Tuesday, 23 June 2020

నేనున్నానని తెలపాలని ఉంది.

మస్తక సీమను చల్లటి గాలి
శీతలంగా తాకినట్టు
ఎగిరే ముంగురులు పొందికచేసి 
తలపైకి  నిమిరినట్టు,
అలసిన ముఖాన్ని  అంగీతో తుడిచినట్టు,
అనుకోనిది సాధిస్తే,
ఆప్యాయంగా బుగ్గలు నిమిరినట్టు,
 పసిపాపల మేనును సున్ని పిండితో
మృదువుగ  నల్చినట్టు,
నీవు ఒంటరివి కాదంటూ వీపుపై రాసి,
నేనులేనూ! అని ధైర్యం చెప్పినట్టు,
వివిధ రకాల అనుభూతుల్ని పంచేలా
నా అభిమానం నీకు తెలిసేలా,
నిను తాకాలని ఉంది.

దేహానికి చిరుగాయమైన్నప్పుడు
ఆ బాధ  చూడలేక,
చూపుడు వేలితో 
గాయం చుట్టు రాసినట్టు,
నా స్పర్శతో
నీకు సాంత్వన చేకూర్చాలని ఉంది.

శీతాకాలం తొలిపొద్దు
పక్క దిగనియ్యని బద్ధకంలో
చలిని తరిమేలా, చైతన్యం హెచ్చేలా,
నులివెచ్చని  కపోలాన్ని
బుగ్గాకాన్చి రాసినట్టు,
నా ఉనికి నీకానందం కలిగించేటట్టు
నిను తాకాలని ఉంది.

స్పర్శ అదే
దాని వెనుక భావాలే వేరు,
ఒక్కక్క స్పర్శలో ఒక్కొక్క ఆనందం,
దాన్నిబట్టేగా అనుభవంలో గమ్మత్తులు,
మనసుపడి ఇచ్చే  ఒక్క స్పర్శ చాలదూ,
మనసు తేలిక కావడానికి,
ఆనందంలో తేలిపోవడానికి,
అందుకే తాకాలని ఉంది,
నా అభిమానం నీకు చెప్పాలని ఉంది.

ఒకే ఒక్క స్పర్శలో
ఇన్ని అనుభూతులు తెలపలేక
నాలో ఉన్న అనురాగం 
ఏక కాలంలో నీకు చెప్పాలని,
నా స్పర్శ చేతితో కాక
నా కలంతో  తెలియజేస్తున్నా.

ఈ భావ స్పర్శ నీ మనసును తాకితే
నువ్వే గ్రహిస్తావు,
సర్వకాల సర్వావస్థలలో
తోడుగా నిలిచేందుకు
నీకంటూ నేనున్నానని.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 9492732042