Friday 3 April 2020

శ్రీరాముడి స్వగతం

శ్రీరామ నవమి నా పెళ్ళిరోజు.‌ సీతను వివాహం చేసుకున్న రోజు. నాతో పాటే నా సోదరులకు ఈ రోజే పెళ్ళయ్యింది. 

విశ్వామిత్ర గురుదేవులతో యజ్ఞ రక్షణకు వెళ్ళామో? లేక బల, అబల మంత్రాలతో పాటు వివిధ విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళామో? నాకు కానీ లక్ష్మణునికి గానీ అంతుబట్టడం లేదు.

గురువుగారికి కోపం ఎక్కువ? జాగ్రత్త అని, నాన్నగారు ఇంటినుంచి బయలుదేరే ముందు చెప్పారు.  ఇన్నిరోజుల వారి సాంగత్యంలో ప్రేమాభిమానాలే కాని లేశమంత విసుగు కూడా మాకు కనబడలేదు.

నాకు బాగా గుర్తు, ఇంటినుంచి బయలుదేరిన మొదటిరోజు బాగా అలసిపోవడం వల్ల, లేవటం కొంచెం ఆలస్యం అయ్యింది. అప్పటికే బ్రాహ్మీ ముహూర్తంలో వారు లేచి, అనుష్టానం లో ఉన్నారు. 

తూరుపు కొండల్లో మా వంశానికి మూలపురుషులు అయిన సూర్యదేవులు తమ అరుణారుణ కాంతులతో దర్శనం ఇస్తున్నారు.  గురుదేవులు లేచినా ఇంకా నిద్రలేవని మామీద, గురువు గారికి ఎక్కడ కోపం వస్తుందో?  అని భావించి ఉంటారు. అందుకే తమ అరుణిమ దాల్చిన కరాలతో నులివెచ్చగా  మమ్మల్ని స్పృశించి తట్టి లేపే ప్రయత్నం చేశారు.

అది చూసిన గురుదేవులు చిరునవ్వుతో ఆదిదేవులకు నమస్కరించి, మార్దవమైన స్వరంతో "కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే....అంటూ కర్తవ్యబోధ చేస్తూనే ఆప్యాయంగా నిద్రలేపారు.

ఎంత మార్దవం? ఎంతటి ప్రేమ ఉంది వారి స్వరంలో!  ఇప్పటికీ తొలిసంధ్య చూడగానే వారి సున్నితమైన హెచ్చరిక నాకు దిశా నిర్దేశం చేస్తుంది. వారి గొంతులోని అనురాగం నా మనో శ్రోత్రాలకు  ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.  అందుకే ఆ శ్లోకం సుప్రభాత సమయాన ఇప్పటికీ స్మరిస్తూ నే ఉంటాను. 

వారు పూర్వాశ్రమంలో  చక్రవర్తులైనా అన్నింటినీ త్యజించి, వానప్రస్థాన్ని స్వీకరించారు. శమదమాదులతో నిరంతర సాధనతో బ్రహ్మర్షి అయ్యారు.  అందరూ భావించినట్టు వారికి కోపం లేదు‌. బ్రహ్మ జ్ఞానం పొందిన పెద్దలు అందరినీ సమ భావంతో చూస్తారు. వారికి వ్యక్తులపై కోపం లేదు. వ్యక్తుల్లోని ప్రలోభాలు, రాక్షసత్వం, స్వార్థం, సంకుచిత స్వభావం, క్రమశిక్షణా రాహిత్యం వీటిమీదే పోరాటం.

సమర్ధులైన గురువులు అంతేవాసులను తీర్చిదిద్దే క్రమంలో అజ్ఞానాన్ని దూరం చేసే ప్రక్రియ కఠినంగా ఉన్నంత మాత్రాన, అది కోపం అనుకుంటే ఎలా? కాల్చనిదే ఇనుము వంగదు. అంతకన్న దృఢమైన అజ్ఞానం ఎలా పోతుంది?

చంచలమైన మనస్సుతో,  అజ్ఞానంతో పుట్టే మనుషులకు, సరైన దోవ చూపించే క్రమంలో గురువులు దండన విధిస్తారు, హెచ్చరికలు చేస్తారు. అది బాధ్యత.

దానిలో శిష్యుని భవిత బాగుండాలనే తాపత్రయమే ఉంటుంది. అదే ప్రేమ మా గురువు గారిలో కనిపిస్తుంది.
 
అమేయ పరాక్రమవంతులైన గురువుగారు, రాక్షస సంహారం చేయలేకనా?  అల్పుడనైన నన్ను పంపమని అడిగింది. 

