Saturday, 4 July 2020

చిరునవ్వుతో అన్నాడు.

కను రెప్ప కాలం, 
మాత్ర. 
డెభ్భై రెండు సార్లుగుండే స్పందిస్తే 
నిముషం.

మాత్రలు మింగుతూ,
కాలంతో స్పందిస్తూ,
తన పని తాను చేసుకుంటూ పోతోంది,
శ్వరం కాని శరీరం.

చూస్తూండగానే 
బాల్యం, యవ్వనం,ప్రౌఢం,
మైలు రాళ్ళు దాటింది,
సుఖమైన ప్రయాణానికి
భారాలు కూడదని తెలిసినా
బంధాలు ఆటంకాలని తెలిసినా
ఇష్టంతోటే కొన్ని తగిలించుకుంది
భారం మోస్తూ ముందుకెడుతూనే ఉంది...
సమయమే తెలీకుండా!

ముందే  నిర్ణయించిన
స్టాప్ వాచ్ జీవ గడియారంలో
కాలం ఖర్చు రాయబడుతూనే ఉంది,
చిత్రగుప్తుని ఆధ్వర్యంలో.

లెక్కకు మించిన మాత్రలు
మింగడం వల్లేమో
సైడ్ ఎఫెక్ట్ ఎక్కువయ్యి
శరీరం వణుకుతూ బలహీన పడింది.

వార్ధక్యం వాకిట్లోకి సుస్వాగతం బోర్డులా,
కదిలే పళ్ళు, నెరిసిన జుట్టు,
వంగిన నడుము, జారేతోలు
కనబడుతూ పలకరించాయ్.

శ్వాస మందగిస్తోంది,
కను రెప్ప కదలనంటోంది.
గుండె స్పందనతో నడిచే
జీవ గడియారం లబ్ డబ్ ల 
ధ్వనులు నెమ్మదిస్తున్నాయ్,

రెక్కాటలు, డొక్కాటలు ఆగిపోయాయ్.
రెప్పాడని బ్రతుకులో 
మాత్రలతో అవసరం లేదు.
గుండె ఆగిపోయేవేళ
కాలంతో పనిలేదు.

వాస్తవం గుర్తించగానే,
బంధనాలు తెగిపోయాయి,
భూమి సైతం ఆకర్షించ లేక పోతోంది.
ఆత్మ తేలికయ్ ఆకాశవీధికి చేరుతోంది.

నువు అర్నిమేషుడివయ్యావని
చిత్రగుప్తుడు ప్రకటించాడు.
కంగారెందుకు? నేటితో నీవు 
కాల పురుషునిలో భాగం అయ్యావ్
అన్నాడు, చిరునవ్వుతో శివుడు.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి