Wednesday 15 April 2020

జై భారత్!

మూడు సప్తాహాలు చేశాం,
ఈ రోజు నిర్ణయంతో
అది మండల దీక్షయ్యింది.
చెడ్డీలు, లుంగీలు,
మేక్సీలు, నైటీలు
దీక్షా వస్త్రాలవుతున్నాయి.
దీక్షలో క్షవరం నిషిద్ధం.
అందుకే!
గెడ్డం గీసినా,
జుట్టు జులపం అవుతోంది.
ఇప్పటి దాకా తిన్నదానికి
ఒళ్ళు బరువు పెరిగి,
తిండి మీద ఇష్టం విరుగుతోంది.
అందరూ మితాహారం,
భూశయనం వైపు మళ్ళుతున్నారు
వేసవి కదా!
తేలిగ్గా, చల్లగా ఉంటుందని.
చూడబోతే దీక్ష
కుదిరేటట్టే ఉంది.

భక్తి దీక్షలో భజనలు,
కరోనా దీక్షలో కర సేవ
ఉంటాయి కాబోలు,
ప్రతీ ఇంట్లో
ఒరుగులు, వడియాలు,
పచ్చళ్ళు, ఊరుమిరపలు,
అన్నీ పెట్టేశారు.

సంవత్సరాంతం వరకు
బియ్యం, పప్పుచారు చాలు,
కరసేవ మహిమ ఏడాదుంటుంది.
ఇంట్లో ఉన్నా ఎవరూ ఖాళీగాలేరు.
లాక్ డౌన్ ఎత్తేస్తే
ఎన్నిగంటల పనికైనా సిద్ధం.
వీళ్ళ తత్వం ఏంటో తెలియదు.

ఇండియన్స్ లో గొప్పతనం ఇదే,
నిర్బంధంలో కూడా,
సందర్భం వెదుకుతారు.
అవకాశం తీసుకుంటారు.
గాల్లోంచి కూడా సంపద సృష్టిస్తారు
దొరికిన దానితోనే తృప్తిపడతారు.

ఉన్నదాంట్లో పెట్టి పుణ్యాన్ని కూడా
వెనకేసే ప్రయత్నం చేస్తారు.
కరువులో అయినా కారుణ్యం
చూపిస్తూనే ఉంటారు.

భిన్నమైన ఆలోచనలు,
విభిన్నమైన సాంప్రదాయాలు,
కష్టం వస్తే అందరూ ఒకటే.
ఎవరి గోల వారిదన్న
ధోరణికి స్వస్తి చెబుతారు.
క్రమశిక్షణ అటకమీంచి తీస్తారు.
ఏడవాల్సిన రోజుల్లో కూడా,
నవ్వుతూనే ఉంటారు.
వీళ్ళపని ఖతం అన్నవాళ్ళే
ప్రమాదాగ్నిలో హుతం అవుతూంటే,
కుబేరుడికైనా  దానం ఇస్తారు.
వీళ్ళు ఎవరికి అర్థం కారు,
వీళ్ళ ఎకానమీ ఎవరి ఊహకు అందదు,
వీళ్ళు వీళ్ళే, ప్రపంచానికి ఎనిగ్మాలు,
భావి ప్రపంచపు విశ్వామిత్రులు.

వీళ్ళ ధైర్యం చూసి ప్రపంచం 
పత్తికాయలా కళ్ళేసుకు చూస్తూంటే,
ముక్కున వేళ్ళేసుకోవద్దని
వీళ్ళే అంటున్నారు
ముక్కు, కళ్ళూ ముడితే,
కరోనాతో మూడుతుందట!
వీళ్ళ జాగ్రత్త బంగారం కాను,
ఇప్పుడు కూడా ప్రపంచానికి
వీళ్ళే సాయం చేస్తున్నారు,
ఏమిటి మేజిక్ అంటే
అందరిదీ ఒకటే మాట,
ఇది ఇండియా గురు!
హమారా భారత్ మహాన్.

జైహింద్! జై భారత్!

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042