వారు సర్వ సమర్ధులు, అన్నీ చేయగలిగీ మాకు ఆ పని అప్పగించడానికి ఓ కారణం ఉందట. మా కుల గురువులైన వశిష్టుల వారు చెప్పారు. 

వారు ఏం చెప్పారో చెప్పే ముందు, వశిష్ఠుల వారి గురించి చెప్పాలి.  వారి గురించి చెప్పాలంటే, బహుశా! నా జీవితం సరిపోదేమో?

చిన్నతనంలో మేము అంతఃపురంలో ఉన్న సమయంకన్నా వశిష్టుల వారి సమక్షంలో గడిపిందే ఎక్కువ.

చిన్నతనంలో విద్యాభ్యాసం చేసేటపుడు విద్య మీద కన్నా, మనసు ఆటపాటలమీద ఉంటుంది. వారు చెప్పేది ఒక్కొక్కసారి పరాకులో పట్టించుకోకుండా తమ్ముళ్ళు నేనూ, చంచలత్వంతో ఆడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం. నాన్నగారికి మామీద ఉన్న ప్రేమ వల్ల మాకు గారం ఎక్కువ. ఆ కారణంగా చిన్న చిన్న అల్లరి పనులు చేసినా, గురువుగారు విద్య నేర్పేవేళ తెలిసీ తెలియనితనంతో చొప్పదంటు ప్రశ్నలు వేసినా  నవ్వుతూ మా ప్రశ్నలకు  సమాధానం చెబుతూనే మాకు విద్య నేర్పారు.

చిన్నతనంలో మనకు ఏమీ తెలియదు. బరువు బాధ్యతలు పట్టవు. భవిష్యత్తు కోసం విద్య అవసరం అనే స్పృహ ఉండదు. అటువంటి మానసిక పరిస్థితిలో ఉన్న చిరుప్రాయంలో విద్యాబోధ చేయటం చాలా కష్టం. కానీ ఏనాడూ మా మీద వశిష్ట గురుదేవులు విసుగు తెచ్చుకోలేదు. మా లక్ష్మయ్యకు కోపం ఎక్కువ. అయినా భరించే వారు.  క్లిష్టమైన చదువులు కూడా కదళీపాకం చేసి సులువుగా చెప్పేవారు. వారితో ఉంటే మా అమ్మా, నాన్నలతో, పిన్నులతో గడిపినట్టు ఉండేది. అందుకే మాకు ఏ విద్య నేర్వటం కష్టం అనిపించలేదు.

అలా ఆడుతూ పాడుతూ విద్య నేర్చుకునే సమయంలో, విశ్వామిత్ర గురుదేవులు మా రాజ్యానికి విచ్చేసిన వార్త మాకు చేరింది.

ఆ సమయంలో  నేనూ తమ్ముళ్ళు వశిష్టులవారి పర్యవేక్షణలో నేర్చిన విద్యల్లో నిర్వహించే వివిధరకాలైన చివరి పరీక్షలు పూర్తిచేసి విశ్రమిస్తున్నాం. వీటిలో ఉత్తిర్ణులమైతే మా విద్య అయోధ్యా నగరంలో ఏర్పాటు చేసే ఉత్సవంలో ప్రదర్శించబడుతుంది.   వశిష్ఠ దేవులు ఆ రోజు మా ప్రదర్శన చూసి చాలా సంతోషంలో ఉన్నారు.

విశ్వామిత్రుల వారు వచ్చారన్న వార్త వినగానే, వారు ఒక ముహూర్త కాలం కనులు మూసి జరగబోయేది గ్రహించారు.

కనులు తెరిచే సమయానికి వారి కన్నుల్లో సన్నటి నీటి పొర కనిపించింది. అప్పుడు ఆ కన్నీరు ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తోంది. మేము వారిని విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైందనే విషయం వారికి స్ఫురించి ఉంటుందేమో! కానీ ఆ  క్షణంలో వారు అదేదీ మాకు చెప్పలేదు.

నన్నూ, లక్ష్మణుని దగ్గరకు తీసుకొని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. వారి దివ్య పరిష్వంగంలో ఒక అలౌకికమైన అనుభూతి కలిగింది. అమ్మ గోరుముద్ద పెట్టినట్టు, నాన్నగారు ముద్దు చేసినట్టు, సుమిత్ర పిన్ని ఆప్యాయంగా హత్తుకున్నట్టు, కైక పిన్ని గారాబం చేసినట్టు. 

దివ్యదర్శులైన గురుదేవులు ఆలింగనం చేసుకున్న తరువాత నాతో ఇలా అన్నారు.

