Tuesday 21 April 2020

చైతన్య స్ఫూర్తి ప్రదాతలు

ఆలోచనల్లో...
బరువు కలిగినవి కొన్ని,
తేలికయినవి కొన్ని.
తేలికపరచేవి కొన్ని,
తేలిపోయేట్టు చేసేవి కొన్ని.
స్ఫూర్తినిచ్చేవి కొన్ని,
ఆశ చిగురింపజేసేవి కొన్ని.
వీటి తీరుతెన్నులను బట్టే,
మనసు నర్తిస్తుంది,
బుద్ధి పనిచేస్తుంది,
జీవితం నడుస్తుంది.

ఆలోచన ఊహకే పరిమితం కాక,
ఆచరణలో పెట్టినపుడు
వాస్తవంలో ఫలితాలు కనిపిస్తాయి.
ఎడతెగని ఆలోచన- నిరాశకు
ఆచరణలో పెట్టే ఆలోచన- ఆశకు,
ఊపిరిలు పోస్తూ ఉంటుంది.

జీవితం అంటే,
ఆలోచనల పరంపర కాదు,
నిర్ణయాల సమాహారం.
ఏమి ఆలోచించినా-
నిర్ణయం తీసుకుంటేనే,
కార్యరూపం దాలుస్తుంది.

ఏం సాధించాం? అని
వెనక్కి తిరిగి చూసుకుంటే,
తీసుకున్న నిర్ణయాలు
ఆచరణలో పెట్టిన ఆలోచనలే
లెక్కలోకి వస్తాయి.
అవే ఆత్మ సంతృప్తిని ఇస్తాయి,
జీవన సాఫల్యతను చూపిస్తాయి.

కొన్ని జీవితాలు
ఊహలకే పరిమితం,
నిర్ణయాత్మకత శూన్యం,
కబుర్లెక్కువ, పనితక్కువ,
అది అనుభవ రాహిత్యానికి,
అంతులేని అయోమయానికి, కారణమవుతుంది.
అంతేకాదు
వాస్తవాన్ని గుర్తించలేని
అంధత్వాన్నీ ఇస్తుంది.

ఆలోచనంటు వచ్చాక,
సమయాతీతం కాకుండా
నిర్ణయం తీసుకోవటం,
ఆచరణలో పెట్టడం,
దాన్నే పట్టుకుని ఉండటం,
ఎవరైతే చేస్తారో,
వాళ్ళే విజేతలు,
చైతన్య స్ఫూర్తిప్రదాతలు.