం,
ప్రతిబంధంకాలు అవుతాయి.

ఏ పని మొదలెట్టినా
ఆదిలో హంసపాదులు వస్తాయి,
ప్రయత్నం ఆపద్దు.
మనుషులన్నాక మాట తేడాలు వస్తాయి,
మాట కలపడం మానద్దు,
ముందు మాట మనమే కలిపితే,
మనః స్పర్థ  దూరం అవుతుంది,
శ్రమతో  పనులు,
కలయిక వల్ల స్నేహాలు
సఫలం అవుతాయి.

పెద్దలు అంటూ ఉంటారు,
పనంటూ మొదలెడితే
ముగింపు అదే వస్తుంది,
మాటంటూ కలిపితే
బంధం అదే బలపడుతుందని.

పనంటే ప్రణాళికా రచనలో
కాలం గడపటం కాదు,
సరైన కాలంలో
సరైన నిర్ణయం తీసుకోవడం.

నిర్ణయం తీసుకోవాలంటే
ఆలోచనలు  తెగాలి,
ఆలోచన తెగితే నిశ్చయం వస్తుంది,
నిశ్చయం సంకల్పంగా మారుతుంది
అదే నిర్దిష్ట పనికి దిక్సూచి అవుతుంది.
గమ్యం వైపు నడిపించే శక్తి నిస్తుంది,
చైతన్యానికి నాంది పలుకుతుంది.

తొలి అడుగు మనం వేస్తే,
అనుసరించేవారు, భుజంతట్టి ,
మన ప్రయాణంలో కలుస్తూనే ఉంటారు.
వ్యష్టిగా చేసే ప్రయత్నం,
సమిష్టిగా మారుతుంది.
కలయికలోనే సినర్జీ సాధ్యం అవుతుంది,
విజయం అలవోకగా వస్తుంది.

బంధం బలపడాలంటే,
కొన్ని పనులు చేయాలట

సరసమైన సంభాషణ చేయాలి,
సామరస్య ధోరణి ప్రదర్శించాలి,
సరదాగా విందుకు పిలవాలి,
ఎదుటి వారు పిలిస్తే వెళ్ళాలి,
మాట సాయం చెయ్యాలి,
వ్యక్తి సాయం తీసుకోవాలి,
అవసరం అయితే సలహా కోరాలి,
మంచి సలహా తోస్తే చెప్పాలి.
పనులు చేసి పెట్టాలి,
పని ఉన్నప్పుడు,
మొహమాటం వీడి సాయం కోరాలి,
సాయం అడిగేటప్పుడు లౌక్యం వద్దు, అభ్యర్థన ఆత్మను తట్టిలేపుతుంది.
ఎదుటి వ్యక్తి గుణాన్ని గుర్తిస్తే,
మన పట్ల వారికీ గౌరవం పెరుగుతుంది,
చేసిన సాయం మరవకుంటే,
తిరిగి సాయం చేసేటపుడు
దోషాలు ఎంచడం జరగదు.
అలా ప్రవర్తిస్తే మనిషి,
ఎన్నటికీ ఒంటరి కాడు.

కడుపున పుట్టిన పిల్లలే
రెక్కలొస్తే చుట్టపు చూపుకొస్తారు,
బాధ్యతలు నెత్తికొస్తే బంధువుల
కలయిక అతికొద్ది సార్లే సిద్ధిస్తుంది.
మనుషులు కలవటం
మొక్కుబడికి కాదు,
గడచిన మధుర జ్ఞాపకాలు
నెమరు వేసుకోవడానికి,
దానివల్ల ఉత్సాహం వస్తుంది.
ఉత్సాహం  జీవితాన్ని
నవ నవోన్మేషం చేస్తుంది.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042