Wednesday 1 April 2020

ప్రతిఘటిద్దాం

ప్రార్థన వల్ల ప్రభవించేది భక్తి,
విశ్వాసం నుంచి ఉద్భవించేది శక్తి,
తపస్సు వల్ల దొరికేది ముక్తి,
కృషి వల్ల దొరికేది భుక్తి.
ఇవన్నీ సాధించడానికి కావాలి యుక్తి.

విశ్వాసం ఉద్భవించేది,
నమ్మకం కలిగించేది,
ముక్తి కలిగేది,
భుక్తి దొరికేది
సాధన వల్లే.

సాధన అంటే క్రమశిక్షణ,
తనువు, మనసు
ఒక్కతాటిపై నిలిపే ప్రక్రియ.
దానికో ధ్యేయం ఉంటుంది,
ఆచరణలో కష్టం ఉంటుంది
ఆటంకాల దాడి ఉంటుంది,
మొక్కవోని దీక్షే,
సాధన ఫలించడానికి,
కారణం అవుతుంది.

మండల దీక్షలు చేస్తున్నాం,
విధివిధానాలు పాటిస్తున్నాం
ఏక భుక్తం,
భూ శయనం,
మిత నిద్ర
సమయపాలన అన్నీ!
తు.చ తప్పక పాటిస్తున్నాం,
ఎందుకు?
కోరిన కోరిక తీరాలనో,
ఆరోగ్యం బాగుపడాలనో,
మనసు ప్రశాంతంగా ఉండాలో,
అయిన వారికి మంచిజరగాలనో!
ఏదో ఒకటి,
కారణాలు అనేకం.
ఇవన్నీ సఖమయ జీవితం కోసం.

సుఖం కోరే మనిషి,
అది దొరికేది బ్రతికితేనే,
అని మరిచిపోతే ఎలా?
జీవితాన్ని నిలిపే దీక్ష
తీసుకోవడం ఇపుడు ముఖ్యం.
బ్రతుకే లేనప్పుడు,
జీవితంలో ఆనందం ఎక్కడ?

ఆత్మహత్య పాపం,
అనేగా సర్వమత సారం.
బ్రతుకు కడతేర్చే
రోగం స్వైర విహారం చెస్తుంటే,
జాగ్రత్త పాటించక పోవడం,
ఆత్మహత్యా సదృశం,
పరహత్యా పాతకం కాదా?
ఈ నిర్లక్ష్యం ఏ దేవుడు సహిస్తాడు?
ఏ మతం సమర్థిస్తుంది?

ముందు బ్రతుకు దీక్ష బూనండి,
ఇంటికే పరిమితం అవ్వండి,
బ్రతుకు నిలబడితే,
ప్రార్థనకు అవకాశం ఉంటుంది,
ప్రార్థన వల్ల భక్తి కుదురుతుంది,
భక్తి నమ్మకాన్ని పెంచుతుంది
నమ్మకమే విశ్వాసం అవుతుంది,
విశ్వాసం శక్తినిస్తుంది,
శక్తి సాధనకు మూలం అవుతుంది,
సాధన వల్ల తపస్సు సిద్ధిస్తుంది,
దానివల్ల ముక్తి కలుగుతుంది.
ఇహ పరాలు బాగుండాలంటే,
దేవుడిచ్చిన జీవితం
పరిపూర్ణంగా బ్రతకడం ముఖ్యం.

బ్రతకడం బ్రతికించడం
మన చేతుల్లో పెట్టాడు దేవుడు,
చేయగలిగింది చేసి
ఆయన కృపకు పాత్రులమవుదాం.

ఇంటిలోనే ఉందాం,
కరోనాని ప్రతిఘటిద్ధాం.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042