Sunday 21 June 2020

గ్రహణం

వచ్చింది గ్రహణం,
మరణం కాదు,
దీనికే కంగారా?

మార్చినుంచే మార్పు వచ్చింది
ప్రపంచానికి గ్రహణం పట్టింది.
ఎప్పుడు ఎవరికి మూడుతుందో?
ఎవరు ఎవరికి మృత్యుఘంటిక మోగిస్తాడో?
తెలియక పోయినా జనం,
ధైర్యంగా తిరగటం లేదు?

కాటేసే రోగానికే భయపడని జనం,
కాపాడే సూర్యుడు,
కాసేపు కనబడకపోతే,
రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో?

గ్రహణం లో స్మరణం చాలు,
ప్రశాంతమైన చిత్తం మేలు,
విత్తం లేని రోజుల్లో
మొత్తం ఆచారం పాటిస్తే
దుఃఖమే మిగులుతుంది.

ఎన్ని సార్లు రాహువు మింగినా,
సూర్యుడు చిరంజీవే,
సకల విద్యలకు గురువు భాస్కరుడు.
అందుకే!
"గురూణాం గురుః ప్రాభాకరః" అన్నారు.
ఆయనకు తెలియదా?
గ్రహణం వస్తుందని,
రాహువు కాటేస్తాడని.
అయినా పట్టించుకోడు,
చేసే పనినుండి  తప్పించుకోడు.
గ్రహణం లో గ్రహించాల్సింది అది.

తప్పదని తెలిసిన కష్టంతో
సహజీవనం చేయాలి.
అనవసరమైన కంగారుతో
అక్కర్లేని ఆందోళన మానాలి.
మన ప్రయాణంలో ఇవన్నీ మామూలే
ఈ విషయమే గ్రహించాలి.

గ్రహించేది గ్రహమైతే
గ్రహింపు తెచ్చేది గ్రహణమేమో!

గ్రహణం లో మర్మం గ్రహించండి.
అంతా సవ్యంగానే ఉంటుంది
మీ అంతః సాక్షికి అవగాహనొస్తే
ఆ కర్మ సాక్షి కరుణించినట్టే.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042