Saturday, 4 July 2020

ప్రపోజల్

ఎదురుగా ఉన్న కొలీగ్ కి ఏం రకంగా ప్రపోజ్ చేయాలా? అని తలబద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్న ఆనంద్ కి అనుకోకుండా ఓ ఉపాయం తట్టింది. అనుకున్నదే తడవుగా తన ఆలోచనని ఆఫీస్ కేంటీన్ లో ఒంటరిగా కనిపించిన ఆ అమ్మాయి ముందు అమలులో పెట్టాడు.

"ఓ మంచి ప్రేమ కథ రాయాలనుంది. నీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉంటే చెబుతావా?" నెమ్మదిగా అడిగాడు.

అతనివైపు ఓ సారి విచిత్రంగా చూసి, "ఇంతకు ముందు ఏమైనా వ్రాశావా? అడిగింది అనూష.

లేదు ఇదే తొలి ప్రయత్నం.

మొదటిస కథకే  ముష్టెత్తుకుంటే ఇక నువ్వు రాసేదేవిటి? నీ ముఖం. బెటర్ యూ ఛూజ్ అదర్ బిజినెస్ అంది అనూష.

అనుకోని సమాధానానికి అవాక్కయ్యాడు ఆనంద్. 

అయినా సరే,  ఈవేళ తాడో పేడో తేల్చుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు. అందుకే పట్టుదల వదలని విక్రమార్కుడు లాగా తిరిగి కంటిన్యు చేశాడు. 

ఏంచేస్తాం? ఏదో ఒక హాబీ ఉండాలి కదా. అందుకే ఆలోచించి కథలు రాయాలను కుంటున్నా. ఎలా రాయాలో తెలియటం లేదు. నువ్వు పుస్తకాల పురుగువి కదా! అందుకే హెల్ప్ అడిగా, అన్నాడు.

అంటే నీ కంటికి నేను పురుగులా కనిపిస్తున్నానా? మనిషిగా కనిపించటం లేదా? విసురుగా అంది.

తెల్లమొహం వేశాడు ఆనంద్.

నా ఉద్దేశం అలా అని కాదు. నువ్వు బాగా చదువుతావు కదా, ఆ రకంగా అన్నా".

చదివినంత మాత్రానే కథలు రాయగలిగితే నేనే రైటర్ గా మారే దాన్నిగా. ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? నిష్టూరంగా అంది.

ఆ సమాధానానికి మైండ్ బ్లాంక్ అయ్యి, ఈ సారి మొహం నల్లబడింది.

రాంగ్ డైరెక్షన్ లో ప్రపోజల్ ప్లాన్ చేశానా? అనిపించింది ఆనంద్ కి. ఇక మాట పెగల్లేదు. 

కాసాపాగి అనూషే అంది. ఏంటి మాట పడిపోయింది? ఇక నువ్వు అడిగేదేమీ లేకపోతే బయలుదేరతా అంది.

వెంటనే తత్తరపడి నోరు పెగల్చుకుని అన్నాడు.

అదికాదు అనూ! ప్రేమ కథ రాయాలంటే ఒక కుర్రాడు, ఒకమ్మాయి తో ప్రపోజ్ చేసినట్టు రాయాలి కదా! అది ఎలా మొదలుపెట్టాలో తెలియటం లేదు. నేనెప్పుడూ ఎవరికీ ప్రపోజ్ చేయలేదు. 

అంటే నేను లేచిన దగ్గర నుంచి ఇదే పనిమీద ఉంటాననా? నీ ఉద్దేశం అంది. 

ఆ మాట వినగానే అతని రక్తం ఒకసారి స్తంభించి, మొహం నీలి వర్ణంలోకి వచ్చేసింది. అంతలోనే తేరుకుని " ఛ,ఛ నా ఉద్దేశం అదికాదు. నువు చదివిన కథల్లో ఇలాంటి సన్నివేశాలుండి ఉంటే ఏదైనా క్లూ ఇస్తానని.‌

ఎవడో రాసిన దానిని కాపీ కొడితే ఇక నువ్వు రాసే దేముంది? 

అనుక్షణం అడ్డుపడుతూ అడిగిన దానికి అడ్డదిడ్డంగా మాట్లాడే ఆ పిల్లంటే చికాకుతో కూడిన కోపం వచ్చి ఈ సారి అతని ముఖం జేగురు రంగులోకి వచ్చింది. అతని తల వంగింది. దవడ నరం బిగుసుకుంది. 

అతని పరిస్థితి గ్రహించిన అనూషే తిరిగి అంది, ఎవరో రాసిన దానిని నీ ఆలోచనగా చెప్పుకుని కాపీ కొడితే ఎలా ఆనంద్! ఏ ఆడపిల్లైనా తనని ఇష్టపడేవాడు ఎంత రసాత్మకంగా ప్రపోజ్ చేస్తున్నాడో చూసి ఇంప్రెస్ అవుతుంది, అంది.

రసాత్మకం అంటే? ప్రశ్నించాడు ఆనంద్.