"నాయనా రామభద్రా"! నేర్చిన విద్య అనుభవంలోకి వచ్చే తొలిదశలో నైపుణ్యం తక్కువగా ఉంటుంది.  నైపుణ్యం తక్కువయినపుడు పొరపాట్లు దొర్లుతాయి. ఆ పొరపాటు ఎక్కడ చేసినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.  కానీ యుద్ధ‌విద్యలో పొరపాటు జరిగితే జీవితం ఛిద్రమవుతుంది.

మహా పరాక్రమ వంతుడైన నీ తండ్రి ఛాయలో నీవున్నంత కాలం, ఆయనకు నీమీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వల్ల యుద్ధం చేసే‌అవకాశం నీకు రాదు. ఆ మోహావేశం నుంచి నిన్ను బయటకు లాగేందుకు ఒక అవకాశం రాబోతోంది.

విశ్వామిత్ర మహర్షి అన్ని విద్యలు తెలిసిన జ్ఞాని వారిననుసరించు.

తమ్ముడు లక్ష్మణుడు కాస్త కోపధారి. నీవంటే అవ్యాజమైన ప్రేమ కలవాడు. అతనిని జాగ్రత్తగా చూసుకో! 

వారి మాటల్లో వారిని విడిచి వెడతామనే విషయం చూచాయగా తెలుస్తోంది. నాకూ మనసు మసకేసినట్టయ్యింది.

తెలియని భావావేశం మనసులో గుబులు కలిగిస్తూంటే, వారి పాదపద్మాలకు నమస్కరించా.

వారి పాదాలను స్పృశించినపుడు, నా కళ్ళు నా మాట వినలేదు.

తమ్ముళ్ళతో సహా విశ్వామిత్ర మహర్షి సందర్శనార్థం వెళ్ళాం. 

మేము అక్కడికి చేరేసరికే నాన్నగారి కళ్ళు జలపాతాల్లా ఉన్నాయ్. కళ్ళు ఎర్రబడ్డాయి.

వారిని ఆ స్థితిలో చూసిన లక్ష్మయ్యకు ఆవేశం వచ్చింది. ప్రక్కనే ఉన్న నేను అది గమనించాను.  ఎవరూ చూడకుండా వాడి చేయినొక్కి వారించా. నాతోపాటు విశ్వామిత్రులకు నమస్కరించమని సైగ చేశా.

విశ్వామిత్ర మహర్షి మా వందనం స్వీకరించి, ఆశీర్వదిస్తూనే, నాన్నగారి వైపు చూశారు.

ఇక, తప్పదన్నట్టు, కూడుకుని, కూడుకుని మాట్లాడుతూ, "నాన్న, పెద్దాడా! నువ్వు మహర్షులు వారితో యజ్ఞ రక్షణార్ధం బయలుదేరాలి",  అన్నారు.

నాన్న మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పని నేను సరే అన్నా.

అన్నయ్య వెడితే నేనొక్కడినీ ఇక్కడ ఉండలేను, నేనూ వెడతా! అన్నాడు మా లచ్చన్న.

ఆ మాట విని, నాన్న మరింత గాభరా పడ్డారు. అమ్మకి, కైక పిన్నికి నోటి మాట లేదు.

సుమిత్ర పిన్ని ఒక్కతే! హసాదు! లక్ష్మణా అంది. అక్కడ సూది పడితే వినబడేంత నిశ్శబ్దం.

జరిగేదంతా మౌనంగా పరికిస్తూన్న విశ్వామిత్రుల వారు, ఇహ రండి అన్నట్టు, మమ్మల్ని చూసి తల ఆడించారు.

జరుగుతున్నది చూస్తూ, అమ్మ దుఃఖాన్ని దిగమింగుకొని సభామర్యాద పాటిస్తోంది.

సుమిత్ర పిన్ని ఎప్పటి లాగానే,  లోపల కలిగే భావావేశం పైకి కనబడనీయటంలేదు.

కైక పిన్ని ఒక్కతే భోరున విలపించింది.

భరత, శత్రుఘ్నులు కూడా లక్ష్మణుడి వెనకే సిద్ధమయ్యారు. 

నాన్న పరిస్థితి వర్ణనాతీతం. ఆయన ఆర్తిగా వారిని దగ్గరకు తీసుకొని, మీరూ నన్ను విడిచి వెళ్ళిపోతారా? అంటూ బేలగా అడిగారు.

నాన్న గారి స్థితి నాకు అర్థం కావటం వల్ల, వారిని వద్దని వారించి, మేమిద్దరమే విశ్వామిత్ర గురుదేవులను అనుసరించాం.

