Friday 10 April 2020

ఓపిక

చల్లని శీతాకాలం;
హిమం పేరుకుని గట్టిబడి,
ఉన్నంతంగా ఎదుగుతుంది.
మండు వేసవిలో అది  మెత్తబడి,
ద్రవీభవించి కరిగి పారుతుంది.

ఈ సూత్రం మనసుకు వర్తించదేమో?
క్రోధాగ్నితో గట్టిబడిన వేళ
అది కర్కశమై కరడుగడుతుంది,
భావావేశంతో మెత్తబడినపుడు
సున్నితమై ద్రవీభవిస్తుంది.
కరడుగట్టిన మనసు హీనం,
మెత్తబడిన మనసు ఉన్నతం.

కానీ సమాజం ఎందుకని;
కరిగిపోయే మనసును హిమాలయంతో,
కరడుగట్టిన మనసును అధఃపాతాళంతో
పోలుస్తుంది?

మూర్ఖత్వం పేరుకుంటే చీకటి;
అది అగాధపు అంచులు చూపుతుంది.
ప్రేమతత్వం పేరుకుంటే వెలుగు;
అది మానవతా విలువలు పెంచి,
ఎవరెస్టుపై కూర్చోబెడుతుంది.

కొన్ని మాటలు, కొన్ని భావాలు
చూడగానే అలాగే విపరీతంగా తోస్తాయి.
తరచి తరచి చూస్తే,
విషయం తేటతెల్లమవుతుంది.
ఎటొచ్చీ అర్థం చేసుకోవడానికి,
కొంత ఓపిక, భావం వైశాల్యం కావాలంతే!

‌సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042