నువు సాయంత్రం ఎక్కడ భోజనం చేస్తావు? అతనడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వటం ఇష్టం లేదన్నట్టు టాపిక్ డైవర్ట్ చేసింది. 

అసందర్భంగా అనిపించినా తాను రోజు భోజనం చేసే మెస్ పేరు చెప్పాడు ఆనంద్. 

రోజూ అక్కడే ఎందుకు తింటావ్? అడిగింది.

అక్కడ భోజనం బాగుంటుంది. 

అక్కడొక చోటే బాగుంటుందా? ఇంకెక్కడా బాగోదా? అతన్నే చూస్తూ అంది.

ఏమో పెద్దగా ట్రై చెయ్యలేదు. 

"ట్రై చేయి" అంది.

దేనికి? అనుమానంగా అన్నాడు.

అలా చేస్తేనే కదా! అన్నిటికన్నా ఎక్కడ బావుంటుందో తెలిసేది, అంది.

ట్రై చేసి ఏం చేయాలి?

ఒక నిర్థారణకు రావాలి. అలా వచ్చాక, ద బెస్ట్ హొటల్ అనిపించిన దానికి,  నీకు నచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళి, ఒక గ్లాసు నిండా, అక్కడ రుచిగా కాచిన రసం పోసి, అప్పుడు ప్రపోజ్ చేయాలి. దాన్నే రసాత్మకంగా ప్రపోజ్ చేయటం అంటారు, ఉబికి వచ్చే నవ్వును అదిమి పట్టి చెప్పింది.

ఈ సారి సిగ్గుతో అతని ముఖం ఎర్రబడింది. కానీ ఎంత మాత్రం తగ్గకుండా అన్నాడు, ఈ మాత్రం దానికి కష్టపడి చదివి ఇలా కెరీర్ పెంచుకున్న మగాళ్ళెందుకు? రసం బాగా పెట్టే మగాళ్ళు చాలు, మీ ఆడవాళ్ళకి అన్నాడు.

గుడ్, బాగా గ్రాస్ప్ చేశావ్! ఇక నేను బయల్దేరతా, అంది.

ఇంకో ముక్క మాట్లాడితే చంపేస్తా. ముందక్కడ కూర్చో. ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక చస్తూంటే, ఇందాకటి నుంచి చంపేస్తున్నావ్. నోరు మూసుకుని నేనడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎవరి గురించో వదిలేయ్, నీకు ఎవరైనా ప్రపోజ్ చేసినపుడు ఎలా చేస్తే ఇష్టపడతావో చెప్పు, మిగతాది నేను చూసుకుంటా అన్నాడు.

ఇలాంటి పిచ్చి వేషాలు నా దగ్గర ఎవరైనా వేస్తే చెప్పుతెగిపోతుంది. అంతే స్పీడుగా చెప్పింది అనూష.

అంటే ఎవరైనా ప్రపోజ్ చేస్తే నీకిష్టం ఉండదా? నిరాశగా అడిగాడు.

ప్రతీ ఆడపిల్లకి కొన్ని ఇష్టాలు ఉంటాయ్. నా వరకూ ఎవడూ డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తే ఇష్టం ఉండదు. మర్యాదగా మా పెద్దవాళ్ళకి మధ్యవర్తుల ద్వారా సంప్రదిస్తే ఇష్టం. ఎందుకంటే దానిలో ఓ గౌరవం, మర్యాద ఉంటుంది అంది.

అలాఎవరు ప్రపోజ్ చేసినా ఒప్పేసుకుంటావా? నిస్పృహగా అన్నాడు.

ఎందుకు ఒప్పుకుంటా, అలా అడిగిన వాళ్ళు నాకూ నచ్చాలి కదా! 

నీకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారు?

అది నీకు అనవసరం, అంది.

అంతేనా?

అంతే, అని లేచింది.

ఏం చేయాలో తెలియని ఆనంద్ ఆమెకేసే పిచ్చి చూపులు చూస్తూ అలాగే ఉండిపోయాడు.

డోర్ వరకూ వెళ్ళి బయటకు అడుగు పెట్టబోతూ, ఓసారి వెనక్కి తిరిగి చూసిన అనూషకు ఆనంద్ ని చూస్తే జాలేసింది. 

ఓసారి ఇలారా, అన్నట్టు పిలిచింది. 

అయోమయంలో ఉన్న ఆనంద్ ఏమిటన్నట్టు ఆమె వద్దకు వెళ్ళాడు.

నా ఇష్టా ఇష్టాలు ఎవరితో చెప్పటం నాకిష్టం ఉండదు. అయినా మంచివాడివి కాబట్టి నీకు చెబుతున్నా. నేను ఇష్టపడేవాడు నీలా ఉంటే చాలు, అని చటుక్కున బయటకు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

ఒక్కసారిగా ఆనంద్ ముఖం వేయికాంతులతో నిండి పోయింది. 

ఈ సారి అతని ముఖంలో అన్నిరంగులూ కలిసిపోయిన ధవళ వర్ణం కనబడింది. అది తృప్తికి, ఆనందానికి సంకేతం.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి