Saturday 11 April 2020

ప్రకృతి ధర్మం

సెలవులు దొరికిన తొలి రోజుల్లో,
కుటుంబాలతో గడిపేశారు,
నచ్చిన వన్నీ నమిలేశారు,
ఇంటిని చక్కగ సర్దేశారు,
వచ్చిన పాటలు పాడేశారు
ఆనందాన్ని పొందేశారు.

బయటకు పోయే తీరేలేదు,
ఇంట్లో వుంటే హేపీలేదు.
రొటీను లైఫుకు అంతం లేదు,
చావు వార్తలో వింతేలేదు.

మనిషి మనిషికి తగలట్లేదు
సబ్బులు ఏమీ మిగలట్లేదు
మూతికి మాస్కులు వదలట్లేదు
బాహాటంగా తిరగట్లేదు

రోగం దూరం కావట్లేదు
స్పష్టత ఏమీ రావట్లేదు.
ఏం చేయాలో తోచట్లేదు,
చీకట్లేమీ తొలగట్లేదు.

సాయంకోసం గొంతుక విచ్చి,
ప్రపంచమంతా చేతులు చాచి,
దేహీ దేహీ అంటూ వుంటే
సాయం చేసే దిక్కెక్కడిది?

దేవుని గుడికే తాళం పడితే,
మూలవిరాట్టే బందీ అయితే,
ఎవరిని సాయం కోరాలో? యని
ప్రపంచమంతా చూస్తూ ఉంది.

పసరూ, మూలిక, ఆయుర్వేదం,
అల్లోపతి మరి యునాని వైద్యం,
కరోన బూచిని చంపట్లేదు,
కొత్త మందులు రావట్లేదు.

ఇంకా జ్ఞానం కలగట్లేదా?
ప్రకృతి తీర్పూ తెలియట్లేదా?
ప్రకృతి ఒడిలో పెరిగే మనమూ,
దాని న్యాయము పాటించాలి.

చిన్నతనంలో చూచిన పిచికలు,
తిరిగి ముందరకు వస్తున్నాయి,
వాతావరణం శుభ్రం అయ్యి,
ప్రకృతి శక్తిని పొందుతు ఉంది.

చేసిన దానికి జైలుశిక్ష ఇది,
ఔదల దాల్చి శిక్షా కాలం,
ఓరిమి కలిగి అనుభవించవోయ్!

క్రమశిక్షణతో మనము మెలిగితే
శిక్షా కాలం తగ్గే వీలు,
ప్రకృతి మనకు ఈయగ వచ్చు.

చేసిన తప్పులు మళ్ళీ చేయక,
ప్రకృతి ధర్మం పాటించేద్దాం,
భూకాలుష్యం తగ్గించేద్దాం.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042