వారితో వెళ్ళామన్న మాటే గానీ, నిజం చెప్పాలంటే, వారికి మేం చేసిన దానికన్నా, వారు మాకు చేసిన మహోపకారమే ఎక్కువ. 

మాకు రాని ఎన్నో  శస్త్రాస్త్ర విద్యలు, మహా మంత్రాలు ఉపదేశించారు. దగ్గరుండి రాక్షస వధ చేయించారు. ఎన్నో ధర్మ సూక్ష్మాలు, యుద్ధంలో మెళుకువలు బోధించారు.

మాట కరుకునే గాని మనసు నవనీతమైన గాయత్రీమంత్ర సృష్టికర్తలు మా గురుదేవులు.

విజ్ఞుల మాట వింటే కళ్యాణప్రదం అవుతుందంటారు.  నాకు, తమ్ముడికీ జీవితం కళ్యాణప్రద మవ్వటమే కాదు,  కళ్యాణం కూడా అయ్యింది.  నాన్నకి బంగారం లాంటి కోడళ్ళు దొరికారు. 

అసలు మిథిలా నగరానికి మేము రావడానికి కారణం, పరమేశ్వర చాపాన్ని నేను  విరవడానికి కారణం వారి చలవే. మా గురు భక్తి వల్లే పరమేశ్వర చాపం నాకు వశమయ్యింది. ఇందులో నా గొప్పదనం ఏదీ లేదు. 

ముందునుంచి నేను నల్లగా ఉండటం వల్ల కైక పిన్ని అంటూ ఉండేది.  వీడికి తెల్లటి పిల్లని, చక్కని చుక్కని నేనే వెదికి తెస్తానని.

పెద్దలముందు, గురువులు ముందు కాబోయే భార్యని తలెత్తి చూడటం బాగుండదని క్రీగంట చూశా. పిల్ల బావుంది.  పేరు సీతట. నేను మైథిలి అని పిలుస్తా.  ముద్దు పేరుకూడా పెట్టేసుకున్నా. ఇక కైక పిన్నికి సంబరమే సంబరం.

ప్రతి సంవత్సరం  శ్రీరామ నవమి, భద్రాద్రిలో, ఒంటిమిట్టలో, దేశం నలుచెరగులా అంగరంగ వైభవంగా చేయటం అలవాటైన మీరు ఈసారి ఇళ్ళకే పరిమితమైనందుకు బాధ పడకండి. 

మీ మనసులోనే నే ఉన్నా. నా అనుభవం చెప్పిన మాట మీతో పంచుకోవాలని నా మనసులో భావాలు చెప్పా.

నా మాటల సారం, అర్థం అయ్యిందిగా, పెద్దలు చెప్పేమాట కళ్యాణప్రదం అవుతుంది. కళ్యాణం కూడా అవుతుంది. కాబట్టి  మీరు కూడా మీ పెద్దలు చెప్పే మాట వినండి.

ప్రతి సంవత్సరం మీరు వేసే పందిళ్ళలోకి నన్ను తెచ్చేవారు. కానీ ఈ సారి నేనే ప్రపంచం నలుమూలలా వైద్య బృందం రూపంలో, రక్షకభటుల రూపంలో, పారిశుద్ధ్య సిబ్బంది రూపంలో, ఆహారం అందించే రైతున్న రూపంలో, నిత్య సేవలందించే ప్రభుత్వం యంత్రాంగం రూపంలో మీకు  ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నా. మీకు మంచి చేయడమే నాకు ఆనందం.

త్రేతాయుగంలో రాముడినై రావణసంహారం చేశా.  ఈ యుగంలో వీరి రూపంలో కరోనాను అంతమొందిస్తా.

మీరు మాత్రం నాలానే పెద్దల మాట వినండి. అదే కళ్యాణ ప్రదమైన జీవితానికి మార్గదర్శనం అవుతుంది.

మీకు వివాహం ఇంకా కాకుంటే కళ్యాణం అవుతుంది. ఒకవేళ ఇప్పటికే అయితే,  నాలానే ప్రతీ సంవత్సరం మీ భార్యతో మీకే పెళ్ళవుతుంది. ఎందుకంటే, రాముడు ఏక పత్నీ వ్రతుడు.

మీరు తేడాగా ఆలోచిస్తే మీ ఆవిడ చేతిలో ఇప్పుడే మీకు పెళ్ళవుతుంది. కలియుగంలో సీతకే సాధికారత. అర్థం అయ్యిందా.

సర్వేజనాః సుఖినో భవంతు.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042