Tuesday 3 March 2020

సంస్కరించబడ్డ ఆలోచనలే సాంప్రదాయాలు.

గాలి, ధూళి, దెయ్యం పట్టడం,
దిష్టి, బాణామతి, ఆత్మలు మాట్లాడటం,
ఎవరో ఆవహించి పూనకం రావటం,
ఇరవై ఒకటో శతాబ్దంలో
ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి,
మనిషిని భయపెడుతూనే ఉన్నాయి,
ఎక్కడుంది లోపం?

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్,
పేరానాయిడ్ స్కిజోఫ్రెనియాలు,
ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ లు,
డిప్రెసివ్ డిజార్డులు,
జీవితాలను ఛిద్రం చేస్తునే ఉన్నాయ్
ఎందుకు జరుగుతోంది ఇలా?

భూతవైద్యులు ఒకవైపు,
మానసిక వైద్యులు వేరొకవైపు,
తెలియని శత్రువు తో
పోరాటం చేస్తూనే ఉన్నారు.
దెయ్యం వదలగొట్టడానికి ఒకరు,
చిత్త ప్రవృత్తిలో మార్పు తెచ్చేందుకు ఒకరు,
ఎంతమంది ప్రయత్నించినా
సమస్యలు పునరావృత్తం అవుతున్నాయ్.
ఎక్కడ దొరుకుతుంది సమాధానం?

వైరాగ్య ప్రవచనాలు
వీరవిహారం చేస్తున్నాయ్,
ఆత్మ విచార ప్రబోధాలు
అంబరాన్ని తాకుతున్నాయి,
ప్రతీ మతస్తుల్లోనూ ఇదే ధోరణి,
అయినా బాహ్య విషయాలపై వాంఛ,
ఆత్మ సౌందర్యం పై ఆపేక్ష  కలగటం లేదు,
ఎవరికీ, ఎక్కడా!
లోపం ఎక్కడుంది?

మతం అంటే నమ్మకం,
నమ్మకమైన పని ఆచారం,
తరాలు గడిస్తే అదే సాంప్రదాయం,
కాలంతో ప్రకృతి మారుతుంది,
మనిషే మారటంలేదు,
కాలం చెల్లిన ఆలోచనలే
సాంప్రదాయం అనుకుంటే,
వాస్తవదూరమైన ధోరణులు,
నమ్మకాన్ని సడలిస్తుంటే
సత్యాన్ని శోధించి,
మార్పును ఆహ్వానించకుంటే,
ధ్యేయం లేని చైతన్యం
మనిషిని పిచ్చివాడిగా చేస్తోంది.

మనసులో ఉన్నది
బహిర్గతం చేయలేకపోవటం,
గోడమీద పిల్లిలా
అవకాశం వాదంతో ప్రవర్తించడం,
లోపల ఒకలా,
బయటికి ఇంకొకలా,
నటిస్తూనే ఉన్నారు మనుషులు.

మూస ధోరణికి అలవాటు పడటం,
సమగ్ర ఎదుగుదల లేకపోవటం,
తార్కిక దృష్టి లోపించడం,
సమస్యకు మూల కారణం అవుతోంది.

సత్యం దర్శించలేనివాడికి
చాదస్తం మాత్రమే చేత చిక్కుతోంది.
‌సిద్ధాంత దోషాలవల్ల
ప్రయత్న లోపాలు పెరుగుతున్నాయ్.
భయాందోళనలు పేరుకు పోతున్నాయ్.
నటించే మనుషుల మధ్య
నమ్మకం చచ్చిపోతోంది
అయోమయం పెరిగి,
గందరగోళం మిన్నంటుతోంది.
అదే మనిషిలో
విపరీత ప్రవర్తనకు కారణం అవుతోంది.

అసూయ పడటం చేతబడి,
ద్వేషం భావమే దెయ్యం పట్టడం,
ఈర్ష్యతో కూడిన దృక్కులే దిష్టి,
అయోమయ స్థితే పూనకం.
తనమీద తనకు నమ్మకం లేకపోవటమే,
వీటికి మూలం.

సమర్థుడికి ఇలాంటి జాడ్జ్యాలుండవ్,
చేతకానివాడే పక్కవాడ్ని చూసి ఏడుస్తాడు,
ఎవరి ఏడుపు ఎలా ఉన్నా,
ఎవరి సామర్ధ్యం వారు గుర్తిస్తే,
చేసే పనినే తపస్సుగా భావిస్తే,
ఎవరిని చూసీ ఏడవం,
ఎవడో ఏదో చేశాడని వాపోం,

మనసు ఆరోగ్యంగా ఉండాలంటే
మనని మనం నమ్మాలి,
మనలోని మంచి మార్పుకు
మనమే కారణం కావాలి.

సాంప్రదాయం అంటే
సంస్కరించబడిన ఆలోచన,
ఎవరో చెప్పారని చేసే
మూఢనమ్మకం కాదు.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732942